Stocks to watch today, 5 September 2022: ఇవాళ ఉదయం 7.30 గం. సమయానికి సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) పాజిటివ్‌గా ట్రేడవుతోంది. ఆ సమయంలో 43 పాయింట్లు లేదా 0.25 శాతం రెడ్‌లో 17,496 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ ప్రతికూలంగా ప్రారంభమవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఐపీవో న్యూస్ 
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ IPO ఇవాళ ప్రారంభమవుతుంది. రూ.520 – రూ.525 ప్రైస్‌ బ్యాండ్‌లో సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. మొత్తం షేర్లు ఫ్రెష్‌, ఓఎఫ్‌ఎస్‌ లేదు. ఐపీవో ద్వారా రూ.825 కోట్ల వరకు సేకరించాలని బ్యాంక్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రముఖ బ్యాంకర్ కృష్ణన్ శంకరసుబ్రమణ్యం మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు ఈ బ్యాంక్ ఆదివారం వెల్లడించింది.


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


పేటీఎం: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మేజర్ పేటీఎం కార్యాలయాల్లో ఈడీ సోదాల నేపథ్యంలో ఈ కంపెనీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. చైనీస్ లోన్ యాప్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్కానర్‌లో ఉన్నవాళ్లతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.


మహీంద్రా లైఫ్‌స్పేస్: మెరుగుపడిన హౌసింగ్ డిమాండ్‌ నేపథ్యంలో, వార్షిక అమ్మకాల బుకింగ్స్‌ను వచ్చే మూడేళ్లలో 2.5 రెట్లు పెంచి రూ.2,500 కోట్ల చేర్చాలని ఈ స్థిరాస్తి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. FY22లో ఈ కంపెనీ రూ.1,028 కోట్ల సేల్స్ సాధించింది.


రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL): అక్విజినష్ల విషయంలో దూకుడుగా ఉన్న రిలయన్స్‌, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు అయిన ల్యాంకో అమర్‌కంటక్ పవర్‌ను (ల్యాంకో) చేజిక్కించుకునే రేసులో ముందడుగులో ఉంది. ఇందుకోసం, రూ.1,960 కోట్లను ఆఫర్‌ చేస్తోంది.


ఐసీఐసీఐ బ్యాంక్: ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్, అఫర్డబుల్‌ ఇళ్లకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ ద్వారా రూ.10,000 కోట్ల వరకు సమీకరించాలని ఈ ప్రైవేట్‌ బ్యాంక్‌ యోచిస్తోంది. రేటింగ్ ఏజెన్సీ ICRA, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఆఫర్‌కు “AAA” రేటింగ్‌ కేటాయించింది.


ఎన్‌డీటీవీ : NDTVలో మరో 26 శాతం వాటా కొనుగోలు కోసం ఇచ్చిన తాత్కాలిక ఓపెన్ ఆఫర్‌పై అదానీ గ్రూప్ స్పష్టత ఇచ్చింది. అక్టోబర్ 27న ఓపెన్‌ ఆఫర్‌ ప్రారంభమవుతుంది, అయితే ఇది సెబీ ఆమోదానికి లోబడి ఉంటుంది. గ్రూప్‌ స్థాయిలో, FY22లో NDTV ఈ దశాబ్దంలోనే అత్యధిక ఏకీకృత లాభాన్ని సాధించినట్లు వార్షిక నివేదికలో వెల్లడించారు.


టీసీఎస్‌: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా, వార్షిక జీతాల పెంపును ఈ ఐటీ కంపెనీ నిలిపేసింది. దీనికి బదులుగా, కంపెనీ ఇప్పుడు మొత్తం పరిశ్రమ పెట్టుకున్న ప్రమాణాలను ఫాలో అవుతోంది. అయితే, ఫ్రెషర్లకు యథావిధిగా వార్షిక వేతనం పెంపు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.


యెస్ బ్యాంక్: నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ (NRE) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఈ ప్రైవేట్ రంగ రుణదాత  50-75 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది. ఫారిన్‌ కరెన్సీ నాన్ రెసిడెంట్ (FCNR) డిపాజిట్లపై కూడా రేటును పెంచింది. పెరుగుతున్న విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేసేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని నిబంధనలను సడలించిన నేపథ్యంలో, ఈ రేట్ల పెంపు జరిగింది.


ఇవాళ F&O నిషేధంలో ఉన్న స్టాక్స్‌: డెల్టా కార్ప్


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.