Income Tax Officers Can Check Your Social Media Accounts: భారత ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఆదాయ పన్ను బిల్లు చాలా రోజులపాటు హెడ్‌లైన్స్‌లో ఉంది. కొత్త బిల్లులో చాలా కీలక మార్పులు జరిగాయని, దీనివల్ల చట్టాలు మరింత సరళంగా, సులభంగా మారాయని మోదీ ప్రభుత్వం చెబుతోంది. అయితే, కొత్త బిల్లులో కొన్ని నియమాలపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు?
నిజానికి, బిల్లులోని ఓ నిబంధన గురించి ప్రజలు చాలా గట్టిగా చర్చిస్తున్నారు. ఆ బిల్లు ఐటీ అధికారుల చేతికి బ్రహ్మాస్త్రం లాంటింది, పన్ను చెల్లింపుదారు ఇక ఏ విషయాన్నీ దాచి పెట్టడం కుదరదు. ఒకవేళ, దాచి పెట్టాలని చూసినప్పటికీ, 'కొత్త పవర్' ఉపయోగించి ఆదాయ పన్ను అధికారులు ఆ సమాచారం మొత్తం తెలుసుకుంటారు. కొత్త నిబంధన ప్రకారం, ఒకవేళ అవసరమైతే, ఆదాయ పన్ను అధికారులు దర్యాప్తు సమయంలో మీ సోషల్ మీడియా ఖాతా యాక్సెస్ తమకు ఇవ్వమని డిమాండ్ చేయవచ్చు. కొత్త బిల్లు ప్రకారం, అధికారులు మీ సోషల్ మీడియా ఖాతాలు, ఇ-మెయిల్స్‌ను శోధించడానికి చట్టపరమైన హక్కు కలిగి ఉంటారు. దర్యాప్తు సమయంలో, పన్ను చెల్లింపుదారులకు చెందిన అన్ని డిజిటల్ ఆస్తుల్లోకి తమకు అనుమతి ఇవ్వమని డిమాండ్ చేస్తారు. అంటే, ఐటీ అధికారులు టాక్స్‌పేయర్ల సోషల్ మీడియా అకౌంట్స్‌లోకి కూడా వెళ్లి అన్నీ చూస్తారు. దీనిపైనే ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పాత బిల్లులో ఏముంది?
ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం, ఆదాయ పన్ను అధికారులు దర్యాప్తు సమయంలో బ్యాంకు ఖాతాల వరకు శోధించి స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఉంది. సోషల్ మీడియా ఖాతాలు, ఇ-మెయిల్స్, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డ్రైవ్‌ల యాక్సెస్ కోసం డిమాండ్ చేస్తే, చట్టపరమైన ప్రతిఘటనను ఎదుర్కోవలసి ఉంటుంది.
కానీ ఇప్పుడు, 01 ఏప్రిల్ 2026 నుంచి అమలు చేయబోయే కొత్త ఆదాయ పన్ను బిల్లు ప్రకారం, పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా ఖాతాలు, కంప్యూటర్లు, ఇ-మెయిల్స్, ఇతర డిజిటల్ ఆస్తులన్నింటినీ బ్యాంకు ఖాతాలతో పాటు యాక్సెస్ చేయగలరు. దీనిపై చట్టపరమైన హక్కు ఆదాయ పన్ను అధికారులకు దఖలు పడుతుంది. ఎవరైనా వ్యక్తి ITRలో వెల్లడించకుండా దాచి పెట్టిన పెట్టుబడుల సమాచారాన్ని వెలికితీయడం ఈ బలవంతపు యాక్సెస్ ఉద్దేశం. అంతేకాదు, ఎవరైనా పన్ను చెల్లింపుదారులు దర్యాప్తులో సహకరించడానికి నిరాకరిస్తే, అధికారులు వారి అకౌంట్ పాస్‌వర్డ్‌ను బైపాస్ చేయవచ్చు, సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను ఓవర్‌రైడ్ చేయవచ్చు, తద్వారా ముఖ్యమైన ఫైల్స్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
ఏ సందర్భాలలో ఈ హక్కు ఉంటుంది?
కొత్త ఐటీ చట్టంలోని సెక్షన్ 247 ప్రకారం, భారతదేశంలోని అధికారులకు కొన్ని నిర్దిష్ట సందర్భాలలో ఈ అధికారం ఉంటుంది. ఈ చట్టం కింద, అందరు పన్ను చెల్లింపుదారుల డిజిటల్ ఆస్తుల పరిశీలనకు అనుమతి ఉండదు. పన్ను ఎగవేత లేదా అప్రకటిత ఆస్తులు (పన్ను చెల్లించని ఆస్తి) ఉన్నాయన్న అనుమానం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. అలాంటి కేసుల్లో, ఆదాయ పన్ను అధికారులకు ఇ-మెయిల్స్, సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడి ఖాతాలు, ఇతర డిజిటల్ ఆస్తులను యాక్సెస్ చేసే హక్కు లభిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ఎవరన్నారయ్యా భారత్ పేద దేశమని?, ఈ స్టోరీ చదివితే మీరూ ఇదే మాట అంటారు!