Passport Sewa News: భారతదేశంలో నివసించే ప్రజలు వివిధ అవసరాలకు అనుగుణంగా వివిధ గుర్తింపు పత్రాలు ఉండాలి. భారత ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు వంట సరకులు పొందాలంటే రేషన్ కార్డ్‌ ఉండాలి. ఓటు వేయాలంటే ఓటర్‌ ఐడీ కార్డ్‌ ఉండాలి. అదేవిధంగా, ఏదైనా అవసరం కోసం దేశం విడిచి వెళ్ళవలసి వస్తే అతనికి పాస్‌పోర్ట్ కచ్చితంగా ఉండాలి.


మీరు వీసా లేకుండా కొన్ని దేశాలకు వెళ్లగలరేమో గానీ, పాస్‌పోర్ట్ లేకుండా మీరు భారతదేశం వెలుపల ఏ దేశానికీ ప్రయాణించలేరు. పాస్‌పోర్ట్ పొందడానికి ఒక సక్రమమైన ప్రక్రియ ఉంటుంది. పాస్‌పోర్ట్‌ తీసుకోవడానికి భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి, ఇందుకోసం కొన్ని పత్రాలు అవసరం. కొందరు వ్యక్తులు, పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేప్పుడు సరైన అవగాహన లేక కొన్ని తప్పులు లేదా పొరపాట్లు చేస్తున్నారు. ఈ కారణంగా వాళ్లు భారీ జరిమానా చెల్లించాల్సి వస్తోంది. మీరు కూడా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తుంటే, ఆ ప్రక్రియపై అవగాహన పెంచుకోండి, ఎలాంటి తప్పులు లేదా పొరపాట్లు లేకుండా అఫ్లై చేసుకోండి.


దరఖాస్తు ఫారంలో తప్పుడు సమాచారం ఇస్తే?
భారతదేశంలో పాస్‌పోర్ట్ జారీ కోసం కొన్ని నియమాలను రూపొందించారు. ఆ రూల్స్‌ ప్రకారం మాత్రమే పాస్‌పోర్ట్‌ జారీ ప్రక్రియ పూర్తవుతుంది. పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసే సమయంలో కొంతమంది కొన్ని విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారం నింపేటప్పుడు, కావాలని లేదా మరిచిపోవడం వల్ల చిన్న చిన్న సమాచారాలను దాచిపెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. లేదా, కొన్నిసార్లు కావాలనే తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తున్నారట. అలా సరైన సమాచారం ఇవ్వని లేదా తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తులంతా విచారణ సమయంలో దొరికిపోతున్నారు, దోషులుగా తల వంచుకుంటున్నారు.


రూ. 5000 వరకు జరిమానా
పాస్‌పోర్ట్‌ దరఖాస్తులో సరైన సమాచారం ఇవ్వని లేదా తప్పుడు సమాచారం ఇచ్చి దొరికిపోయిన వ్యక్తులకు జైలు శిక్ష పడదుగానీ, జరిమానా విధిస్తారు. పాస్‌పోర్ట్‌ జారీ రూల్స్‌ ప్రకారం, అలాంటి వ్యక్తులకు సందర్భాన్ని బట్టి రూ. 500 నుంచి రూ. 5000 వరకు జరిమానా విధిస్తారు. కొన్ని తప్పుల విషయంలో ఇది ఇంకా సీరియస్‌ కేస్‌ కావచ్చు. కాబట్టి, మీరు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, నమోదు చేసిన మొత్తం సమాచారం మొత్తాన్ని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవడం మంచింది. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు సమాచారం ఇవ్వవద్దు. తద్వారా మీరు విచారణలు & జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు.        


దరఖాస్తు ఫారం రద్దు కావచ్చు!
పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు మీరు ఏదైనా తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తే, తర్వాత అది మీ రికార్డులతో సరిపోలకపోతే, పాస్‌పోర్ట్‌ అధికారులు జరిమానాతోనే సరిపెట్టకపోవచ్చు. మీ పాస్‌పోర్ట్‌ దరఖాస్తు కూడా రద్దు చేయవచ్చు. దీనివల్ల, మీరు పాస్‌పోర్ట్ కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం ప్రక్రియను మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్‌ చేయాల్సివస్తుంది. కాబట్టి, పాస్ట్‌పోర్ట్‌ అప్లికేషన్‌లో సమాచారాన్ని పూరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.