National Retail Trade Policy: భారతదేశ రిటైల్ వ్యాపార రంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'జాతీయ రిటైల్ ట్రేడ్ పాలసీ'ని కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో ప్రకటించనుంది. దీంతో పాటు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) కింద నమోదైన దేశీయ వ్యాపారుల కోసం ప్రమాద బీమా పథకాన్ని (Accident Insurance Scheme For Traders) కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారులను ఈ విషయం చెప్పారంటూ పీటీఐ వార్త సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
జాతీయ మీడియా వార్తల ప్రకారం... జాతీయ రిటైల్ ట్రేడ్ పాలసీ లక్ష్యం వ్యాపారులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం & సులభంగా రుణాలు పొందేలా చూడడం. ఈ పాలసీ ప్రకారం, తక్కువ వడ్డీ రేట్లకు సులభంగా రుణాలు అందేలా చూస్తారు. రిటైల్ వాణిజ్యం ఆధునికీకరణ, డిజిటలైజేషన్‌కు మార్గం సుగమం చేయడం, పంపిణీ గొలుసు వంటి ఆధునిక మౌలిక సదుపాయాలను అందించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, శ్రామిక శక్తి ఉత్పాదకతను పెంచడం, సమర్థవంతమైన కౌన్సెలింగ్, ఫిర్యాదులు తగ్గించడం వంటివి వాటిని ఈ పాలసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన వ్యవస్థను సిద్ధం చేయడానికి చర్యలు తీసుకోవచ్చు.
దుకాణదార్లకు అనేక ప్రయోజనాలు
ఈ-కామర్స్ రంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది. చిన్న దుకాణాలు నడుపుతున్న రిటైల్ వ్యాపారుల కోసం కూడా నేషనల్ రిటైల్ ట్రేడ్ పాలసీని తీసుకువస్తోంది. చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులకు ఈ పాలసీ ఉపయోగకరంగా ఉంటుందని ఒక ప్రభుత్వ అధికారి చెప్పినట్లు పీటీఐ వెల్లడించింది.
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
ప్రతిపాదిత జాతీయ రిటైల్ ట్రేడ్ పాలసీ ప్రకారం.. ఫిర్యాదుల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ప్రత్యేక వ్యవస్థను తీసుకురావచ్చు. దీని కింద, వ్యాపారులకు సింగిల్ విండో క్లియరెన్స్ మెకానిజం ఏర్పాటు చేయవచ్చు. ఇది కాకుండా, కేంద్రీకృత & కంప్యూటరైజ్డ్ తనిఖీ నిర్వహణ వ్యవస్థను కూడా సిద్ధం చేయవచ్చు. ఇదే సమయంలో, పాలసీ కింద కల్పించే ప్రమాద బీమా ఆయా వ్యాపారులకు పెద్ద ప్రయోజనంగా నిలుస్తుంది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్
ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్‌లలో భారతదేశం ఒకటి. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి టాటా గ్రూప్ వంటి పెద్ద దేశీయ కార్పొరేట్ సంస్థల వరకు ఈ రిటైల్ స్పేస్‌లో పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాయి. మరోవైపు, అమెజాన్, వాల్‌మార్ట్ వంటి బహుళజాతి సంస్థలు కూడా ఎటువంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. గత కొన్ని సంవత్సరాల్లో, భారతదేశంలో ఈ-కామర్స్ రంగం అతి వేగంగా అభివృద్ధి చెందింది, ఇప్పుడు చిన్న పట్టణాలకు కూడా చేరుకుంది. ఈ వేగవంతమైన మార్పుల కారణంగా, బలమైన జాతీయ రిటైల్ వాణిజ్య విధానం కోసం అనేక సంవత్సరాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్‌లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.