Credit Card Loan Rules: అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు క్రెడిట్ కార్డ్ లోన్ ఒక సులభమైన మార్గంగా కనిపిస్తుంది. అన్ని బ్యాంక్ లోన్‌ల లాగే ఇది కూడా ఒక రుణం. సాధారణంగా, ముందస్తుగా అప్రూవ్ అయిన లోన్ (pre-approved loan) రూపంలో ఉంటుంది. క్రెడిట్ కార్డు అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితిపై ఈ లోన్ లభిస్తుంది, తక్షణం డబ్బు తీసుకోవచ్చు.
క్రెడిట్ కార్డ్ లోన్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు (Things to know about credit card loans)
ఎంపిక చేసిన కస్టమర్ల కోసం: సాధారణంగా, ఎంపిక చేసిన కస్టమర్లకు, ముఖ్యంగా మంచి క్రెడిట్ చరిత్ర ఉన్నవారికి బ్యాంకులు క్రెడిట్ కార్డ్ రుణాలు అందిస్తాయి. కస్టమర్లను నిర్దేశిత ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేస్తారు కాబట్టి ఈ రుణాలకు ముందుస్తుగానే ఆమోదం (pre-approved loan) లభిస్తుంది. ఈ లోన్ తీసుకోవడానికి ప్రత్యేకం దరఖాస్తు చేయడం లేదా డాక్యుమెంటేషన్ అవసరం లేదు.
ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు: క్రెడిట్ కార్డ్ రుణాలపై వడ్డీ రేట్లు రుణదాతను బట్టి మారుతూ ఉంటాయి. ప్రస్తుతం, 10.8 శాతం నుంచి 24 శాతం వరకు వసూలు చేస్తున్నారు. ఈ రేట్లు వ్యక్తిగత రుణ రేట్ల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, రివాల్వింగ్ క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్ల కంటే తక్కువగా ఉంటాయి.
సులభ వాయిదాల్లో చెల్లింపులు: ఈ రుణాలకు తిరిగి చెల్లించే కాల పరిమితి సాధారణంగా 6 నెలల నుంచి 60 నెలల వరకు ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ వంటి బ్యాంకులు 48 నెలల వరకు రీపేమెంట్ పిరియడ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులు 60 నెలల వరకు గడువు అందిస్తున్నాయి.
ప్రాసెసింగ్ ఫీజ్: చాలా బ్యాంక్‌లు రుణ మొత్తంలో 1 శాతం నుంచి 2 శాతం మధ్య ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం, ICICI బ్యాంక్, క్రెడిట్ కార్డ్ లోన్‌పై 1 శాతం ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటోంది. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, SBI వంటివి 2 శాతం వసూలు చేస్తున్నాయి.
తక్షణ రుణం: క్రెడిట్ కార్డులపై రుణాలకు ముందస్తు ఆమోదం ఉంటుంది కాబట్టి ప్రాసెసింగ్ సమయం అత్యంత స్వల్పంగా ఉంటుంది. దాదాపుగా, అప్లై చేసిన నిమిషాల్లోనే రుణ మొత్తం నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది, లేదా క్రెడిట్ కార్డ్ పరిమితి పెరుగుతుంది.
క్రెడిట్ పరిమితిని బట్టి రుణం: మీకు లభించే రుణ మొత్తం మీ క్రెడిట్ పరిమితిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ పరిమితిలో 100 శాతం వరకు రుణాలు ఇస్తున్నాయి. మరికొన్ని బ్యాంక్‌లు, అర్హత గల కస్టమర్లకు పరిమితికి కూడా లోన్ మంజూరు చేస్తున్నాయి. స్టాండర్డ్ చార్టర్డ్, కోటక్ మహీంద్రా వంటి బ్యాంకులు రూ.10-15 లక్షల వరకు క్రెడిట్ కార్డులపై రుణాలను అందిస్తున్నాయి.
వినియోగ పరిమితులు లేవు: వ్యక్తిగత రుణాల మాదిరిగానే క్రెడిట్ కార్డ్ రుణాల వినియోగంపై ఎటువంటి పరిమితులు లేవు. మీ అకౌంట్‌లో డబ్బు క్రెడిట్ అయిన తర్వాత, ఆ డబ్బుతో మీరు ఏం చేశారన్నది బ్యాంక్‌లు అడగవు.
మీరు క్రెడిట్ కార్డ్ లోన్‌కు అర్హులేనా? (Credit card loan eligibility)
క్రెడిట్ కార్డ్ పరిమితి: మీకు అందించే రుణ మొత్తం మీ అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి & ఖర్చుల తీరుపై ఆధారపడి ఉంటుంది.
క్రెడిట్ స్కోర్ & చరిత్ర: మంచి క్రెడిట్ స్కోర్ (750 కంటే ఎక్కువ) ఉంటే రుణ పొందే అవకాశాలు పెరుగుతాయి.
ఖర్చు చేసే అలవాట్లు: మీ కార్డును క్రమం తప్పకుండా & బాధ్యతాయుతంగా ఉపయోగిస్తే మీ రుణ అర్హత పెరుగుతుంది.
చెల్లింపుల చరిత్ర & సామర్థ్యం: క్రెడిట్ కార్డ్‌పై రుణం ఇవ్వడానికి బ్యాంకులు మీ రీపేమెంట్ హిస్టరీని చూస్తాయి.
క్రెడిట్ కార్డ్ రుణాలు అత్యంత వేగంగా మంజూరైనప్పటికీ, సాధారణంగా, వాటి వడ్డీ రేట్లు వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్ల కంటే ఎక్కువగా ఉంటాయి. మీరు క్రెడిట్ కార్డ్ రుణం కోసం చూస్తుంటే... వడ్డీ రేటు, ఛార్జీలు, ఫీజ్‌లు, రీపేమెంట్ పిరియడ్ వంటి అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి.