NTPC Green IPO Allotment Update: ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీవో కోసం బిడ్డింగ్ విండో గత వారం శుక్రవారం క్లోజ్‌ అయింది. ఈ ఐపీవో ఎలాట్‌మెంట్‌ ప్రకటన కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ షేర్ల కేటాయింపు స్థితి ఈ రోజు (సోమవారం, 25 నవంబర్‌ 2024) వెల్లడవుతుంది.


ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీవో పెట్టుబడిదార్లు BSE వెబ్‌సైట్ లేదా ఇష్యూ రిజిస్ట్రార్, కేఫిన్‌ టెక్నాలజీస్, వెబ్‌సైట్ ద్వారా తమ అప్లికేషన్‌ స్టేటస్‌ను ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో చెక్‌ తేసుకోవచ్చు.


BSE వెబ్‌సైట్‌లో IPO స్టేటస్‌ను ఇలా చెక్‌ చేయండి:
bseindia.com/investors/appli_check.aspx లింక్‌ ద్వారా నేరుగా BSE వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.
ఇష్యూ టైప్ డ్రాప్‌డౌన్‌ మెనూలో 'Equity'ని, ఇష్యూ నేమ్‌ మెనులో 'NTPC Green Energy Limited'ను ఎంచుకోండి.
తర్వాత మీ అప్లికేషన్ నంబర్ లేదా పాన్ కార్డ్ వివరాలను నమోదు చేయాలి. ఇప్పుడు, 'I'm not a robot' బాక్స్‌లో టిక్‌ పెట్టాలి.
ఇప్పుడు, Search ఆప్షన్‌ మీద క్లిక్ చేయండి. తదుపరి స్క్రీన్‌లో మీ కేటాయింపు వివరాలు కనిపిస్తాయి.


రిజిస్ట్రార్ వెబ్‌సైట్‌లో IPO స్టేటస్‌ను ఇలా చెక్‌ చేయండి:
https://ipostatus.kfintech.com/ లింక్‌ ద్వారా KFinTech వెబ్‌సైట్‌లోకి నేరుగా లాగిన్ కావాలి.
'Select IPO' డ్రాప్‌డౌన్ మెను నుంచి 'NTPC Green Energy Limited'ను ఎంచుకోండి.
ఇప్పుడు, మీ అప్లికేషన్ నంబర్, పాన్ కార్డ్ లేదా మీ డీమ్యాట్ ఖాతా నంబర్‌ నమోదు చేయండి. 
ఇతర అవసరమైన వివరాలను పూరించి క్యాప్చాను ఎంటర్‌ చేసి Submit బటన్‌ నొక్కండి. 
ఇప్పుడు ఓపెన్‌ అయ్యే స్క్రీన్‌లో మీ అప్లికేషన్ స్టేటస్‌ కనిపిస్తుంది.


గ్రే మార్కెట్ ప్రీమియం
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, NTPC గ్రీన్ ఎనర్జీ షేర్లు గ్రే మార్కెట్‌లో రూ. 3-4 మధ్య చాలా స్వల్ప ప్రీమియంతో ట్రేడ్‌ అవుతున్నాయి. గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఆ ఇష్యూ పట్ల పెట్టుబడిదారుల అభిప్రాయాలను, తుది లిస్టింగ్‌పై ఉన్న అంచనాలను సూచిస్తుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం, 27 నవంబర్ 2024న, NTPC గ్రీన్ ఎనర్జీ షేర్లు స్టాక్ మార్కెట్‌లో అరంగేట్రం చేస్తాయి. బలహీనమైన GMPని బట్టి, లిస్టింగ్‌ రోజున ఈ స్టాక్‌ తన పెట్టుబడిదార్లకు నిరుత్సాహం కలిగించే సూచనలు ఉన్నాయి.


గ్రే మార్కెట్ అధికారిక స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా నడుస్తుంది. దలాల్ స్ట్రీట్‌లో ఒక IPO అధికారికంగా అరంగేట్రం చేయడానికి ముందు పెట్టుబడిదారులు గ్రే మార్కెట్‌లో ట్రేడ్‌ చేస్తారు. గ్రే మార్కెట్‌లో IPO డిస్కౌంట్‌లో ఉంటే, ఇన్వెస్టర్లు ఆ లిస్టింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని అర్ధం. ఒక IPO ప్రీమియంతో ట్రేడ్‌ అయితే, ఆ ఇష్యూపై పెట్టుబడిదార్లకు ఉన్న విశ్వాసాన్ని అది సూచిస్తుంది.


IPOలో షేర్లు దక్కించుకున్న ఇన్వెస్టర్లకు నవంబర్‌ 26న వారి డీమ్యాట్‌ ఖాతాల్లో షేర్లు క్రెడిట్‌ అవుతాయి. ఐపీవోలో షేర్లు దక్కని ఇన్వెస్టర్లకు రిఫండ్ ప్రక్రియ నవంబర్ 26న ప్రారంభమవుతుంది. 


NTPC గ్రీన్ ఎనర్జీ IPO నవంబర్ 19న ప్రారంభమై 22న క్లోజ్ అయింది. దీని ద్వారా కంపెనీ రూ.10,000 కోట్లు సమీకరించింది. IPO ప్రైస్ బ్యాండ్ ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 102 - రూ. 108 మధ్య ఉంది.


మరో ఆసక్తికర కథనం: స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ పరేడ్‌ - సెన్సెక్స్‌ 1300 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు హైజంప్‌