RBI rules on holding more than one bank accounts: మన దేశంలో వందల కోట్ల సంఖ్యలో బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయి. వాటిలో సేవింగ్స్‌ అకౌంట్ల (Savings Accounts) సంఖ్య ఎక్కువ. ఈ ఏడాది ప్రారంభంలో, 'విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022' పేరుతో విడుదలైన రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆ రిపోర్ట్‌ ప్రకారం, 2023 జనవరి చివరి నాటికి భారతదేశంలో ఉన్న మొత్తం డిపాజిట్ ఖాతాల సంఖ్య ‍‌(Bank Accounts in India) 225.5 కోట్లు. వీటిలో, దాదాపు దాదాపు 147 కోట్ల ఖాతాలు పురుషుల పేరిట ఉన్నాయి. మిగిలిన దాదాపు 79 కోట్ల అకౌంట్లు మహిళల పేరిట ఉన్నాయి. 


ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, భారతదేశంలో ఉన్న మొత్తం బ్యాంక్‌ డిపాజిట్‌ ఖాతాల్లో మూడింట రెండు వంతుల అకౌంట్లు మగవాళ్లవి. మిగిలిన ఒక వంతు ఆడవాళ్లవి. షెడ్యూల్డ్ కమర్షియల్‌ బ్యాంకులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, మొత్తం డిపాజిట్ అకౌంట్లలో మహిళల వాటా ఐదో వంతు మాత్రమే. 


ఇప్పటి డిజిటల్ యుగంలో బ్యాంకు ఖాతా లేకపోతే ఏ పనీ జరగడం లేదు. ఇప్పుడంతా UPI (Unified Payments Interface) హవా నడుస్తోంది కాబట్టి బ్యాంక్‌ అకౌంట్‌ ప్రాధాన్యత ఇంకా పెరిగింది. 


ప్రస్తుతం మన దేశ జనాభా 140 కోట్లు దాటింది. బ్యాంక్‌ అకౌంట్ల సంఖ్య ఈ ఏడాది ప్రారంభంలోనే 225.5 కోట్లకు చేరాయి. ఈ లెక్కన, సగటున, ప్రతి భారతీయ పౌరుడికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. 


ఇప్పుడు ఆర్‌బీఐ రూల్స్‌ విషయానికి వద్దాం. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే ఏవైనా ఇబ్బందులు వస్తాయా?, ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందా?, రూల్స్‌ ఎలా ఉన్నాయి అన్న ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. 


బ్యాంక్‌ అకౌంట్ల విషయంలో ఆర్‌బీఐ రూల్స్‌


వాస్తవానికి, ఒక వ్యక్తి పేరిట గరిష్టంగా ఎన్ని బ్యాంక్‌ అకౌంట్లు ఉండాలన్న విషయంపై రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ఎలాంటి పరిమితి విధించలేదు. మన దేశంలో, ఒక వ్యక్తి తనకు ఇష్టం వచ్చినన్ని బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేయొచ్చు, నిర్వహించుకోవచ్చు. ఈ విషయంలో ఎవరూ అడ్డుపడరు. 


బ్యాంక్‌ అకౌంట్‌ అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. శాలరీ అకౌంట్స్‌ వరకు జీరో బ్యాలెన్స్‌తో నడిచినా, సేవింగ్స్‌ ఖాతాల్లో మాత్రం కనీస నగదు నిల్వ ‍‌(Minimum cash balance in savings accounts) ఉంచాలి. కాబట్టి, భరించే స్థోమత మీకు ఉంటే, ఎన్ని ఖాతాలైనా ప్రారంభించొచ్చు. మినిమమ్‌ బ్యాలెన్స్‌ అనేది బ్యాంక్‌ను బట్టి, అకౌంట్‌ ఉన్న ప్రాంతాన్ని బట్టి మారుతుంది.


ఎక్కువ ఖాతాలు ఉంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువ


ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ను కొనసాగించలేకపోతే, బ్యాంక్‌ మీకు పెనాల్టీ విధిస్తుంది. జరిమానా డబ్బులు నేరుగా మీ అకౌంట్‌ నుంచి కట్‌ అవుతాయి. ఒకవేళ, పెనాల్టీ కట్టడానికి సరిపడా డబ్బులు అకౌంట్‌లో లేకపోతే, బ్యాంక్ అకౌంట్ మైనస్‌లోకి వెళ్తుంది. మీరు ఎప్పుడైనా ఆ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తే, బ్యాంక్‌ బకాయిల కింద తక్షణమే ఆ డబ్బులు కట్‌ అవుతాయి.


దీంతోపాటు, ఓపెన్‌ చేసిన ప్రతి బ్యాంక్‌ అకౌంట్‌కు మీకు ఒక డెబిట్‌ కార్డ్‌/ఏటీఎం కార్డ్‌ ‍‌(Debit Card/ATM Card) వస్తుంది. ఎన్ని బ్యాంక్‌ అకౌంట్లు ఉంటే అన్ని డెబిట్‌ కార్డ్‌లు మీ జేబులో జమ అవుతాయి. ఈ బ్యాంక్‌ ఖాతాలు, డెబిట్‌ కార్డ్‌లు, ఏటీఎంల నిర్వహణ ఛార్జీల ‍‌(Maintenance charges) కింద బ్యాంక్‌లు ఏటా కొంత మొత్తాన్ని వసూలు చేస్తాయి. దీనర్ధం, ఎక్కువ బ్యాంక్‌ అకౌంట్‌లు ఉంటే, నిర్వహణ ఛార్జీల కింద ఎక్కువ డబ్బును బ్యాంక్‌లకు సమర్పించుకోవాలి. 


బ్యాంక్‌ అకౌంట్‌ల లావాదేవీలకు సంబంధించిన మెసేజ్‌లు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ఎక్కువ ఖాతాలు ఉంటే ఎక్కువ సందేశాలు వస్తుంటాయి, వాటిని మీరు సరిగా పట్టించుకోకపోవచ్చు. అలాంటి సందర్భంలో, మీ ఖాతాలో మోసపూరితంగా డబ్బు కట్‌ అయినా మీరు గుర్తించలేకపోవచ్చు. 


ఇంకా, బ్యాంక్‌ ఖాతాల నంబర్లు, వాటిలో నగదు నిల్వలు, జరిపిన లావాదేవీలు, ఏటీఎం కార్డ్‌ పిన్‌ వంటివి గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. ఎలా చూసినా, ఎక్కువ ఖాతాలు ఉంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి, మీకు అవసరమైన ఖాతాలను మాత్రమే కొనసాగించి, మిగిలిన వాటిని క్లోజ్‌ చేయడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ప్రారంభ లాభాలపై పట్టు కోల్పోయిన మార్కెట్లు - చేతులెత్తేసిన సెన్సెక్స్, నిఫ్టీ