Stock Market Weekly Review: అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మందగనంలో ఉన్నాయి. ద్రవ్యోల్బణం భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి. ఫలితంగా అన్ని దేశాల ఈక్విటీ మార్కెట్లు కుదేలవుతున్నాయి. మన సూచీలూ ఇందుకు భిన్నమేమీ కాదు! గతంతో పోలిస్తే విపరీతంగా స్పందించడం లేదు గానీ నష్టాలైతే పెరుగుతున్నాయి. జూన్ 6తో మొదలైన వారంలోనూ సూచీలు బాగానే కుంగిపోయాయి.


సెన్సెక్స్‌ 2000 పతనం


ఈ వారంలో మార్కెట్లు ఐదు రోజులు పనిచేస్తే నాలుగు సెషన్లు నష్టాల్లోనే ముగిశాయి. గురువారం మాత్రం ఫర్వాలేదు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 6న 55,507 వద్ద మొదలైంది. 56,432 వద్ద వారంతపు గరిష్ఠాన్ని అందుకుంది. 54,205 వద్ద కనిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరికి 1.06 శాతం నష్టపోయి 54,303 వద్ద ముగిసింది. ఓపెనింగ్‌, క్లోజింగ్‌తో పోలిస్తే  దాదాపుగా 1204 పాయింట్లు పతనమైంది. ఈ లెక్కన మదుపర్లు రూ.6 లక్షల కోట్లు నష్టపోయారు. అదే గరిష్ఠ స్థాయితో పోలిస్తే సూచీ ఏకంగా 2129 పాయింట్లు కుంగింది. ఇన్వెస్టర్ల సంపద సుమారుగా రూ.10 లక్షల కోట్ల వరకు ఆవిరైంది.


నిఫ్టీ 400 డౌన్‌


నిఫ్టీ 50 అయితే సెన్సెక్స్‌ కన్నా ఎక్కువే పతనమైంది. జూన్‌ 6న 16,541 వద్ద నిఫ్టీ మొదలైంది. 16,610 వద్ద వారంతపు గరిష్ఠాన్ని అందుకుంది. 16,172 వద్ద కనిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరికి 16,201 వద్ద ముగిసింది. మొత్తంగా 2.31 శాతం అంటే 340 పాయింట్లు నష్టపోయింది. అదే గరిష్ఠ స్థాయిలో చూసుకుంటే 409 పాయింట్లు తగ్గింది. అంతకు ముందు మూడు వారాలు నిఫ్టీ లాభాల్లోనే ముగియడం గమనార్హం.


ద్రవ్యోల్బణంతో ఆందోళన


కొన్ని ప్రత్యేక కారణాలు స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష వల్ల రెండు రోజులు మార్కెట్లు అప్రమత్తంగా రేంజ్‌బౌండ్‌లోనే కదలాడాయి. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ విధాన వడ్డీరేట్లు పెంచినా మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ జోరుకు అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు కళ్లెం వేశాయి. అగ్రరాజ్యం ద్రవ్యోల్బణం గణాంకాలు 40 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవడంతో డో జోన్స్‌, నాస్‌డాక్‌ వంటి సూచీలు సెల్లింగ్‌ ప్రెజర్‌కు లోనయ్యాయి. దాంతో ఆసియా మార్కెట్లు, ఫలితంగా భారత సూచీలు పతనమయ్యాయి. పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరలూ ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. వచ్చే వారమూ సూచీలు అప్రమత్తంగానే కదలాడొచ్చని నిపుణులు చెబుతున్నారు.


Also Read: సెన్సెక్స్‌ బిగ్ క్రాష్‌కు 5 కీలక కారణాలు ఇవే!!