Namo Drone Didi Yojana Application Details In Telugu: భారత ప్రభుత్వం దేశ ప్రజల కోసం వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రారంభించింది. మహిళా సాధికారతను కూడా ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తోంది & ఇందుకోసం వివిధ రకాల పథకాలను అమలు చేస్తోంది. ఆర్థిక సంబంధిత విషయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారి జీవనశైలిని మెరుగుపరచడానికి ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయి.


మహిళా సాధికారతలో భాగంగా, భారత ప్రభుత్వం, 2023 సంవత్సరంలో ప్రత్యేకంగా ఒక పథకాన్ని స్టార్ట్‌ చేసింది. ఆ పథకం పేరు "నమో డ్రోన్ దీదీ యోజన". ఈ పథకం ద్వారా, డ్రోన్‌లను ఉపయోగించడంలో మహిళలకు శిక్షణ ఇస్తోంది. మహిళలు డబ్బు సంపాదించుకునే అవకాశంతో పాటు ఆధునిక డ్రోన్‌ సాంకేతికతను కూడా అందిపుచ్చుకునేలా భారత ప్రభుత్వం ఈ పథకాన్ని తీర్చిదిద్దింది. ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగంలో ఈ డ్రోన్‌ టెక్నాలజీని ఉపయోగించమని వారిని ప్రోత్సహిస్తోంది. డ్రోన్‌ టెక్నాలజీలో శిక్షణ పొందడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందవచ్చు, ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?.


మహిళలకు & రైతులకు ప్రయోజనం
2023లో ప్రారంభమైన నమో డ్రోన్ దీదీ యోజన మహిళా స్వయం సహాయక సంఘాలకు (Women Self-help groups) అందుబాటులో ఉంది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 15,000 మంది మహిళలకు డ్రోన్‌లను ఉపయోగించడం & నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం శిక్షణ ఇస్తుంది. కొన్ని రకాల వ్యవసాయ పనులలో మనుషుల బదులు డ్రోన్‌లను ఉపయోగించగవచ్చు. పంటలను పర్యవేక్షించడం, ఎరువులు & పురుగుమందులను పిచికారీ చేయడం వంటి పనులను డ్రోన్‌ల ద్వారా సులభంగా చేయవచ్చు. ఒక్క డ్రోన్‌ వల్ల చాలామంది కూలీల కొరతను అధిగమించవచ్చు, పైగా రైతులకు చాలా ఖర్చు ఆదా అవుతుంది.


నమో డ్రోన్ దీదీ యోజన కింద 15 రోజుల శిక్షణ
ఈ పథకం కింద ఎంపికైన మహిళలకు డ్రోన్‌లను నిర్వహించడంలో 15 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఈ పథకం దేశవ్యాప్తంగా ఉన్న 'వ్యవసాయ విజ్ఞాన కేంద్రాల' ‍‌(Agricultural Knowledge Center (AKC) లేదా కృషి జ్ఞాన్‌ కేంద్ర) ద్వారా అమలవుతుంది. ఈ పథకానికి భారత ప్రభుత్వం రూ.1,261 కోట్ల బడ్జెట్‌ కూడా కేటాయించింది.             


నమో డ్రోన్ దీదీ యోజనలో వయోః అర్హత (Age eligibility for Namo Drone Didi Yojana)
మహిళా డ్రోన్ దీదీ యోజన ప్రయోజనాలను పొందాలంటే, దరఖాస్తు చేసుకునే మహిళ 'స్వయం సహాయక బృందం' సభ్యురాలై ఉండాలి. దరఖాస్తుదారు వయస్సు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.  


నమో డ్రోన్ దీదీ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి? (How to apply for Namo Drone Didi Yojana?)
నమో డ్రోన్ దీదీ యోజన కింద దరఖాస్తు చేసుకోవడానికి భారత ప్రభుత్వం ఇంకా ప్రత్యేక వెబ్‌సైట్ లేదా పోర్టల్‌ను ప్రారంభించలేదు. ప్రస్తుతం, ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవాలంటే, మహిళలు ముందుగా స్వయం సహాయక బృందంలో సభ్యురాలిగా చేరాలి. తర్వాత అక్కడి నుంచి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.