Crypto Currency intruction in India: భారతదేశంలో క్రిప్టో కరెన్సీని (Crypto Currency) ప్రవేశపెట్టే ఉద్దేశం తమకు లేదని కేంద్ర ప్రభుత్వం (Central Government) రాజ్య సభలో తెలిపింది. వర్చువల్‌ కరెన్సీపై (Virtual Currency) నియంత్రణ లేదని పేర్కొంది. త్వరలోనే ఆర్‌బీఐ డిజిటల్‌ రూపాయిని (RBI Digital Rupee) తీసుకొస్తుందని వెల్లడించింది.


'క్రిప్టో కరెన్సీని ఆర్‌బీఐ జారీ చేయదు. ఆర్‌బీఐ నిబంధనలు, ఆర్‌బీఐ చట్టం 1994 ప్రకారం ముద్రించిన కరెన్సీ నోట్లే చెలామణీ అవుతాయి. సంప్రదాయ పేపర్‌ కరెన్సీ డిజిటల్‌ వెర్షన్‌ను సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (CBDC) అంటారు' అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సభలో తెలిపారు.





ప్రస్తుతం డిజిటల్‌ రూపాయిని దశల వారీగా ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని పంకజ్‌ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఎలాంటి అంతరాయాలు, అవాంతరాలు లేకుండా సీబీడీసీని ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ కసరత్తు చేస్తోందన్నారు.


'సీబీడీసీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నగదుపై ఆధారపడటం తగ్గుతుంది. తక్కువ ఖర్చుతోనే డిజిటల్‌ రూపాయి చెలామణీలో ఉంటుంది. ఇంకా చాలా ఖర్చులు తగ్గుతాయి' అని పంకజ్‌ చౌదరి తెలిపారు. రానురానూ కరెన్సీ నోట్ల ముద్రణ తగ్గిపోతోందని ఆయన సభలో తెలిపారు. 2019-20లో రూ.4,378 కోట్ల విలువైన నోట్లను ముద్రించగా 2020-21లో అవి రూ.4,012 కోట్లకు తగ్గిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బాగుందని ఆయన మరో ప్రశ్నకు జవాబు ఇచ్చారు.


'దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు నిలకడగా రాణించే స్టాక్‌ మార్కెట్లు, మెరుగ్గా, సమర్థంగా పనిచేసే మార్కెట్‌ మౌలిక సదుపాయాలే సూచికలు. మధ్య, దీర్ఘ కాలిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని స్టాక్‌ మార్కెట్లే సూచిస్తాయి. భవిష్యత్తులో వ్యాపార సంస్థల ఆర్జన, లాభాలను షేర్ల ధరలు ప్రతిబింబిస్తాయి. ఎకానమీపై ఆత్మవిశ్వాసం పెంచుతాయి' అని పంకజ్‌ చౌదరి తెలిపారు.


స్వల్ప కాలంలో మాత్రం స్టాక్‌ మార్కెట్లపై ఆర్థిక, జియో పొలిటికల్‌ వ్యవహారాలు ప్రభావం చూపిస్తాయని మంత్రి తెలిపారు. 'షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లపై వేసిన పన్నులు, ఎక్స్‌ఛేంజులు వేసిన పన్నుల వివరాలను క్లైయింట్లకు జారీచేసే కాంట్రాక్టు నోట్లపై ముద్రిస్తారు. ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత బ్రోకర్లు వీటిని కస్టమర్లకు అందజేస్తారు' అని పంకజ్‌ చౌదరి అన్నారు.


Also Read: పెళ్లి ఖర్చులకు పీఎఫ్‌ డబ్బు కావాలా? సింపుల్‌గా ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయండి!


Also Read: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్ - దిగొచ్చిన బంగారం ధర, రూ.500 తగ్గిన వెండి ! లేటెస్ట్ రేట్లు ఇవీ


Also Read: LIC ఐపీఓ వాయిదా- కేంద్రం స్పీడుకు బ్రేకులు వేసిన పుతిన్!