Hidden Charges In Travel Credit Cards: ఎక్కువగా ప్రయాణాలు చేసే వ్యక్తులకు, ఇతర ప్రదేశాల్లో సెలవులను ఆస్వాదించాలని కోరుకునే వాళ్లకు ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డ్‌లు బాగా ఉపయోగపడతాయి. టిక్కెట్ల బుకింగ్‌పై తగ్గింపుల దగ్గర నుంచి ఎయిర్‌పోర్ట్‌లో ఉచితంగా లాంజ్ యాక్సెస్ వరకు, ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డ్‌లు ప్రోత్సాహకాలు అందిస్తాయి. ఇలాంటి ప్రోత్సాకాల (Perks) వల్ల మన ఖర్చులు తగ్గుతాయని, డబ్బులు ఆదా అవుతాయని అనుకుంటాం. నిజానికి డబ్బులు ఊరికే రావు, ఏదీ ఉచితంగా రాదు.


ట్రావెల్‌ క్రెడిట్ కార్డులు విషయంలో బ్యాంక్‌లు కొన్ని నిబంధనలను దాచి పెడుతుంటాయి. ఇలాంటి రహస్యాల ఫలితంగా, మీ ట్రిప్‌లో మీరు ఊహించినదాని కంటే ఎక్కువ ఖర్చు కావచ్చు. 


ట్రావెల్‌ క్రెడిట్ కార్డ్స్‌లో హిడెన్‌ ఛార్జీలు ‍‌(Hidden charges on travel credit cards)


విదేశీ కరెన్సీ మార్కప్ ఫీజ్‌లు
విదేశాలలో మీ క్రెడిట్ కార్డును స్వైప్ చేసేటప్పుడు, లావాదేవీలు సాధారణంగా విదేశీ కరెన్సీ మార్కప్ ఫీజ్‌కు లోబడి ఉంటాయి. ఈ ఫీజ్‌ లావాదేవీ మొత్తంలో 2 శాతం నుంచి 3 శాతం వరకు ఉంటుంది. దీని అర్థం అంతర్జాతీయంగా ఖర్చు చేసే ప్రతి 100 రూపాయలకు మీరు అదనంగా 3 రూపాయల వరకు రుసుము చెల్లించాలి. కొన్ని కార్డ్‌లపై ఇలాంటి విదేశీ లావాదేవీ రుసుములు ఉండవు. కాబట్టి.. మీ కార్డ్‌తో విదేశాల్లో ఖర్చు చేయాలనుకున్నప్పుడు, మీ బ్యాంక్ అదనపు ఛార్జీలు విధిస్తుందో, లేదో తెలుసుకోవడం బెటర్‌.


వార్షిక & ప్రవేశ రుసుములు
చాలా ట్రావెల్ క్రెడిట్ కార్డులు భారీ స్థాయిలో జాయినింగ్ & యాన్యువల్‌ ఫీజ్‌లు వసూలు చేస్తాయి. మీరు సంపాదించిన రివార్డుల విలువను ఈ ఛార్జీలు మింగేస్తాయి. కాబట్టి, మీరు పొందే ప్రయోజనాలు - మీరు చెల్లిస్తున్న ఫీజ్‌లను అంచనా వేయడం చాలా అవసరం. కొన్ని కార్డులు ఎటువంటి వార్షిక రుసుములు లేకుండా ప్రయాణ ప్రోత్సాహకాలు అందిస్తాయి, అలాంటి వాటిని ఎంచుకోవచ్చు.


డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC)
మీరు విదేశాలలో ఉన్నప్పుడు, అక్కడి వ్యాపారులు మీ కార్డు నుంచి లోకల్‌ కరెన్సీకి బదులుగా భారతీయ రూపాయల్లో తీసుకుంటామని ఆఫర్ చేయవచ్చు. ఈ ప్రక్రియను డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ అని పిలుస్తారు. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, DCCలో మారకపు రేట్ల ప్రభావం & అదనపు ఫీజ్‌లు కలిసి ఉంటాయి. ఇవి అనవసరమైన ఛార్జీలు. కాబట్టి, స్థానిక కరెన్సీలో లావాదేవీలను ఎంచుకోవడం మంచిది.


లాంజ్ యాక్సెస్ ఛార్జీలు
చాలా క్రెడిట్ కార్డులు కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ను అందిస్తున్నాయి. అయితే, బ్యాంక్‌ను బట్టి కొన్ని కార్డ్‌లపై కొద్దిపాటి ఫీజ్‌లు, టాక్స్‌లు ఉండవచ్చు, ఇది మీరు గమనించకపోవచ్చు. ఇలాంటి ఖర్చులకు కళ్లెం వేయడానికి మీ కార్డ్‌ ద్వారా లాంజ్ యాక్సెస్‌ రూల్స్‌ను పూర్తిగా చదవాలి.


రివార్డ్ రిడెంప్షన్‌పై పరిమితి
రివార్డ్ పాయింట్లను కూడబెట్టడం ఒక ఎత్తయితే, వాటిని రీడీమ్ చేయడం మరొక ఎత్తు. కొన్ని కార్డులు చక్కటి రివార్డ్‌ పాయింట్లు ఇస్తాయి గానీ, వాటిని రిడీమ్‌ చేసుకునేప్పుడు విసిగిస్తాయి. బ్లాక్‌అవుట్ తేదీలు లేదా రీడీమ్ చేయగల కేటగిరీల విషయంలో గిరి గీస్తాయి. నిర్ణీత వ్యవధి తర్వాత గడువు రివార్డ్‌ పాయింట్లు ఎక్స్‌పైర్‌ అయ్యేలా కొన్ని కార్డ్‌ల్లో నిబంధనలు ఉంటాయి. ఈ విషయాలను ముందే తెలుసుకోవడం ముఖ్యం.


నగదు ఉపసంహరణ రుసుము
విదేశాల్లోని ATM నుంచి నగదు ఉపసంహరించుకోవడానికి మీ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే, ఆ తేదీ నుంచి ఎక్కువ ఫీజ్‌ & ఎక్కువ వడ్డీ రేట్లు ప్రారంభమవుతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు తడిచి మోపెడవుతుంది. 


సర్వీస్‌ టాక్స్‌లు, ఇతర ఛార్జీలు
కొన్ని క్రెడిట్ కార్డులను ఉపయోగించినప్పు ఫీజ్‌లు & ఇతర ఛార్జీలపైనా సర్వీస్‌ టాక్స్‌ విధించవచ్చు. ఉదాహరణకు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు చేయడానికి అవుట్‌స్టేషన్ చెక్‌ ఉపయోగిస్తే అదనపు సేవ రుసుము వసూలు చేస్తారు. ఇలాంటి ఛార్జీల గురించి కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి.


మీ ఖర్చు అలవాట్లు, ప్రయాణాలకు అనుగుణంగా ఉండే కార్డును ఎంచుకోవడం ద్వారా ఎక్కువ రివార్డ్‌ పాయింట్లు సంపాదించవచ్చు, అదనపు ఖర్చులకు చెక్‌ పెట్టవచ్చు.