Three Times Returns On Gold Sovereign Gold Bonds: సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు జాక్‌పాట్ కొట్టారు. ఈ బంగారం బాండ్లలో పెట్టుబడిపై దాదాపు 300 శాతం రాబడి పొందబోతున్నారు. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం, 17 మార్చి 2017న, 2016-17 ఆర్థిక సంవత్సరానికి సావరిన్ గోల్డ్ బాండ్స్ సిరీస్ IV (2016-17 series IV)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసింది. ఆ సమయంలో ఉన్న మార్కెట్ ధరల ప్రకారం, ఒక గ్రాము గోల్డ్ రేటును రూ. 2943 చొప్పున నిర్ణయించింది. ఒక సావరిన్ గోల్డ్ బాండ్‌ను ఒక గ్రాము బంగారానికి సమానంగా పరిగణిస్తారు. అప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్లు కొన్న పెట్టుబడిదారులను అదృష్టం ఫెలికాల్‌లా పట్టుకుంది. ఆ పెట్టుబడిదారులంతా తమ పెట్టుబడిపై ఇప్పుడు దాదాపు 3 రెట్లు రాబడి పొందబోతున్నారు.
ఒక్కో గ్రాముకు రూ. 5,681 లాభం
గోల్డ్ సావరిన్ బాండ్ల కాల పరిమితి (SGB Maturity Period) 8 సంవత్సరాలు. ఎనిమిదేళ్ల క్రితం ఆర్‌బీఐ జారీ చేసిన FY 2016-17 సిరీస్ IV సావరిన్ గోల్డ్ బాండ్ల కాల పరిమితి ముగిసింది. ఇప్పుడు, ఆ బాండ్లను వెనక్కు తీసుకుని పెట్టుబడిదార్లకు ఇప్పటి బంగారం ధరల ప్రకారం చెల్లించాలి. ఈ నేపథ్యంలో, 2016-17 సిరీస్ IV సావరిన్ గోల్డ్ బాండ్ పథకంలో తుది విమోచన ధర (Final redemption price)ను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. ఒక్కో బాండ్ రిడెంప్షన్ ధరను రూ.8624గా నిర్ణయించింది. ఈ ప్రకారం, పెట్టుబడిదారులు ప్రతి బాండ్‌కు (గ్రాముకు) రూ. 8624 పొందుతారు. అంటే, రూ. 2943 చొప్పున బాండ్‌లను కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు రూ. 8624 చొప్పున ఆర్జిస్తారు. ఆ ఇన్వెస్టర్లకు, పెట్టుబడి పోను ఒక్కో గ్రాముకు రూ. 5,681 లాభం మిగులుతుంది, ఇది 293 శాతం బంపర్ రాబడి.
అంతేకాదు, సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడిపై పెట్టుబడిదారులు సంవత్సరానికి 2.50 శాతం వడ్డీ కూడా పొందుతారు.
గోల్డ్ బాండ్ రేటును నిర్ణయించడానికి, 999 స్వచ్ఛత (24 కేరెట్లు) గల బంగారానికి ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రకటించిన ధరను రిజర్వ్ బ్యాంక్ ప్రామాణికంగా తీసుకుంటుంది. 999 స్వచ్ఛత గల బంగారానికి గత మూడు రోజుల ముగింపు ధరలను తీసుకుని, వాటి సగటును గోల్డ్ బాండ్ ధరగా ఆర్‌బీఐ నిర్ణయిస్తుంది. ఈ ప్రకారం, 10 మార్చి 2025 నుంచి 13 మార్చి 2025 వరకు ప్యూర్ గోల్డ్ సగటు ధరల ఆధారంగా సావరిన్ గోల్డ్ బాండ్ పథకం మెచ్యూరిటీ ధరను RBI నిర్ణయించింది.
అయితే, ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని నిలిపివేసింది. బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల సావరిన్ గోల్డ్ బాండ్లలో కేంద్ర ప్రభుత్వం భారీ నష్టాలను చవిచూసిందని, అందుకే బాండ్ల జారీని నిలిపేసిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.