Prakasam District Latest News : ప్రకాశం జిల్లాలో రెండు ఆల్ట్రా మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి మంగళవారం సమాధానం చెప్పారు. దీనికి సంబంధించి ఆయన సభలో మాట్లాడుతూ... రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రాయలసీమ తరువాత ప్రకాశం జిల్లానే అత్యంత అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ, చంద్రశేఖరపురం ప్రాంతాల్లో మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఒక్కో ప్లాంట్ నిర్మాణానికి సుమారు 5,500 ఎకరాల భూమి అవసరమని తెలిపారు. ప్లాంట్ల నిర్మాణానికి భూ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరామన్నారు. కలెక్టర్ నివేదిక తరువాత సోలార్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపడుతామని మంత్రి చెప్పారు. ఒక్కో సోలార్ విద్యుత్ ప్లాంట్ ద్వారా సుమారు 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు.
ఐసీఈ -2024 పాలసీ గేమ్ ఛేంజర్.....
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ - 2024 (ఐసీఈ) ద్వారా పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆశాభవం వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఐసీఈ పాలసీ ద్వారా 100 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మంత్రి గొట్టిపాటి సభాముఖంగా సభ్యులకు వివరించారు.
లిఫ్టులు, ఎస్కలేటర్ల బిల్లు – 2025ను కూడా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. రాష్ట్రంలో పట్టణీకరణ, బహుళ అంతస్తుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని... అందుకే ప్రజల భద్రత కోసం ఈ బిల్లు తెచ్చామన్నారు. లిఫ్టులు, ఎస్కలేటర్ల వినియోగం కూడా పెరుగుతోందని వివరించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల భద్రత చాలా కీలకమని కామెంట్ చేశారు. కొత్త బిల్లు చట్టరూపం దాల్చితే, లిఫ్టులు, ఎస్కలేటర్ల ప్రమాదాలు కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా ఇప్పటికే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దేశంలోని 15 రాష్ట్రాలు ఇప్పటికే లిఫ్టులు, ఎస్కలేటర్ల చట్టాన్ని అమలు చేస్తున్నాయ తెలిపారు. పూర్తి అధ్యయనం తరువాత ఈ బిల్లును చట్టసభలో ప్రవేశ పెట్టామమని సభ్యులకు వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని విద్యుత్ వ్యవస్థ సర్వనాశనమైందని ఈ మధ్య మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా విద్యుత్ చార్జీలను పెంచబోదని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలే విద్యుత్ చార్జీలు పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, సభలో మళ్లీ ప్రశ్నలు అడుగుతున్నారని మండిపడ్డారు. ఇదొక వింత సాంప్రదాయమని పేర్కొన్నారు. అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.
2022-23, 2023-24 ఏడాదికి గాను వైసీపీ ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం మోపిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. గతంలో 2014-19 వరకు తమ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేనాటికి మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వానికి అప్పగించామని చెప్పిన మంత్రి... గత ఐదేళ్లలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని స్పష్టం చేశారు.