Stocks to watch today, 13 September 2022: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 92.5 పాయింట్లు లేదా 0.25 శాతం గ్రీన్‌‌లో 18,034 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS): గూగుల్‌ క్లౌడ్‌లో కొత్త ఆపరేషన్స్‌ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడానికి, అమెరికాకు చెందిన సీ & ఎస్‌ హోల్‌సేల్ గ్రోసర్స్ ఇంక్ ‍(C&S Wholesale Grocers Inc) టీసీఎస్‌ను ఎంపిక చేసుకుంది. అమెరికాలో, సప్లై చైన్ సొల్యూషన్స్ & హోల్‌సేల్ కిరాణా సరుకుల సరఫరాలో సీ & ఎస్‌ హోల్‌సేల్ గ్రోసర్స్‌ది మేజర్‌ రోల్‌.


యాక్సిస్ బ్యాంక్: కో బ్రాండెడ్ హోమ్ బయ్యర్ల ఎకో సిస్టమ్‌ను ప్రారంభించేందుకు, రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్ అయిన స్క్వేర్ యార్డ్స్‌తో ఈ ప్రైవేట్‌ బ్యాంక్‌ టై అప్‌ ప్రకటించింది. 'ఓపెన్ డోర్స్' ప్లాట్‌ఫామ్‌ ద్వారా.. ఇళ్ల కోసం సెర్చ్‌ మొదలు, కొనుగోలు చేయడం వరకు సులభంగా పూర్తయ్యేలా పూర్తి స్థాయి సేవలను అందిస్తారు.


జేఎస్‌డబ్ల్యూ స్టీల్: ఈ ఏడాది ఆగస్టులో, ఈ ఉక్కు కంపెనీ ముడి ఉక్కు ఉత్పత్తి 22 శాతం పెరిగి 16.76 లక్షల టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే నెలలో 13.77 లక్షల టన్నులను ఉత్పత్తి చేసింది.


టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్: టాటా గ్రూప్‌నకు చెందిన ఈ FMCG మేజర్, మొక్కల నుంచి రూపొందించిన (ప్లాంట్ బేస్డ్) ప్రొటీన్ పౌడర్‌ను ప్రారంభించడం ద్వారా హెల్త్ సప్లిమెంట్స్ విభాగంలోకి ప్రవేశించింది. ఈ ఉత్పత్తి పేరు టాటా గోఫిట్‌ (Tata GoFit). మహిళల కోసం దీనిని తీసుకొచ్చారు.


హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ: యూకేకి చెందిన Abrdn కంపెనీ, తన దగ్గర ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్‌ షేర్లలో 4.3 కోట్ల షేర్లు లేదా 2 శాతం వాటాను బ్లాక్‌ డీల్‌ ద్వారా అమ్మాలని చూస్తోంది. ఈ డీల్ ద్వారా రూ.2,425 కోట్లకు పైగా సమీకరించాలని యోచిస్తోంది. షేర్లను రూ.564.1 నుంచి రూ.578.55 రేంజ్‌లో ఆఫర్‌ చేస్తోంది. ఈ స్క్రిప్ సోమవారం నాటి ముగింపుతో పోలిస్తే ఇది 2.5 శాతం వరకు తగ్గింపు.


ఆర్‌బీఎల్ బ్యాంక్: దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఈ బ్యాంక్‌ మీద ప్రతికూల దృక్పథాన్ని తొలగించింది. స్టేబుల్‌ ఔట్‌లుక్‌తో రేటింగ్‌ను AA- వద్ద ధృవీకరించింది.


హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్: ఈ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ, నొయిడా క్యాంపస్‌ను 450 సీట్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ ఏడాది జులైలోనూ, బెంగుళూరులో 1,600 సీట్ల కెపాసిటీ ఉన్న భవనాన్ని కొత్త ఆఫీస్ స్పేస్ కోసం హ్యాపీయెస్ట్ మైండ్స్ కొనుగోలు చేసింది.


ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: మాతృ సంస్థతో విలీనానికి ముందు, రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఒక్కో షేరుకు రూ.21.93 ఫ్లోర్ ప్రైస్‌తో QIPని ఈ ప్రైవేట్ రంగ రుణదాత ప్రారంభించింది. రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు (QIP) షేర్లను జారీ చేయడం ద్వారా రూ.600 కోట్ల వరకు సమీకరించనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ బ్యాంక్‌ ప్రకటించింది.


కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్: స్పాన్వ్ మెడిసెర్చ్ లైఫ్‌సైన్సెస్‌లో (కింగ్స్‌వే హాస్పిటల్స్) 51 శాతం ఈక్విటీ వాటాను ఈ హాస్పిటల్‌ చైన్‌ కొనుగోలు చేసింది.


ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్: అశ్వనీ ఘాయ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మాతృ సంస్థ LICలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఘాయ్ ఇంతకుముందు పనిచేశారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.