Finance Minister Nirmala Sitharaman: మోదీ 3.0 ప్రభుత్వంలో, కీలక శాఖలైన రక్షణ, హోమ్, ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖలు BJP చేతిలోనే ఉన్నాయి. ఈ శాఖలను పాత మంత్రులకే ప్రధాని మోదీ అప్పగించారు. మోదీ 2.0లో ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పని చేసిన నిర్మల సీతారామన్‌కు, మోదీ 3.0 హయాంలోనూ అదే పోర్ట్‌ఫోలియో దక్కింది. దీంతో, ఈసారి కూడా కేంద్ర బడ్జెట్‌ను ఆమే ప్రవేశపెట్టనున్నారు.
నిర్మల సీతారామన్‌కు ఆర్థిక వ్యవస్థ పగ్గాలు
"భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మలుస్తాం" అంటూ బీజేపీ 2.0 ప్రభుత్వంలో చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ తన మూడో టర్మ్‌లో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చి భారతదేశాన్ని 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే బాధ్యతను నిర్మల సీతారామన్‌కు అప్పగించారు.
వచ్చే నెలలో (జులై 2024) జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో, NDA 3.0 ప్రభుత్వం తొలి బడ్జెట్ (Union Budget 2024) ప్రవేశపెడుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అది వరుసగా ఏడోసారి అవుతుంది.
ప్రధాని మోదీ సలహా మేరకు భారత రాష్ట్రపతి పోర్ట్‌ఫోలియో విభజనకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. పోర్ట్‌ఫోలియో విభజనలో ప్రధాని మోదీ మరోమారు నిర్మల సీతారామన్‌కు ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలను అప్పగించారు. దీనిపై, తన ఎక్స్ అకౌంట్‌లో సోమవారం ఉదయం నిర్మల సీతారామన్ స్పందించారు. మోదీ నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు అంటూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఆయన మార్గనిర్దేశంలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని స్పష్టం చేశారు.
నార్త్ బ్లాక్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా, శాస్త్రి భవన్‌లో కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా నిర్మల సీతారామన్ బాధ్యతలు స్వీకరిస్తారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం అవుతారు. కొత్త ప్రభుత్వంలో మొదటి బడ్జెట్‌ను రూపొందించే బృహత్తర బాధ్యత ఇప్పుడు ఆర్థిక మంత్రిపై ఉంది. మోదీ 3.0 తొలి బడ్జెట్‌ను జులై మొదటి లేదా రెండో వారంలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిర్మలమ్మపై చాలా అంచనాలు, ఒత్తిళ్లు
బడ్జెట్‌కు సంబంధించి... వ్యవసాయం, పరిశ్రమలు, ఆర్థికవేత్తలు, కార్మిక సంస్థల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి త్వరలో ముందస్తు బడ్జెట్ సమావేశం నిర్వహిస్తారు. కొత్త ప్రభుత్వం తొలి బడ్జెట్ పరంగా ఆర్థిక మంత్రిపై చాలా అంచనాలు, ఒత్తిళ్లు ఉంటాయి. ద్రవ్యోల్బణం, పన్నుల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పిస్తూనే ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించడంలో బీజేపీ విఫలమైంది, మిత్రపక్షాల బలం కూడా అవసరమైంది. కాబట్టి, ఈ సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాల డిమాండ్‌లను కూడా ఆర్థిక మంత్రి పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీకి భారీగా మెజారిటీ తగ్గింది. ఆయా రాష్ట్రాల్లో కమలం పార్టీపై ప్రజలకు ఉన్న ఆగ్రహాన్ని తగ్గించేలా బడ్జెట్‌లో ప్రజాకర్షక ప్రకటనలు కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: అంతరిక్షం నుంచి కూడా కనిపించే ఫ్లాంట్ నిర్మించిన అదానీ!