Vijay Shekar on UPI Payments: యూపీఐ లావాదేవీల మీద 2023 ఏప్రిల్ 1 నుంచి ఛార్జీలు చెల్లించాలా, వద్దా వస్తుందన్న గందగోళం కొనసాగుతున్న నేపథ్యంలో... Paytm వ్యవస్థాపకుడు, CEO విజయ్ శేఖర్ శర్మ రంగంలోకి దిగారు. గందరగోళాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఇంటర్‌చేంజ్ ఫీజుకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల చేసిన ప్రకటన గురించి ఆయన వివరిస్తూ ఒక సుదీర్ఘమైన ట్వీట్‌ చేశారు.


"#UPI ట్రెండ్‌ని నేను చూస్తున్నాను. UPI లావాదేవీల మీద రుసుములు వసూలు చేయబోతున్నాయని అనేక వార్తా సంస్థలు, చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. దానిలో ఎటువంటి నిజం లేదు. చిన్నపాటి తేడాను అర్ధం చేసుకుంటే సరిపోతుంది" అని శర్మ ట్వీట్‌ చేశారు. "UPI అంటే సంబంధింత చెల్లింపు ప్రారంభమయ్యే మూలం. దీని అర్థం, మీరు మీ బ్యాంక్ ఖాతాను ఏదైనా UPI యాప్‌కి లింక్ చేసి, UPIని ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు" అని వివరించారు.


గతంలో మారిదే ఇకపై కూడా ఎలాంటి ఛార్జీలు లేకుండా డబ్బులు పంపుకోవచ్చని విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి, ఒక వ్యక్తి నుంచి మర్చంట్‌ లావాదేవీలను ఎప్పట్లాగే ఉచితంగా చేసుకోవచ్చని తెలిపారు. కాకపోతే, ‘ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌' ద్వారా చేసే చెల్లింపులకు మాత్రమే ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీలు వర్తిస్తాయని చెప్పారు.






ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీగా ఎంత వసూలు చేస్తారు?
‘ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌' (PPI) అయిన ఆన్‌లైన్‌ వాలెట్లు, ప్రీ-లోడెడ్‌ గిఫ్ట్‌ కార్డులు వంటి వాటి ద్వారా చేసే యూపీఐ లావాదేవీలకు మాత్రమే అదనపు ఛార్జీలు విధిస్తారు. ఏప్రిల్‌ 1 నుంచి, PPI ద్వారా యూపీఐ విధానంలో చేపట్టే మర్చంట్‌ లావాదేవీలకు 1.1 శాతం రుసుము తీసుకుంటారు. ఆన్‌లైన్‌ మర్చంట్లు, పెద్ద మర్చంట్లు, చిన్నపాటి ఆఫ్‌లైన్‌ మర్చంట్ల వద్ద జరిపే రూ. 2000కు పైగా విలువైన లావాదేవీలపై 1.1 శాతాన్ని ఇంటర్ ఛేంజ్‌ ఫీజుగా తీసుకుంటారు. ప్రీపెయిడ్‌ సాధనాలను జారీ చేసినవారు, డబ్బులు డిపాజిట్‌ అయిన బ్యాంకుకు 15 బేసిస్‌ పాయింట్ల మేర ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా అవతలి పేమెంట్‌ బ్యాంకు నుంచి వీరికి వస్తే 15 బేసిస్‌ పాయింట్ల మేర ఫీజు వస్తుంది. 


రూ. 2000 మించే చేసే ప్రతి యూపీఐ లావాదేవీకీ ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీ చెల్లించాలని, సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారంటూ విమర్శలు రావడంతో NPCI వివరణ ఇచ్చింది. యూపీఐ ద్వారా ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక ఖాతాకు, వినియోగదారు నుంచి వ్యాపారులకు ఉచితంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఇంటర్‌ చేంజ్‌ ఛార్జీలు PPI మర్చంట్‌ లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. 


ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీ ఒకేలా ఉండదు
కాబట్టి... పర్సన్‌ టు పర్సన్‌, పర్సన్‌ టు మర్చంట్‌ లావాదేవీలపై ఎలాంటి రుసుములు వర్తించవు. 1.1 శాతాన్ని ఇంటర్ ఛేంజ్‌ ఫీజు అమలు చేస్తున్నా, ఇది కూడా అన్నింటికీ ఒకేలా ఉండదు. కొన్ని లావాదేవీలకు తక్కువ ఫీజు పడుతుంది. ఉదాహరణకు... ఒక ప్రీపెయిడ్‌ సాధనం (వాలెట్లు వంటివి) నుంచి యూపీఐ ద్వారా పెట్రోల్‌ స్టేషన్లో రూ. 2000కు పైగా లావాదేవీ జరిపితే 0.5 శాతమే ఫీజు వర్తిస్తుంది. టెలికాంకు 0.70 శాతం, మ్యూచువల్‌ ఫండ్‌కు ఒక శాతం, యుటిలిటీస్‌కు 0.70 శాతం, విద్యకు 0.70 శాతం, సూపర్‌ మార్కెట్‌కు 0.90 శాతం, బీమాకు ఒక శాతం, వ్యవసాయానికి 0.70 శాతం కన్వీనియెన్స్‌ స్టోర్‌కు 1.10 శాతం ఇంటర్ ఛేంజ్ ఫీజు వర్తిస్తుంది. ఏదేమైనా గరిష్టంగా రూ. 15 మాత్రమే వసూలు చేస్తారు.