Health Insurance: ఇప్పటి పరిస్థితుల్లో, కాస్త పెద్ద అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే, బిల్లు కట్టడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. వైద్యం పేరిట ఆసుపత్రులు జనం కష్టార్జితాన్ని జలగల్లా పీలుస్తున్నాయన్న విమర్శలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అలాంటి కష్టకాలంలో సమగ్ర ఆరోగ్య బీమా అండగా నిలుస్తుంది. ఇప్పుడు, చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాయి. దీంతోపాటు... ఉద్యోగులు కూడా సొంతంగా పాలసీలు తీసుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య కొన్ని తేడాలు ఉంటాయి.
సొంత హెల్త్ ఇన్సూరెన్స్ Vs కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్
1. ప్రీమియం - సాధారణంగా, సొంతంగా తీసుకునే ప్లాన్‌తో పోలిస్తే కార్పొరేట్ ప్లాన్ చవగ్గా ఉంటుంది. దీనికి తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
2. వెయిటింగ్ పీరియడ్ - ప్రతి ఆరోగ్య బీమా పాలసీకి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కార్పొరేట్ హెల్త్ ప్లాన్ కంటే రిటైల్ హెల్త్ ప్లాన్‌లో నిరీక్షణ కాలం ఎక్కువగా ఉంటుంది. సొంతంగా తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో.. కొన్ని నిర్దిష్ట అనారోగ్యాల విషయంలో 2-4 సంవత్సరాల వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో వెయిటింగ్ పిరియడ్ కూడా ఉండదు, మొదటి రోజు నుంచే కవరేజ్‌లోకి వస్తారు.
3. బీమా మొత్తం - కార్పొరేట్ ప్లాన్‌లో సాధారణంగా రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది. కొన్ని అనారోగ్యాలకు ఈ డబ్బు ఏమూలకూ చాలదు. మీరు సొంతంగా తీసుకుంటే, ఇంతకన్నా ఎక్కువ కవరేజ్ ఇచ్చే ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
4. ముందుగా ఉన్న వ్యాధులకు కవరేజ్ - ఈ విషయంలో కార్పొరేట్ ప్లాన్ బెస్ట్. ముందుగా ఉన్న వ్యాధులను (pre-existing diseases) కూడా ఇవి కవర్ చేస్తాయి. రిటైల్ ప్లాన్‌లోనూ ఇలాంటి కవరేజ్ ఉన్నప్పటికీ, ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. కంపెనీ ఇచ్చే ఆరోగ్య బీమాకు వైద్య పరీక్షలు అవసరం లేదు. రిటైల్ ప్లాన్ కోసం మెడికల్ టెస్ట్‌లు చేయించుకోవాలి.
5. అనుకూలమైన ప్లాన్ - ఒక వ్యక్తి, తన ఆరోగ్య అవసరాలకు అనుకూలంగా రిటైల్ ప్లాన్ ఎంచుకోవచ్చు. కార్పొరేట్ ప్లాన్‌లో ఈ ఆప్షన్ ఉండదు, కంపెనీ ఇచ్చిన ప్లాన్‌తో సరిపెట్టుకోవాలి. కంపెనీలో ఉద్యోగులందరినీ దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ ప్లాన్ ఉంటుంది, వ్యక్తిగత అవసరాలకు తావుండదు.
6. ప్రసూతి కవరేజ్ - ఎక్కువ రిటైల్ ప్లాన్స్‌లో మెటర్నిటీ కవరేజ్ ఉండదు. దీనికోసం ప్రత్యేకంగా యాడ్-ఆన్ తీసుకోవాలి. దీనికోసం వెయిటింగ్ పిరియడ్ కూడా ఉంటుంది. కంపెనీ ఇచ్చే ప్లాన్‌లో ఇలాంటి కొర్రీలు ఉండవు. మెటర్నిటీ సంబంధిత ఖర్చులు, సమస్యలను కవర్ చేస్తాయి.
7. కుటుంబ సభ్యులకు రక్షణ - రిటైల్ ప్లాన్‌లో తల్లిదండ్రులను యాడ్ చేయడానికి సాధారణంగా వీలు కాదు. దీనికోసం ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ తీసుకోవాలి, చాలా ఎక్కువ ప్రీమియం కట్టాలి. దీనిలోనూ వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. కార్పొరేట్ బీమా విషయంలో ఇలా జరగదు. మీ తల్లిదండ్రులను హాయిగా యాడ్ చేయవచ్చు, వాళ్లు కూడా తొలిరోజు నుంచే కవరేజ్‌లోకి వస్తారు.
8. రక్షణ పరిధి - మీరు ఉద్యోగంలో ఉన్న సమయం వరకే కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ పరిధిలో ఉంటారు, జాబ్ మారిన తక్షణం రక్షణ కోల్పోతారు. రిటైల్ ప్లాన్‌లో ఈ రిస్క్ ఉండదు.
చివరిగా... కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ & రిటైల్ ప్లాన్ - ఈ రెండూ ఉండడం వల్ల మీకు, మీ కుటుంబానికి ఆరోగ్య భద్రత లభిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఎస్‌బీఐ కొత్త క్రెడిట్ కార్డ్స్‌తో ప్రతి ఖర్చుపై రివార్డ్