Khavda Renewable Energy Park Is Visible From Space: గౌతమ్ అదానీ (Gautam Adani) నేతృత్వంలోని అదానీ గ్రూప్, సౌర విద్యుత్‌ రంగంలో (Solar Energy Sector) దూకుడుగా అడుగులు వేస్తోంది. అదానీ గ్రూప్, గుజరాత్‌లోని ఖవ్రాలో సుమారు 1.63 లక్షల కోట్ల రూపాయల (15.8 బిలియన్ పౌండ్లు) పెట్టుబడితో పునరుత్పాదక ఇంధన పార్కును (Renewable Energy Park) అభివృద్ధి చేసింది. ఖవ్రా ఫ్లాంట్‌ దాదాపు 200 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. 


విస్తీర్ణ పరంగా చూస్తే, ఫ్రెంచ్ రాజధాని పారిస్ కంటే దాదాపు 5 రెట్లు పెద్దదైన ఖవ్రా రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌ ఇప్పుడు అంతరిక్షం నుంచి కూడా మాత్రమే చూడగలిగేంత భారీగా ఉందట. బహుశా, అంతరిక్షం నుంచి చూడగలిగే మొట్టమొదటి ఫ్లాంట్‌ ఇదే కావచ్చు. సోలార్ ఎనర్జీ సెక్టార్‌లో గేమ్ ఛేంజర్‌గా ఖవ్రా ప్లాంట్‌ను పరిగణిస్తున్నారు. 


బ్రిటిష్ వార్తాపత్రిక కథనం ప్రకారం..
బ్రిటిష్ వార్తాపత్రిక డైలీ ఎక్స్‌ప్రెస్ (Daily Express News Paper) రిపోర్ట్‌ ప్రకారం, అదానీ గ్రూప్‌నకు చెందిన ఈ భారీ ప్రాజెక్ట్ అంతరిక్షం నుంచి కనిపిస్తుంది. ఈ ప్లాంట్‌ పనులు ఇంకా 100% పూర్తి కాలేదు. పూర్తయితే స్విట్జర్లాండ్ లాంటి చిన్న దేశపు ఇంధన అవసరాలకు సరిపడా విద్యుత్‌ను ఈ ఒక్క ప్రాజెక్ట్‌ నుంచే ఇవ్వొచ్చు. ఈ ప్లాంట్ భారతదేశంలోని 2 కోట్ల ఇళ్లలో వెలుగులు నింపగలదని వార్తాపత్రిక నివేదిక చెబుతోంది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌ వంటి పెద్ద దేశం విద్యుత్‌ అవసరాలను తీర్చడంలో ఈ ఫ్లాంట్‌ చాలా కీలకమైనది.


అమెరికా, చైనా, యూరప్‌ బాటలో వెళ్లం
డైలీ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్‌ ప్రకారం, భారతదేశ మొత్తం సౌరశక్తి ఉత్పత్తిలో 9 శాతం ఖవ్రా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ఒక్కటే ఉత్పత్తి చేయగలదు. రెన్యూవబుల్ ఎనర్జీ పరంగా, ఖవ్రా ప్రాజెక్ట్ మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద పవర్ ప్లాంట్. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్  (Adani Green Energy Ltd) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ (Sagar Adani) ఇటీవల CNNకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. "స్థిరమైన ఇంధన వనరులను మేము చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. అమెరికా, చైనా, యూరప్‌ల బాటలోనే భారత్‌ కూడా పయనిస్తే పర్యావరణం భవిష్యత్‌ చాలా తీవ్రంగా మారుతుంది. వాటి బాటలో మేం నడవాడనుకోవడం లేదు" అని చెప్పారు.


భారతదేశంలో ఇప్పటికీ బొగ్గు విద్యుత్‌దే పెద్ద వాటా
గౌతమ్ అదానీ మేనల్లుడైన సాగర్ అదానీ, మన దేశంలో ఇప్పటికీ పెద్ద మొత్తంలో విద్యుత్ బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతోందని చెప్పారు. అయితే, ఇప్పుడు పరిస్థితి వేగంగా మారుతోందన్నారు. పర్యావరణ భద్రత దిశగా భారత్‌ వైపు నుంచి పడుతున్న అడుగుల్లో ఖవ్రా ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకమైన అడుగుగా మారిందని అన్నారు. 


ఖవ్రా రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌ పూర్తయితే, ఈ ప్లాంట్ నుంచి 20 గిగావాట్ల హరిత ఇంధనాన్ని (Green Energy) ఉత్పత్తి చేయవచ్చు.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి