CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పదోతరగతిలో 10 జీపీఏ సాధిస్తే ఇంటర్‌లో ఉచితంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోని జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోతరగతిలో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులతో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన 'విద్యాదాత' పురస్కారాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా 'టెన్త్' టాపర్లకు పురస్కారాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవి మట్టిలో మాణిక్యాలుగా రాణించిన విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్య, వ్యవసాయ రంగాలకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ రంగాల్లో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్న లక్ష్యంతోనే విద్య కమిషన్, వ్యవసాయ కమిషన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పదోతరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ఇంటర్ కాలేజీల్లో ఎలాంటి ఫీజులు లేకుండా అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మౌలిక వసతులు తక్కువగా ఉన్నా.. కార్పొరేట్ స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడటం అభినందనీయమన్నారు. ఇప్పుడున్న సివిల్ సర్విస్ అధికారుల్లో చాలా మంది ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని.. తనతోపాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివామని రేవంత్ చెప్పారు.
రాష్ట్రంలో విద్యార్థులు లేరంటూ పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఉండబోదని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామం, తండాకు విద్యను తీసుకెళ్లాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకోసం 'మెగా' డీఎస్సీ నిర్వహించబోతున్నామని సీఎం తెలిపారు. శిథిలావస్థలో ఉన్న సర్కారీ స్కూల్ భవనాల మరమ్మతుల కోసం రూ.2 వేల కోట్లు ఖర్చుచేయనున్నట్లు సీఎం తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలతో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చిందన్నారు. ఈ క్రమంలో ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తూ.. సెమీ రెసిడెన్షియల్‌గా మార్చాలన్న ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకే ఇస్తున్నామన్నారు.
ఇంటర్ ప్రవేశాలకు ఈ డాక్యుమెంట్లు అవసరం..
➥ ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థులు దరఖాస్తుకు పదోతరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డు తప్పనిసరిగా దరఖాస్తుకు జతపరచాలి. ప్రొవిజినల్ అడ్మిషన్ పూర్తయిన తర్వాత కచ్చితంగా ఒరిజినల్ మెమోతో పాటు టీసీ సమర్పించాల్సి ఉంటుంది. పదోతరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
➥ కళాశాలల్లో ప్రవేశాల సమయంలో నిర్దేశిత రిజర్వేషన్లు కల్పిస్తారు. ప్రవేశాలు పొందే ప్రతి విద్యార్థి విధిగా ఆధార్ సంఖ్యను పేర్కొనాలి. పదోతరగతి ఉత్తీర్ణత తర్వాత విరామంతో ఇంటర్‌లో ప్రవేశాలు పొందాలనుకునే వారు స్థానిక, నివాస ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి.
➥ పదోతరగతిలో జీపీఏ, అందులో సబ్జెక్ట్ వారీగా గ్రేడ్ పాయింట్లను పరిగణనలోకి తీసుకోని ప్రవేశాలు కల్పించాలి. కళాశాలల్లో మంజూరైన ప్రతి సెక్షన్‌లో 88 మందిని చేర్చుకోవాలి. అదనపు సెక్షన్లు అవసరమయితే ఇంటర్ బోర్డు అనుమతి తీసుకోవాలి. దీన్ని ఉల్లంఘించిన కళాశాలలకు జరిమానా విధించడంతో పాటు గుర్తింపును రద్దు చేస్తారు.
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..