Employment in India in 2024: భారత్‌లో నిరుద్యోగంపై వార్తలు, విమర్శలు, విశ్లేషణలు ప్రతిరోజూ మన చెవిన పడుతూనే ఉంటాయి. వాటి వల్ల ఫైనల్‌గా మనకు అర్ధమయ్యే విషయం ఒక్కటే - భారత్‌లో నిరుద్యోగం తారస్థాయిలో ఉంది. అయితే, ప్రభుత్వ గణాంకాలు మాత్రం వేరే స్టోరీ చెబుతున్నాయి. ఆ లెక్కలు చూస్తే.. మనం ఇండియాలోనే ఉన్నామా అని ఆశ్చపోకతప్పదు.


నేషనల్ కెరీర్ సర్వీస్ (National Career Service - NCS) పోర్టల్ ప్రకారం.. మన దేశంలో అందుబాటులో ఉన్న ఉద్యోగాలు ఎక్కువ, ఆ ఉద్యోగాల్లో చేరే వాళ్లు తక్కువ. NCS డేటాను బట్టి చూస్తే.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో (FY24), ఉద్యోగాల కోసం ఈ పోర్టల్‌లో 87 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగ ఖాళీలు మాత్రం ఒక కోటి కంటే ఎక్కువే ఉన్నాయి. 


200% పైగా ఉద్యోగాలు - 53% ఉద్యోగార్థులు
నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌ ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 01 కోటి 09 లక్షల 24 వేల 161 (1,09,24,161) ఉద్యోగాలు పోర్టల్‌ నమోదయ్యాయి. ఈ సంఖ్య 2022-23 ఆర్థిక సంవత్సరంలోని (FY23) 34,81,944 ఉద్యోగాల కంటే 214 శాతం ఎక్కువ. విచిత్రం ఏంటంటే... ఇదే కాలంలో, ఉద్యోగార్థుల సంఖ్య కేవలం 53 శాతం పెరిగి 87,20,900 కు చేరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 57,20,748 ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. 


ఉద్యోగాల సంఖ్య ఎలా పెరిగింది?
భారత ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకోవడం, మ్యాన్‌ పవర్‌ కోసం కార్పొరేట్‌ సెక్టార్‌ నుంచి వస్తున్న డిమాండ్‌ కారణంగా ఉద్యోగాల సంఖ్య పెరిగిందని ఒక ప్రభుత్వ సీనియర్ అధికారి చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‍‌(Finance Minister Nirmala Sitharaman) కూడా ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు.


ఆర్థిక & బీమా రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు
నేషనల్ కెరీర్ సర్వీస్ లెక్కల ప్రకారం... ఫైనాన్స్, బీమా రంగాల్లో గరిష్ట ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. FY23తో పోలిస్తే FY24లో ఈ సంఖ్య 134 శాతం పెరిగి 46,68,845 ఉద్యోగాలకు చేరుకుంది. ఆ తర్వాత.. ఆపరేషన్స్‌ & సపోర్ట్‌ సెక్టార్‌ రెండో స్థానంలో ఉంది. FY23తో పోలిస్తే FY24లో ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య 286 శాతం పెరిగింది. సివిల్ & కన్‌స్ట్రక్షన్‌ సెక్టార్‌ మూడో స్థానంలో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో 9,396 ఉద్యోగాలు మాత్రమే నమోదు కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 11,75,900 ఉద్యోగాలు పోర్టల్‌లోకి వచ్చాయి. ఇతర సర్వీసుల్లోనూ ఉద్యోగాలు కూడా 199 శాతం పెరిగి 10,70,206కు చేరాయి.


ఉద్యోగాల కోసం గొప్ప అర్హతలు అవసరం లేదు!
తయారీ, ఐటీ & కమ్యూనికేషన్స్, రవాణా & నిల్వ, విద్య, స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్ రంగాల్లో కూడా ఉద్యోగాల సంఖ్య భారీగా పెరిగినట్లు NCS వెల్లడిస్తోంది. 12వ తరగతి అర్హతతో చేసే ఉద్యోగాల సంఖ్య 179 శాతం పెరిగింది. 10వ తరగతి లేదా అంతకంటే తక్కువ చదువుకున్న వ్యక్తులు చేయగల ఉద్యోగాల సంఖ్య 452 శాతం పెరిగింది. ఐటీఐ, డిప్లొమా హోల్డర్ల ఉద్యోగాలు 378 శాతం పెరిగాయి.


మరో ఆసక్తికర కథనం: హాలిడే ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? ఎస్‌బీఐ కొత్త క్రెడిట్‌ కార్డ్స్‌తో ప్రతి ఖర్చుపై రివార్డ్‌