Onion Prices In India: ఉల్లి లేని వంటకం ఉప్పు లేని పప్పుతో సమానం. శాఖాహారమైనా, మాంసాహారమైనా ఉల్లిపాయ లేకుండా వంట పూర్తి కాదు. అయితే.. ప్రస్తుతం మన దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత 15 రోజులుగా  ఆనియన్‌ రేట్లు 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగాయి. మన మార్కెట్లలోకి క్రమంగా ఉల్లి సరఫరా తగ్గుతోంది. అంతేకాదు, ఈద్ ఉల్ అధా (బక్రీద్) రాక ముందే ఉల్లిపాయలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో, పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.


మహారాష్ట్ర మార్కెట్లలో భారీగా పెరిగిన ఉల్లి ధరలు
మన దేశంలో ఉల్లికి అతి ప్రధాన మార్కెట్‌ మహారాష్ట్రలోని నాసిక్‌లోని లాసల్‌గావ్ మండి. ఈ మార్కెట్‌లో ఉల్లి సగటు టోకు ధర ‍‌(Wholesale rate) గణనీయంగా పెరిగింది. సోమవారం ఇక్కడ హోల్‌సేల్ ధర కిలోకు సగటున 26 రూపాయలు పలికింది. గత నెల 25వ తేదీన ఈ రేటు కిలోకు సగటున 17 రూపాయలుగా ఉంది. ఇప్పుడు, నాణ్యమైన ఉల్లి ధరలు మహారాష్ట్రలోని చాలా హోల్‌సేల్ మార్కెట్‌లలో కిలోకు 30 రూపాయలు దాటాయి.


ఉల్లిపాయల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి?
గత 15 రోజులుగా ఉల్లి ధరలు పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్‌ - సప్లయ్‌ మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండడం. ఈ నెల ప్రారంభం (జూన్‌ 2024) నుంచి మార్కెట్లలోకి వస్తున్న ఉల్లి పంట గత సీజన్లలో పండినదేగానీ, కొత్తది కాదు. ఉల్లి రైతులు, వ్యాపారులు పంటను ఇప్పటి వరకు నిల్వ చేసి, ఇప్పుడు మార్కెట్లలోకి తీసుకువస్తున్నారు. 2023-24 రబీ సీజన్‌లో దిగుబడి తగ్గవచ్చని, దీనివల్ల ఆనియన్ రేట్లు పెరుగుతాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


కేంద్ర ప్రభుత్వం ఉల్లి పంటపై ఎగుమతి సుంకాన్ని త్వరలోనే తొలగిస్తుందని రైతులు, వ్యాపారులు ఆశిస్తున్నారు. ఈ అంచనా ఆధారంగా స్టాకిస్టులు ఉల్లిపాయలను భారీగా నిల్వ చేస్తున్నారు. ఎగుమతి సుంకాన్ని తొలగించిన తర్వాత ఉల్లి ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, ఈ సమయంలో తమ సరురు మంచి ధర పలుకుతుందని లెక్కలు వేస్తున్నారు.


మరో ఆసక్తికర కథనం: '5 ట్రిలియన్ డాలర్ల' బాధ్యత నిర్మలమ్మదే - వరుసగా ఏడోసారీ మేడమే! 


ప్రస్తుతం ఎగుమతుల్లో మందగమనం ఉంది     
ప్రస్తుతం, ఉల్లి ఎగుమతిపై 40 శాతం ఎగుమతి సుంకం (Export duty on onions) అమల్లో ఉంది. దీని కారణంగా ఉల్లి ఎగుమతుల్లో (Onion exports) వేగం నెమ్మదిగా ఉంది. ఈ నెల 17న ఈద్ ఉల్ అధా (బక్రీద్) పండుగ జరుపుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా దేశీయంగా ఉల్లికి మరికొంత కాలం డిమాండ్ కొనసాగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. 


ప్రస్తుతం, మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లికి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని వ్యాపారులు అంటున్నారు.


మరో ఆసక్తికర కథనం: ఆయిల్ వాడకం తగ్గించండీ- ఆరోగ్యమే కాదు ఆదాయం కూడా పెరుగుతుంది- సన్‌ఫ్లవర్‌ నూనె రేటు చూస్తే ఇదే చెబుతారు