Arguments in ACB Court: చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చిన అనంతరం ఉదయం 6 గంటల నుంచి వాదనలు జరుగుతున్నాయి. సీఐడీ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. సంస్థ తరపు న్యాయవాది పి.సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లుత్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు (Chandrababu) తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపిస్తూ.. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోర్టును కోరారు. ఈ మేరకు నోటీసు ఇచ్చారు. 409 సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని లుథ్రా వాదించారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని లుథ్రా వివరించారు. రిమాండ్ రిపోర్టు తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు.


రాష్ట్ర అసెంబ్లీనే ఆమోదించింది - చంద్రబాబు (Chandrababu)
అనంతరం కోర్టులో స్వయంగా చంద్రబాబు వాదనలు వినిపించారు. తన అరెస్టు అక్రమమని చంద్రబాబు కోర్టుకు చెప్పారు. రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. స్కిల్ డెవలప్ మెంట్ కు 2015-16 బడ్జెట్‌లో నిధులు కేటాయించాం. దాన్ని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరు. 2021 డిసెంబర్ 9 నాటి ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు. అప్పటి రిమాండ్ రిపోర్టులోనూ నా పాత్ర ఉందని సీఐడీ ఎక్కడా పేర్కొనలేదు.


రాష్ట్రంలో పూర్తిగా కక్ష్య సాధింపు పాలన సాగుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలపై అధికార జులుం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రమంతా ఎక్కడా చట్టబద్ధమైన పాలన జరగడం లేదు. పౌర హక్కులకు తీవ్రక విఘాతం కలుగుతోంది. గవర్నర్ అనుమతి లేకుండానే నన్ను అరెస్టు చేశారు’’ అని చంద్రబాబు వాదనలు వినిపించుకున్నారు.


15 నిమిషాల విరామం; కోర్టులోనే ఉంటానన్న చంద్రబాబు
చంద్రబాబు (Chandrababu) తరపు న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదనలు కొనసాగుతుండగా న్యాయమూర్తి 15 నిమిషాలు విరామం ప్రకటించారు. పావుగంట తర్వాత వాదనలు కొనసాగుతాయని చెప్పారు. విరామం అనంతరం వాదనలు మొదలయ్యాయి. మీరు కోర్టు హాలు లోనే ఉంటారా అని చంద్రబాబును జడ్జి అడగ్గా, కోర్టులోనే ఉంటానని చంద్రబాబు అన్నారు.


సీఐడీ తరపున వాదనలు పూర్తి
సీఐడీ తరఫున వాదనలు ప్రారంభించారు ఏఏజీ పి.సుధాకర్ రెడ్డి.  చంద్రబాబును నిన్న ఉదయం 6 గంటలకు అరెస్ట్‌ చేశామని చెప్పారు. ఈ కేసులో మరో ఏడుగురిని సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసిందని అన్నారు. 24 గంటలలోపే చంద్రబాబుని కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. ఈ కేసులో A - 35 రిమాండ్‌ను ఇదే కోర్టు తిరస్కరిస్తే అపెక్స్ కోర్టు రిమాండ్‌కు ఆదేశించిందని గుర్తు చేశారు. హైకోర్టు ఈ కేసులో A - 35 ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా సస్పెండ్ చేసిందని అన్నారు. 2015లో జీవో 4 ద్వారా స్కామ్ కు తెర తీశారని ఏఏజీ వాదించారు.