Stocks to watch today, 22 September 2022: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 143 పాయింట్లు లేదా 0.81 శాతం రెడ్ కలర్‌లో 17,573 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడం, వ్యయాలను తగ్గించడం కోసం లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్‌నకు చెందిన రిఫినిటివ్‌తో (Refinitiv) దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్థిక మార్కెట్ల డేటా, మౌలిక సదుపాయాలను అందించే కంపెనీల్లో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థల్లో Refinitiv ఒకటి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ, 7.57 శాతం కూపన్ రేటుతో బాండ్లను జారీ చేసి రూ.4,000 కోట్లను సమీకరించింది. బాసెల్ (Basel) III కంప్లైంట్ టైర్ II బాండ్లను జారీ చేసి ఈ ఫండ్‌ను సేకరించింది. ఈ ఇష్యూ దాదాపు 5 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది.
పీబీ ఫిన్‌టెక్: తన అనుబంధ సంస్థ పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్‌లో (Policybazaar Insurance Brokers) రూ.650 కోట్లు పెట్టుబడిని ఈ న్యూ ఏజ్ ఫిన్‌టెక్ ప్లేయర్ పెడుతోంది. మరో అనుబంధ సంస్థ పైసాబజార్ మార్కెటింగ్ అండ్ కన్సల్టింగ్‌లోనూ (Paisabazaar Marketing And Consulting) రూ.250 కోట్లు పెట్టుబడి పెడుతుంది.
కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్: డీజిల్ ఇంజిన్ల తయారీ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా అనురాగ్ భగానియా నియమితులయ్యారు. ఈ నియామకం నేటి నుంచి అమల్లోకి వస్తుంది. లా-గజ్జర్ మెషినరీస్‌లో (La-Gajjar Machineries) మిగిలిన 24 శాతం వాటాను కూడా కొనుగోలు చేసినట్లు ఈ కంపెనీ తెలిపింది.
త్రివేణి ఇంజినీరింగ్ & ఇండస్ట్రీస్: త్రివేణి టర్బైన్స్‌లో తనకున్న మొత్తం 21.85 శాతం వాటాను సుమారు రూ.1,600 కోట్లకు విక్రయించినట్లు ఈ షుగర్ సంస్థ ప్రకటించింది. త్రివేణి టర్బైన్ ప్రమోటర్లలో ఒకరైన రతి సాహ్నీ, సింగపూర్, అబుదాబికి చెందిన సావరిన్ వెల్త్ ఫండ్‌లు, కొన్ని దేశీయ మ్యూచువల్ ఫండ్లు, కొంతమంది సంస్థాగత పెట్టుబడిదారులు ఈ షేర్లను కొన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన సంవత్సరానికి 8.3 శాతం కూపన్ రేటుతో బాసెల్ III కంప్లైంట్ అడిషనల్ టైర్-1 బాండ్లను జారీ చేసి రూ.658 కోట్లు సేకరించినట్లు ఈ ప్రభుత్వ రంగ రుణదాత వెల్లడించింది.
అశోక బిల్డ్‌కాన్: సౌత్ వెస్ట్రన్ రైల్వే నుంచి రూ.256 కోట్ల విలువైన కొత్త BG లైన్ కోసం కాంట్రాక్టు దక్కించుకుంది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (EPC) మోడ్‌లో ఎలక్ట్రికల్ & టెలికమ్యూనికేషన్ పనులను ఈ ప్రాజెక్టులో భాగంగా చేయాలి.
స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్: హైదరాబాద్‌కు చెందిన ఈ మైక్రో ఫైనాన్స్ లెండర్, ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన రూ.25 కోట్ల విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేయాలని నిర్ణయించింది.
దొడ్ల డెయిరీ: ఈ కంపెనీలో వాటాలున్న TPG దొడ్ల డైరీ హోల్డింగ్స్, సునీల్ రెడ్డి దొడ్ల విడివిడిగా దాదాపు 20.25 లక్షల ఈక్విటీ షేర్లు లేదా 3.39 శాతం వాటాను బహిరంగ మార్కెట్ వాదేవీల ద్వారా అమ్మేశారు. ఒక్కో షేరును సగటున రూ.525 ధరకు, మొత్తం రూ.106.38 కోట్ల షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.