LIC IPO Postponed: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ వాయిదా పడిందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది ఎల్ఐసీ ఐపీఓ చేపట్టాలని భావించిన కేంద్రానికి షాక్ తగిలింది. ప్రభుత్వం ఆశించినట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ఈ ఐపీఓ జరగకపోవచ్చని వచ్చే ఏడాదిలోనే ఇది జరగొచ్చని విశ్వసనీయ వర్గాల నుంచి ఏబీపీకి సమాచారం అందింది.
ఇదే కారణం
ఈ భారీ ఐపీఓను వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోన్న వేళ ఇలాంటి పెద్ద ఐపీఓను తీసుకురావడం అంత మంచిది కాదని పెట్టుబడిదారులు కేంద్రాన్ని అభ్యర్థించినట్లు సమాచారం.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేస్తోన్న కారణంగా ఆ దేశంపై పలు దేశాలు తీవ్రమైన ఆంక్షలు విధించాయి. దీని వల్ల విదేశీ సంస్థాగత పెట్టబడిదారులు (ఎఫ్ఐఐఎస్) ఎల్ఐసీ ఐపీఓలో చురుగ్గా పాల్గొనే అవకాశాలు తక్కువ ఉన్నట్లు కేంద్రం భావిస్తోంది.
భారీ ఆంక్షలు
రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు పెద్ద ఎత్తున్న ఆంక్షలు విధించాయి. అంతేకాకుండా రష్యా బ్యాంకులను స్విఫ్ట్ నుంచి నిషేధించాయి. విదేశీ పెట్టబడిదారులను ఈ ఆంక్షలు తీవ్ర ఆందోళనలో పడేశాయి. ఇలాంటి తరుణంలో ఎల్ఐసీపై పెట్టుబడి పెట్టేందుకు వారు ముందుకు వస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉక్రెయిన్- రష్యా సంక్షోభంతో ముడిచమురు ధర భారీగా పెరుగుతోంది. ఈ ప్రభావం భారత మార్కెట్లపై కూడా ఉంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఏఏమ్) సెక్రెటరీ తుహిన్ కాంత పాండే .. ఎల్‌ఐసీ ఐపీఓ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ నెలలో ఎల్ఐసీలోని 5 శాతం వాటాను అమ్మేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీని వల్ల రూ. 60,000 కోట్లు ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉందన్నారు.
మార్చి 31 లోపు ఎల్ఐసీ ఐపీఓను పూర్తి చేయాలని కేంద్రం ప్రణాళిక రచించింది. కానీ ఉక్రెయిన్- రష్యా యుద్ధంతో ఇది కచ్చితంగా వాయిదా పడినట్లే కనిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఎల్ఐసీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
- పీయూష్ పాండే, ఏబీపీ న్యూస్, ముంబయి