Patanjali Mega Food Park: యోగా  గురు రాందేవ్ స్థాపించిన పతంజలి  ఫుడ్స్   నాగ్‌పూర్‌లోని MIHAN (మల్టీ-మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్ అండ్ ఎయిర్‌పోర్ట్) వద్ద    మెగా ఫుడ్ & హర్బల్ పార్క్ ను  ఏర్పాటు చేసింది. కార్యకలాపాలు  ప్రారంభమైన రెండు రోజుల్లోనే, విదర్భ ప్రాంత రైతులకు మంచి ప్రయోజనం దక్కింది. ఈ ప్రాంతంలోని తక్కువ శ్రేణి అయిన B గ్రేడ్, Cగ్రేడ్ నారింజలకు కేజీ 22 రూపాయలు లభిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంత రైతులకు ఆర్థిక స్థిరత్వం దక్కుతుందని వారి ఆదాయం మెరుగవుతుందని కంపెనీ తెలిపింది.


ఈ ప్లాంట్ ఆసియాలోనే అతిపెద్ద ఫుడ్ హెర్బల్  ఉత్పత్తి కేంద్రంగా చెబుతున్నారు. మార్చి 9న ఇది ప్రారంభమైంది. జ్యూస్ ప్రాసెసింగ్ కోసం రోజుకు దాదాపు 800 టన్నుల నారింజలు అవసరం అవుతాయి. ఇక్కడ డిమాండ్ పెరగడంతో చిన్న పరిమాణం గల నారింజలు, చిన్న చిన్న మచ్చలు వచ్చి మార్కెట్‌లో తక్కువ ధరకు అమ్ముడుబోయే పండ్లను వీళ్లు కొనుగోలు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో అసలు అమ్ముడుపోని ఈ పండ్లు ఇప్పుడు ఈ ప్లాంట్ కారణంగా సులభంగా విక్రయించగలుగుతున్నారు.


‘B’  ‘C’ గ్రేడ్ నారింజలకు అదనపు ఆదాయం


ప్రతీ సంవత్సరం విదర్భ ప్రాంతంలో 15-20% నారింజలు ముందుగా చెట్ల నుంచి రాలిపోతుంటాయి. పూర్తిగా తయారుకాని, చిన్నసైజ్ కాయలు కావడం వల్ల ప్రధాన మార్కెట్‌లో వీటిని కొనుగోలు చేయరు. దీంతో రైతులు తక్కువ ధరకు విక్రయించడమో లేదా వాటిని పడేయాల్సిన పరిస్థితో వచ్చేది. కానీ, ఇప్పుడు ఈ తక్కువ గ్రేడ్ నారింజలకు రూ. 18-22/kg దాకా ధర లభిస్తోంది, ఇది రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తోంది.


జ్యూస్ ఉత్పత్తితో పాటు, ఈ ప్లాంట్ నారింజ తొక్కల నుంచి కోల్డ్-ప్రెస్డ్ ఆయిల్ (CPO) ఉత్పత్తి చేస్తుంది, దీనికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అదనంగా, ఈ ప్లాంట్ నాగ్‌పూర్ ప్రసిద్ధ నారింజ బర్ఫీ, ముఖ్యమైన నూనెలు, సౌందర్య ఉత్పత్తుల కోసం ఉపయోగించే పొడి తొక్కల‌ను కూడా ప్రాసెస్ చేస్తుంది.


రైతుల్లో సంతోషం


ప్లాంట్ ఏర్పాటుపై రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. విదర్భ రైతులు దీనిని స్వాగతించారు. పరిశ్రమ నిర్వాహకులు, ప్రభుత్వ తోడ్పాటుతో ఈ ప్రక్రియ దీర్ఘకాలం  కొనసాగాలని, తమ ఉత్పత్తికి స్థిరమైన డిమాండ్ రావాలని వారు  ఆశిస్తున్నారు.