Financial Planning: కాలం మారింది! ఉద్యోగులు ఒకప్పట్లా లేరు. ఉద్యోగ జీవితానికి బ్రేక్‌ (Sabbatical Leave) ఇస్తే ఏమవుతుందోనని భయపడటం లేదు. తమ కలలను నెరవేర్చుకొనేందుకు ధైర్యంగా కెరీర్‌ బ్రేక్‌ తీసుకుంటున్నారు. ఆ ఖాళీ సమయంలో కొందరు ఎడాపెడా డబ్బులను ఖర్చు చేస్తూ కొన్ని రోజులకే ఇబ్బందుల్లో పడతారు. అందుకే కెరీర్‌కు బ్రేక్‌ ఇవ్వాలనుకొనే వాళ్లు కొన్ని ఆర్థిక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి!


ఎందుకు తీసుకుంటున్నారు?


మొదట ఎన్నాళ్లు బ్రేక్‌ తీసుకోవాలని అనుకుంటున్నారో కచ్చితంగా నిర్ణయించుకోవాలి. ఎందుకు సమయం తీసుకుంటున్నారో గుర్తించాలి. చదువుకోవాలని అనుకుంటున్నారా? వేరే ఉద్యోగానికి మారాలనుకుంటున్నారా? ఏదైనా సొంత కంపెనీ పెట్టాలనుకుంటున్నారా? వంటివి నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత మీ కలలను నెరవేర్చుకొనేందుకు ఎంత డబ్బు అవసరమో తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడతారు.


ఆర్థిక నిధి అవసరం


ఈ బ్రేక్‌ సమయంలో మనల్ని ఆదుకోవడానికి ఒక నిధి ఉండటం అవసరం. మీ ఆర్థిక లక్ష్యాలను (Financial Goals) బట్టి ఆ నిధి విలువ ఉండాలి. విరామంలో అయినా సరే ఇంటికి రెంట్‌ కట్టాలి. పిల్లల్ని బడికి పంపించాలి. ఆహార అవసరాలకు డబ్బు కావాలి. ఇందు కోసం అవసరమైతే మీ అసెట్స్‌లో కొంత భాగాన్ని విక్రయించాల్సి రావొచ్చు. లేదా బ్యాంకులో ఉన్న నిధి (Emergency fund) నుంచి కొంత తీసుకోవాల్సి రావొచ్చు.


సేవింగ్స్‌ మానేసినా


ప్రస్తుతం మీరు పొందుతున్న ఆదాయం (Current Income) బ్రేక్‌ సమయంలోనూ రావాలనుకోవద్దు. మీ అవసరాలు, ఖర్చులకు సరిపడా డబ్బుంటే చాలు. మీ సేవింగ్స్‌ మొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కొంత మొత్తం ఖర్చు చేసుకుంటూ మీ సేవింగ్స్‌ అలవాటును (Savings Habbit) మానుకున్నా ఫర్వాలేదని నిపుణులు సూచిస్తున్నారు. మళ్లీ కొత్త కెరీర్ ఆరంభించగానే సేవింగ్స్‌ అలవాటును కొనసాగించొచ్చు. 


ముందుగానే ఊహించండి


విరామం తీసుకోవడం బాగానే అనిపిస్తుంది. కానీ మీ తర్వాతి లక్ష్యాలకు అవసరమయ్యే డబ్బును సరిగ్గా అంచనా వేసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు ఒకరు బ్యాంకు జాబ్‌ వదిలేసి మోడలింగ్‌లో కెరీర్‌ మొదలు పెట్టాలని అనుకోవచ్చు. అలాంటప్పుడు వస్త్రాలు, బ్యూటీ కిట్స్‌, జిమ్‌కు చాలా డబ్బు అవసరం అవుతుంది. ఇవన్నీ ముందుగానే అంచనా వేసి సమకూర్చుకోవాలి.


ఈక్విటీ, డెట్‌ సమానంగా


మీ కార్పస్‌ను ప్రమాదకరమైన ప్రాపర్టీ, భూముల (Lands) పైన పెట్టొద్దు. ఎందుకంటే విరామంలో డబ్బు అవసరమైనప్పుడు చేతికందదు. మీ పోర్టు పోలియోను ఈక్విటీ (Equity), డెట్‌తో (Debt) సమతూకంగా ఉంచుకోవాలి. మీ రెగ్యులర్‌ ఆదాయం (Regular Income) కోసం సరిపడా రుణాల మద్దతు తీసుకోవచ్చు. మరోవైపు ఈక్విటీ పెరుగుతూనే ఉంటుంది. అంతేకానీ డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌ చేయడం, లాటరీ టికెట్లు కొనడం వల్ల మీరు రిచ్‌ అవ్వలేరు!


తర్వాత డబ్బొస్తుందని


చాలా మంది కెరీర్‌ బ్రేక్‌ తీసుకోగానే డబ్బులను రినోవేషన్‌ కోసం ఖర్చు చేస్తుంటారు. లేదా పిల్లలకు గిఫ్టుగా ఇస్తుంటారు. విపరీతంగా ప్రయాణిస్తుంటారు. మళ్లీ ఆరంభించే కెరీర్‌, అందులోంచి వచ్చే డబ్బును ఊహించుకుంటూ ఇప్పుడు ఖర్చు చేసేస్తారు. అవి నిజం కాకపోయే సరికి తిప్పలు పడతారు.


స్నేహితులపై ఆధారపడ్డా!


కెరీర్‌ బ్రేక్‌ తీసుకోవడం తప్పేమీ కాదు. కానీ మీ కనీస అవసరాలు తీర్చే డబ్బు మాత్రం చేతిలో ఉండాలి. ఉదాహరణకు నెలనెలా మీరు ఈఎంఐలు (EMI) చెల్లించాల్సి రావొచ్చు. క్రెడిట్‌ కార్డు బిల్లు (Credit ఉంటాయి.  అప్పులు తీర్చేందుకు స్నేహితులపై ఆధారపడుతుంటారు. ఆ తర్వాత వారికి డబ్బు ఇవ్వలేక అనుబంధాన్ని పాడు చేసుకుంటారు.


మార్టగేజ్‌ వద్దే వద్దు


మీ వద్ద ఉన్న అసెట్స్‌కు సరిగ్గా ర్యాంకింగ్‌ ఇవ్వండి. సమీప భవిష్యత్తులో కచ్చితంగా ఆదాయం వస్తునుకుంటేనే అందులో కొన్నింటిని మార్టగేజ్‌ (Pledge, Mortgage) కింద పెట్టుకోవచ్చు. లేదంటే అస్సలు ఆ పని చేయొద్దు. లిక్విడిటీని (Liquidity) అనుసరించి ముందుగానే పేపర్‌ వర్క్‌ సిద్ధం చేసుకోండి. డబ్బును పొందండి.


మీ పార్ట్నర్‌కు చెప్పండి


మీ జీవిత భాగస్వామికి అన్ని వివరాలు చెప్పండి. మీ ప్లాన్‌ను వివరించింది. చాలాసార్లు వారు మనల్ని గైడ్‌ చేయాల్సి రావొచ్చు. కొన్నిసార్లు మనం అనుకున్న దారిలో నడవలేకపోతాం. అలాంటి సమయాల్లో వారు మనకు మన ప్లాన్‌ను గుర్తుచేస్తారు. ఎక్కడ నష్టం వస్తుందో గుర్తించి చెబుతుంటారు.


ఎవరినీ నిందించొద్దు


ఇక ఆఖరిది. కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయం సరైంది కాకపోవచ్చు. ఆచరణ బాగుండకపోవచ్చు. ఇబ్బందులు ఎదుర్కొని ప్రణాళికను ఆపేయొచ్చు. అలాంటప్పుడు పక్క వారిపై నిందలు వేయొద్దు. హుందాగా ఓటమిని స్వీకరించి తప్పులు తెలుసుకోవాలి. మన ఆశయాలకు అనుగుణంగా మన ఆర్థిక వనరులు ఉండేలా చూసుకొని ముందుకు సాగాలి.