Vodafone Idea, Indian Hotels Shares: ఇవాళ్టి (బుధవారం) వీక్ మార్కెట్‌లోనూ వొడాఫోన్ ఐడియా, ఇండియన్ హోటల్స్ షేర్లు దుమ్ము రేపాయి. గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిన ఇండెక్స్‌లు నిన్నటి క్లోజింగ్‌ను అందుకోవడానికి తంటాలు పడుతుంటే, ఈ రెండు స్క్రిప్స్ మాత్రం ఎదురులేని మొనగాళ్లలా పెరిగాయి.
వొడాఫోన్ ఐడియా (Vodafone Idea)
ఇవాళ భారీ వాల్యూమ్స్ మధ్య, వొడాఫోన్ ఐడియా షేర్లు 10 శాతం పైగా ర్యాలీ చేసి రూ.10.05 ఇంట్రాడే గరిష్టానికి చేరుకున్నాయి. ఈ ఏడాది మే 31న ఇంట్రా డే డీల్స్‌లో గరిష్టంగా రూ.10.23కి చేరిన ఈ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ స్టాక్, మళ్లీ ఇప్పుడు అత్యధిక స్థాయిలో ట్రేడ్ అవుతోంది. దీని 52 వారాల గరిష్టం రూ.16.80 వద్ద ఉంది.
ఇవాళ ట్రేడింగ్ ప్రారంభమైన గంటలోపే NSE, BSEలో 206 మిలియన్ల వొడాఫోన్ ఐడియా ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. సగటున చూస్తే, గత రెండు వారాల్లో గంటకు ఈ కౌంటర్‌లో 200 మిలియన్ల కంటే తక్కువ షేర్లు ట్రేడయ్యాయి. ఇవాళ వాల్యూమ్స్ విపరీతంగా పెరిగాయి.
గత నెల రోజుల్లో ఈ స్టాక్ 14 శాతం పైగా పెరిగింది. గత ఆరు నెలల్లో దగ్గరదగ్గరగా 4 శాతం లాభపడింది. అయితే, ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూస్తే (YTD) ఇది 36 శాతం నష్టపోయింది.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో (Q1FY23), ఈ కంపెనీ రూ.7,297 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో రూ.7,319 కోట్ల నష్టాన్ని చూపింది. Q1FY22లో నివేదించిన రూ.9,152 కోట్ల కార్యకలాపాల ఆదాయం (ఆపరేటింగ్ రెవెన్యూ), Q1FY23లో 14 శాతం పెరిగి రూ.10,410 కోట్లకు చేరుకుంది. Q1FY22లో ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చిన సగటు ఆదాయం (ARPU - ఆర్పు) రూ.104తో పోలిస్తే, ఈ త్రైమాసికంలో రూ.128కు చేరింది. ప్లాన్ల టారిఫ్‌లు పెంచడం వల్ల ఇది ఈ త్రైమాసికంలో 23.4 శాతం పెరిగింది.
ఇండియన్ హోటల్స్ కంపెనీ (Indian Hotels Company - IHCL)
బుధవారం నాటి మార్కెట్‌లో దాదాపు 3 శాతం పెరిగిన ఇండియన్ హోటల్స్ కంపెనీ షేర్లు, కొత్త 52 వారాల గరిష్ట స్థాయి రూ.313.70కి చేరాయి. కంపెనీ బిజినెస్ ఔట్‌లుక్ మీద ఇన్వెస్టర్లలో పెరిగిన నమ్మకంతో అప్ మూవ్ వచ్చింది.
గత వారం రోజుల్లో, BSE సెన్సెక్స్‌లోని 0.87 శాతం క్షీణతతో పోలిస్తే, ఈ టాటా గ్రూప్ కంపెనీ స్టాక్ 10 శాతం ర్యాలీ చేసింది.
గత మూడు నెలల్లో, సెన్సెక్స్‌లో 7 శాతం పెరుగుదలతో పోలిస్తే ఇది 35 శాతం పెరిగి మార్కెట్‌ను అధిగమించింది. గత ఆరు నెలల్లో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లోని 12 శాతం లాభంతో పోలిస్తే ఈ కౌంటర్ 65 శాతం లాభపడింది.
ఇవాళ మధ్యాహ్నం 2.50 గం. సమయానికి 1 శాతం లాభంతో రూ.308.35 దగ్గర షేర్లు ట్రేడవుతున్నాయి. 2021 నవంబర్‌లోని రైట్స్ ఇష్యూ ధర రూ.150తో పోలిస్తే, ఇప్పటివరకు ఇది రెట్టింపు పైగా పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.