Parliament Winter Season: ఇప్పుడు, దాదాపు ప్రతి ఒక్కరి పేరిట ఏదోక బ్యాంక్‌ ఖాతా ఉంది. కాబట్టి, ఈ వార్త ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు (సోమవారం, 25 నవంబర్‌ 2024) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సెషన్‌లో, బ్యాంకింగ్ రంగంలో నూతన మార్పులు తీసుకువచ్చే "బ్యాంకింగ్ సవరణ బిల్లు"ను (Banking Amendment Bill) ఆమోదింపజేసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.


ఖాతాదార్లకు కొత్త నామినీ రూల్స్‌ 
బ్యాంక్‌ ఖాతా నామినీకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. బ్యాంకింగ్ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత నయా రూల్స్‌ అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం, లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న బ్యాంకింగ్ సవరణ బిల్లును ఆమోదించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో, కేంద్ర మంత్రివర్గం బ్యాంకింగ్ సవరణ బిల్లును ఆమోదించింది.


బ్యాంకింగ్ సవరణ బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) గతంలోనే హింట్‌ ఇచ్చారు. ఇందులో జరగబోయే ప్రధాన మార్పులు బ్యాంకు ఖాతాలకు, ఖాతాదార్లకు కూడా ముఖ్యమైనవి. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2024 ప్రకారం, బ్యాంకు ఖాతాల్లో నామినీల పేర్ల సంఖ్యను నాలుగుకు పెంచే ప్రతిపాదన ఉంటుంది. బ్యాంకింగ్ సవరణ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభిస్తే, ప్రతి ఒక్కరూ తమ బ్యాంక్ ఖాతాలో 4 నామినేషన్లు (నలుగురు నామినీల పేర్లు) చేర్చడం తప్పనిసరి అవుతుంది. ప్రస్తుతం, ప్రతి బ్యాంకు ఖాతాలో నామినీ పేర్ల సంఖ్య ఒకటిగా ఉంది. అంటే, బ్యాంక్‌ అకౌంట్‌లో కేవలం ఒక్కరిని నామినీగా చూపుతున్నారు, ఇకపై నలుగురిని యాడ్‌ చేయాలి. 


బ్యాంకింగ్‌ సవరణ బిల్లు ప్రత్యేకతలు
బ్యాంక్ ఖాతాదారు నామినీలకు తన ప్రాధాన్యత ఆధారంగా ర్యాంక్ ఇవ్వాలి లేదా బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ప్రతి నామినీకి నిర్ణీత వాటా నిర్ణయించవచ్చు. బ్యాంక్‌ అకౌంట్‌ నామినీ ఆప్షన్‌లో మొదటి, రెండవ, మూడవ, నాలుగవ నామినీ పేర్లను ఖాతాదారు నిర్ణయించాలి. ఒకవేళ అకౌంట్‌ హోల్డర్‌ మరణిస్తే, ర్యాంకింగ్‌ ప్రకారం, నలుగురు నామినీలు క్రమపద్ధతిలో ఖాతాపై హక్కులు పొందుతారు. అంటే.. మొదటి నామినీ మరణిస్తే రెండో నామినీ, మొదటి ఇద్దరు చనిపోతే మూడో నామినీ లేదా మొదటి ముగ్గురు చనిపోతే నాలుగో నామినీకి ఆ ఖాతాపై హక్కు వస్తుంది. 


ఇది కాకుండా, ఖాతాదారు మరణించిన తర్వాత ఆ ఖాతాపై నలుగురు నామినీలకు ఏకకాలంలో హక్కు వచ్చేలా చూడొచ్చు. తద్వారా, ప్రతి నామినీకి ఖాతా మొత్తంలో కొంత భాగాన్ని ఇవ్వొచ్చు. ఇందులో ప్రాధాన్యత క్రమం ఉండదు. 
ప్రతి నామినీకి ఖాతా మొత్తం, వడ్డీ మొదలైన వాటిలో స్థిరమైన/సమానమైన వాటా వస్తుంది.


2024 ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బ్యాంకింగ్ బిల్లు ద్వారా కొన్ని బ్యాంక్‌ చట్టాలను సవరించారు. అవి:


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1955
బ్యాంకింగ్ కంపెనీలు (అక్విజిషన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌) చట్టం, 1970
బ్యాంకింగ్ కంపెనీలు (ట్రాన్స్‌ఫర్‌ అండ్‌ అక్విజిషన్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌) చట్టం, 1980


మరో ఆసక్తికర కథనం: ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఐపీవో అలాట్‌మెంట్‌ స్టేటస్‌ను ఇంట్లో కూర్చునే ఇలా చెక్‌ చేయండి