Sri Siddeshwara Swamy Temple: విగ్రహరూపంలో పరమేశ్వరుడు పూజలందుకునే ఆలయాలు ఏపీలో రెండున్నాయి. వాటిలో ఒకటి చిత్తూరు జిల్లా గుడిమల్లం అయితే మరొకటి సత్య సాయి జిల్లా అమలాపురం మండలం హైమావతి గ్రామంలో ఉంది. హైమావతి పేరు కాలక్రమేణా హేమావతిగా మారింది. క్రీ.శ. 9-10 శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో శివుడు విగ్రహరూపంలో సిద్ధాసనంలో కూర్చుని ఉంటాడు. ఇలా సిద్ధాసనంలో కూర్చునే విగ్రహం మరెక్కడా కనిపించదంటారు ఆలయ నిర్వాహకులు.
నోలంబ రాజులు నిర్మించిన ఆలయం
సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని నోలంబ వంశానికి చెందిన రాజా చిత్రశేఖర, రాజా సోమశేఖరులు నిర్మించారని స్థలపురాణం. గర్భగుడిలో ఉన్న పరమేశ్వరుడి విగ్రహం 5.5 అడుగులు. హేమావి క్షేత్రానికి నోలంబుల రాజుల కాలంలో హేంజేరు అని మరో పేరు ఉండేది. ఈ ప్రాంతాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని సుమారు 32 వేల గ్రామాలను నోలంబ రాజులు పాలించేవారనీ ఇక్కడున్న శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. 32 వేల గ్రామాలంటే...ప్రస్తుతం ఉన్న అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటూ కర్ణాటకలోని తూముకురు, చిత్రదుర్గం, కోలార్, తమిళనాడులో సేలం, ధర్మపురి జిల్లాల్లో గ్రామాలున్నీ పాలించేవారు.
Also Read: ఈ రాశుల ఉద్యోగులకు ఆదాయంతో పాటూ బాధ్యతలు కూడా పెరుగుతాయి, ఏప్రిల్ 28 రాశిఫలాలు
సంతానం కోసం విగ్రహ ప్రతిష్టాపన
నోలంబ రాజుల్లో ముఖ్యుడైన రాజమహేంద్రుడికి సంతానం లేదు. ఎన్నో పూజలు హోమాలు చేశారు. ఓరోజు రాజమహేంద్రుడి కలలో కనిపించిన పరమేశ్వరుడు..తన విగ్రహం ప్రతిష్టిస్తే సంతాన ప్రాప్తి ఉంటుందని, రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పాడు. కలలో శివుడు చెప్పినట్టే విగ్రహం ప్రతిష్టించాడు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేనివిధంగా శివలింగాలు బ్రహ్మముడితో ఉండటం విశేషం. సాధారణంగా ఆలయాలకు తూర్పుద్వారం ఉంటుంది...కానీ హేమావతి గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి ముఖద్వారం పడమరవైపు ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఏ ఆలయంలో అయినా గర్భగుడికి కిటికీలు ఉండవు..గాలి వెలుతురు వచ్చే అవకాశం లేకుండా నిర్మిస్తారు. కానీ సిద్దేశ్వర స్వామి ఆలయ గర్భగుడికి కిటికీలు కనిపిస్తాయి.
శిల్పకళా కళాశాల
ఆలయంలో శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. స్తంభాలన్నీ నున్నటి నల్లని రాయితో చెక్కారు. ఆలయ గోడలపై పురాణ ఇతిహాసాలు చెక్కి ఉంటాయి. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో శిల్పకళను నేర్పించేవారు..అందుకు సాక్ష్యంగా ఆలయం చుట్టూ జరిపిన తవ్వకాల్లో ఎన్నో విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయ పరసరాల్లో మాత్రమే కాదు..హేమావతి గ్రామంలోనూ ఇప్పటికీ రైతులు పొలాలు దున్నేటప్పుడు, నిర్మాణాల కోసం పునాదులు తవ్వేసమయంలోనూ శివలింగాలు బయటపడుతుంటాయి. వాటన్నింటినీ మ్యూజియంలో భద్రపరిచారు.
Also Read: మే మొదటివారం ఈ రాశులవారు గుడ్ న్యూస్ వింటారు - ఏప్రిల్ 29 నుంచి మే 05 వారఫలాలు!
నిధులున్నాయా!
ఈ ఆలయంలో 10వ శతాబ్దానికి చెందిన మూడు శాసనాల్లో ఆలయానికి సంబంధించిన నిధుల వివరాలున్నాయి. వీటి ఆధారంగానే అప్పట్లో టిప్పు సుల్తాన్ ఈ క్షేత్రంపై దండెత్తి చాలా సంపద కొల్లగొట్టాడని చెబుతారు. ఈ క్షేత్రంలో ఉన్న విగ్రహాల్లో నిధులకు సంబంధించిన రహస్యాలు దాగి ఉన్నాయని..ఆ లాంగ్వెజ్ ను డీ కోడ్ చేస్తే నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో తెలిసిపోతుందని చెబుతారు.
కళ్యాణ బావి ప్రత్యేతం
ఎంజేరు హైమావతి క్షేత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కళ్యాణి బావి గురించి. ఈ బావిలో నీటిని తాగిన వారికి దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఏటా శివరాత్రి సమయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే అగ్నిగుండం రోజున ... రైతులు పొలంలో వేసిన పంట రకంలో కాస్త అగ్నిగుండానికి అర్పిస్తే దిగుబడి బావుటుందని విశ్వాసం. నిత్యం భక్తులతో కళకళలాడే ఈ ఆలయం కార్తీకమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం ఈ దేవాలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు...
Also Read: 'మే' నెల ఏ రాశులవారిని ముంచేస్తుంది - ఏ రాశులవారికి కలిసొస్తుంది!