Indian Tennis Young Sensation Sumit Nagal Achieves Career Best Rank: భారత టెన్నిస్ స్టార్ ఆటగాడు, యువ సంచలనం సుమిత్ నాగల్(Sumit Nagal) కెరీర్ బెస్టు ర్యాంకుకు చేరుకున్నాడు. తాజాగా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్(ATP Rankings) ప్రకటించిన ర్యాంకులలో నాగల్.. ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 713 ఏటీపీ పాయింట్లతో 77వ ర్యాంకుకు చేరుకున్నాడు. జర్మనీ వేదికగా ఆదివారం ముగిసిన హీల్‌బ్రోన్ నెకర్‌కప్ చాలెంజర్ ఈవెంట్‌లో టైటిల్ నెగ్గడంతో నాగల్ ర్యాంకు బాగా మెరుగుపడింది. దీంతో అతడు రాబోయే పారిస్ ఒలింపిక్స్‌లో సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున పాల్గొనేందుకు కోటానూ దక్కించుకున్నట్టే భావించవచ్చు . నిబంధనల ప్రకారం పురుషుల, మహిళల సింగిల్స్‌లో టాప్-56 ప్లేయర్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. కానీ ఎంతమంది మెరుగైన ర్యాంకులో ఉన్నప్పటికీ ఒక్క దేశం నుంచి మాక్సిమం నలుగురు ప్లేయర్లు మాత్రమే ఈ టోర్నీ లో పోటీపడాల్సి ఉంటుంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆటగాళ్ల జాబితాను ఆయా జాతీయ సమాఖ్యలకు బుధవారం లోపు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య పంపిస్తుంది. చివరగా ఒలింపిక్స్ సింగిల్స్‌లో 2012లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఆడాడు. అప్పుడతను వైల్డ్‌కార్డు ద్వారా ప్రవేశం పొందాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన నాగల్ జనవరిలో ర్యాంకింగ్స్‌లో 138వ స్థానంలో ఉన్నాడు, అయితే అప్పటి నుండి అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో చెన్నై ఓపెన్ గెలిచిన తర్వాత భారత టెన్నిస్ ప్లేయర్ తొలిసారి టాప్ 100లోకి ప్రవేశించాడు.