Indian Railway:
రైలు ప్రమాదాలను తగ్గించేందుకు నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే (NFR) వినూత్న ప్రయోగం చేపట్టింది. డ్రైవర్లు నిద్రపోతే గుర్తించి వెంటనే అప్రమత్తం చేసే వ్యవస్థను రూపొందిస్తోంది. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తోంది. డ్రైవర్లు నిద్ర మత్తులోకి జారుకుంటున్నారని అనిపిస్తే వారు కంటి రెప్పలు వాల్చుతున్న తీరును ఈ డివైజ్ గుర్తిస్తుంది. అవసరమైతే అత్యవసర బ్రేకులు వేస్తుంది.
కంటి రెప్పలు వాల్చుతున్న తీరును బట్టి డ్రైవర్లను అప్రమత్తం చేసే యంత్రాన్ని రూపొందించాలని రైల్వే బోర్డు జూన్‌లో ఎన్‌ఎఫ్‌ఆర్‌ను కోరింది. ఈ వ్యవస్థకు రైల్వే డ్రైవర్ అసిస్టెన్సీ సిస్టమ్ (RDAS) అని ఎన్‌ఎఫ్‌ఆర్ పేరు పెట్టింది. డ్రైవర్లు నిద్రలోకి జారుకుంటే అప్రమత్తం చేయడమే కాకుండా తాత్కాలికంగా బ్రేకులు వేస్తుంది. ఇందుకోసం నిఘా నియంత్రణ వ్యవస్థతో అనుసంధానం అవుతుంది.
'ఈ పరికరం ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. సామర్థ్యం తెలుసుకొనేందుకు ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఎన్‌ఎఫ్‌ఆర్ సాంకేతిక సిబ్బంది ఈ పరికరంపై నిరంతరం పనిచేస్తున్నారు. మరికొన్ని వారాల్లో పని పూర్తవుతుంది' అని రైల్వే వర్గాలు పీటీఐకి తెలిపాయి.
ఆర్‌డీఏఎస్ వ్యవస్థను అత్యంత వేగంగా పూర్తి చేయాలని రైల్వే బోర్డు ఆగస్టు 2న ఎన్‌ఎఫ్‌ఆర్‌ను కోరింది. పరికరం పూర్తవ్వగానే పైలట్ ప్రాజెక్టుగా 20 గూడ్స్ రవాణా ఇంజిన్లు (WAG9), ప్యాసెంజర్ రైలు ఇంజిన్లలో (WAP7) అమర్చాలని ఆదేశించింది. పరీక్షించిన తర్వాత పరికరం ఎలా పనిచేస్తుందో వివరణ ఇవ్వాలని అన్ని రైల్వే జోన్లకు సూచించింది. మరింత మెరుగు పర్చేందుకు సూచనలు ఇవ్వాలని వెల్లడించింది.
ది ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్‌మెన్ ఆర్గనైజేషన్ (IRLRO) మాత్రం ఈ పరికరాన్ని వ్యతిరేకిస్తోంది. ఇదో అనవసర ప్రయాసగా వర్ణిస్తోంది. వేగంగా ప్రయాణించే రైల్లలో ఇప్పటికే డ్రైవర్లను అప్రమత్తం చేసే వ్యవస్థలు ఉన్నాయని తెలిపింది.
'ప్రతి హైస్పీడ్ రైలు ఇంజిన్‌లో కాలితో ఆపరేట్ చేసే లీవర్ (పెడల్) ఉంటుంది. డ్రైవర్ ప్రతి 60 సెకన్లకు దానిని తాకుతుండాలి. అలా చేయకపోతే ఆటోమేటిక్‌గా అత్యవసర బ్రేకులు పడతాయి. రైలు ఆగిపోతుంది. డ్రైవర్లను అప్రమత్తంగా ఉంచేందుకు ఈ వ్యవస్థగా బాగానే పనిచేస్తోంది' అని ఐఆర్‌ఎల్‌ఆర్‌వో వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ తెలిపారు. అయితే ఆ పెడల్‌పై కాలు పెట్టి నిద్రపోతే ఏం జరుగుతుందన్న దానిపై స్పష్టత లేదు! ఇక సెమీ స్పీడ్ రైల్వే ఇంజిన్ల పరిస్థితి తెలియదు.
'ఆర్‌డీఏఎస్ ఓ వృథా ప్రయాస. రైలు నిర్వహణ వ్యవస్థ నిజంగానే సజావుగా సాగాలని రైల్వే బోర్డు భావిస్తే.. రైల్వే డ్రైవర్ల అలసట, పని గంటలు, సౌకర్యాల, విశ్రాంతి సమయంపై దృష్టి సారించడం మంచిది. చాలా సందర్భాల్లో మహిళలు సహా రైల్వే డ్రైవర్లు కనీసం ఆహారం తినేందుకూ విరామం ఉండటం లేదు. 11 గంటల విధి నిర్వహణలో మూత్ర విసర్జనకూ అవకాశం లేదు. అసలు వీటిని పట్టించుకొంటే ఆర్‌ఏడీఎస్ వంటి వ్యవస్థల అవసరమే లేదు' అని ఆయన అన్నారు.