Prime Ministers Who Presented Union Budget In India: మోదీ 3.0 పాలనలో రెండో బడ్జెట్ సమర్పణకు సమయం ఆసన్నమవుతోంది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), 2025 ఫిబ్రవరి 01న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. మోదీ హయాంలో దేశ ఆర్థిక వృద్ధి దిశను నిర్ణయించే ఈ బడ్జెట్‌లో కీలక ప్రకటనలు, ఆర్థిక తాయిలాలు ఉంటాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
భారతదేశ ఆర్థిక క్యాలెండర్‌లోనే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ఫిబ్రవరి 01 ఒక కీలకమైన తేదీగా నిలుస్తుంది. ఆ రోజున, కేంద్ర ప్రభుత్వం సమర్పించే బడ్జెట్ ఒక ముఖ్యమైన సంఘటనగా మిగులుతుంది. భారతదేశం, కేంద్ర బడ్జెట్ చరిత్రలో అనేక కీలక పరిణామాలను చూసింది. వీటిలో ప్రత్యేకమైనవి.. తర్వాతి కాలంలో ప్రధానులుగా మారిన లేదా ఆ సమయంలో ప్రధానులుగా పని చేస్తున్న వ్యక్తులు బడ్జెట్ సమర్పించిన క్షణాలు.
కేంద్ర బడ్జెట్ సమర్పించిన ప్రధానులు వీళ్లే...
1. జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru)
భారతదేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 1958లో కేంద్ర బడ్జెట్‌ను మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ముంద్రా కుంభకోణం బయటపడిన తర్వాత, ఆ సంవత్సరం ఫిబ్రవరి 12న అప్పటి ఆర్థిక మంత్రి టి.టి. కృష్ణమాచారి రాజీనామా చేసిన తర్వాత, ఈ అరుదైన సంఘటన జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను స్వీకరించి, తానే స్వయంగా బడ్జెట్ సమర్పించారు.
2. మొరార్జీ దేశాయ్ (Morarji Desai)
జనతా పార్టీలో 1977 నుంచి 1979 వరకు ప్రధాన మంత్రిగా పని చేసిన మొరార్జీ దేశాయ్, భారతదేశంలో అత్యధిక కేంద్ర బడ్జెట్‌లు సమర్పించిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. ఆయన 8 వార్షిక & 2 తాత్కాలిక బడ్జెట్‌లు సహా మొత్తం 10 బడ్జెట్‌లను పార్లమెంట్ ఎదుట ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా, తన పదవీ కాలంలో 1959 నుంచి 1963 వరకు వరుసగా బడ్జెట్‌లు సమర్పించారు, వీటిలో 1962లో సమర్పించిన మధ్యంతర బడ్జెట్ కూడా ఉంది. ఆ తర్వాత 1967లో ఒక తాత్కాలిక బడ్జెట్‌తో పాటు 1967, 1968, 1969 బడ్జెట్‌లను ప్రకటించారు.
3. ఇందిరాగాంధీ (Indira Gandhi)
భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, తన పదవీ కాలంలో బడ్జెట్ సమర్పించారు. అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా తర్వాత, 1969లో, ఇందిరా గాంధీ ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టారు. ఆ తర్వాత 1970 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఒక సంవత్సరం తర్వాత, హోం మంత్రి యశ్వంతరావు చవాన్ (Yashwantrao Chavan)ను కొత్త ఆర్థిక శాఖ మంత్రిగా నియమించారు.
4. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi)
తన హయాంలో, అప్పటి ఆర్థిక మంత్రి వి.పి. సింగ్ (V P Singh)ను ఆ పదవి నుంచి తొలగించిన తర్వాత, రాజీవ్ గాంధీ 1987 జనవరి - జులై మధ్య కొంతకాలం ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
5. మన్మోహన్ సింగ్ (Manmohan Singh)
ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు (P V Narasimha Rao) ప్రభుత్వంలో, 1991 నుంచి 1996 వరకు, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఆయన సమర్పించిన 1991 బడ్జెట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పట్టాలు ఎక్కించింది, చరిత్రలో నిలిచిపోయింది. ఆ బడ్జెట్ ద్వారా మన్మోహన్ సింగ్ ప్రకటించిన ఆర్థిక సంస్కరణలు (సరళీకరణ, ప్రైవేటీకరణ & ప్రపంచీకరణ) భారతదేశాన్ని అప్పుల భారం నుంచి బయటపడేడమే కాదు, అభివృద్ధి కోసం కొత్త తలుపులు తెరిచాయి. మన్మోహన్ సింగ్ సమర్పించిన 1994 బడ్జెట్ దేశంలోకి సేవల పన్ను (service tax)ను తీసుకువచ్చింది, ఇది ప్రభుత్వానికి కీలక ఆదాయ వనరుగా మారింది.
మరో ఆసక్తికర కథనం: మొరార్జీ దేశాయ్ - నిర్మల సీతారామన్, అత్యధిక బడ్జెట్‌ల రికార్డ్ ఎవరిది?