Onion Prices Might Hike: దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా రేటు రూ. 120 పలుకుతుండగా, మరికొన్ని చోట్ల రూ. 200 దాటింది. వాతావరణం అనుకూలంగా మారిన ఏరియాల్లో రేట్లు కొద్దిగా తగ్గాయి. హమ్మయ్య, ఇక కూరల్లోకి టమాటాలు కొనొచ్చు అనుకునే లోపే ఉల్లిపాయలు లైన్‌లోకి వచ్చాయి. ఇప్పుడు, ఉల్లి రేటు (Onion Price In India) కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో కిలో ఉల్లిపాయల ధర రూ. 25 నుంచి రూ. 32 వరకు పలుకుతోంది. ఈ రేటు రెట్టింపు పైగా పెరిగే సిగ్నల్స్‌ కనిపిస్తున్నాయి.


ఉల్లిపాయల రేటు ఎందుకు పెరుగుతుంది?
ఉల్లి ధరలు కూడా టమాటా బాట పట్టేలా ఉన్నాయా? అంటే, అది నిజమే అని క్రిసిల్ చేసిన రీసెర్చ్‌ చెబుతోంది. ‘క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌’ (CRISIL Market Intelligence and Analytics) రిపోర్ట్‌ ప్రకారం, ఈ నెల (ఆగస్టు, 2023‌‌) చివరి నాటికి, రిటైల్ మార్కెట్‌లో ఆనియన్‌ రేటు క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉంది. వచ్చే నెల (సెప్టెంబర్‌) ఉల్లి ధర కొండెక్కి కూర్చోవచ్చు. ఉల్లి సరఫరాలో కొరత దీనికి కారణం. దీనివల్ల, వచ్చే నెలలో కిలో ఉల్లిపాయలు 60 రూపాయల నుంచి 70 రూపాయలు వరకు పెరిగే అవకాశం ఉంది. 


సాధారణంగా, రబీ ఉల్లిపాయల స్టాక్‌ సెప్టెంబర్‌ చివరి వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే, ఈసారి రబీ ఉల్లిపాయల షెల్ఫ్ లైఫ్‌ 1-2 నెలలు తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాటిని అమ్మడం వల్ల ఓపెన్‌ మార్కెట్‌లో రబీ స్టాక్ బాగా తగ్గింది, ఆగస్టు చివరి నాటికి గోడౌన్లు ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుంది. అందువల్లే, ఆగస్టు నాటికి క్రమంగా రేట్లు పెరిగి, సెప్టెంబర్‌లో పీక్‌ స్టేజ్‌కు చేరతాయని ‘క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌’ వెల్లడించింది. 


చిన్నపాటి ఉపశమనం
రేట్లు పెరుగుతాయని చెప్పి షాక్‌ ఇచ్చిన క్రిసిల్‌, చిన్నపాటి రిలీఫ్‌ కూడా ఇచ్చింది. 2020 నాటి గరిష్ట స్థాయి అయిన రూ. 200 స్థాయికి మాత్రం ఉల్లి రేటు ఈసారి వెళ్లదని స్పష్టం చేసింది.


ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు పప్పులు, తృణధాన్యాలు, ఇతర కూరగాయల రేట్లు పెరిగాయి. ఈ సమయంలో ఉల్లి ధరలు మాత్రం కనికరించాయి. జనవరి నుంచి మే వరకు తక్కువ రేట్లలో, సామాన్య జనానికి అందుబాటులో ఉన్నాయి. రేటు లేకపోవడంతో ఖరీఫ్‌ సీజనులో ఉల్లిని తక్కువగా సాగు చేశారు. దీంతో సాగు విస్తీర్ణం 8 శాతం మేర తగ్గింది, ఖరీఫ్‌ ఉల్లి దిగుబడి 5 శాతం తగ్గుతుందని అంచనా. ఈ ఏడాది మొత్తం ఉత్పత్తి 29 మిలియన్‌ టన్నులకు (MMT) చేరొచ్చని లెక్కలు వేశారు. ఇది, అయిదేళ్ల సగటు కంటే 7% ఎక్కువ. 


అక్టోబరు నుంచి ఖరీఫ్‌ పంట ఓపెన్‌ మార్కెట్‌లోకి వస్తుంది. అప్పుడు ఆనియన్ రేటు మళ్లీ కొండ దిగి రావడం స్టార్ట్‌ చేస్తుందని ‘క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌’ రిపోర్ట్‌ చెబుతోంది. పండుగ సీజన్‌లో (అక్టోబర్-డిసెంబర్) ధరలలో హెచ్చుతగ్గులు స్థిరంగా ఉంటాయని నివేదికలో వెల్లడించింది. ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లలోనూ ఆనియన్‌ దిగుబడి తగ్గినా.. ఈ ఏడాది ఉల్లి సరఫరా మరీ తీసికట్టుగా ఉండకపోవచ్చని క్రిసిల్‌ అంచనా వేసింది. ఆగస్టు, సెప్టెంబరులో కురిసే వర్షాలను బట్టి ఉల్లి దిగుబడి ఆధారపడి ఉంటుందని క్రిసిల్‌ తన రిపోర్ట్‌లో రాసింది.


మరో ఆసక్తికర కథనం: ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌, సహారా బాధితులకు డబ్బులు తిరిగొస్తున్నాయోచ్‌!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial