Sensex Crash: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మందకొడిగా సాగుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లు (Equity Markets) వరుసగా పతనం అవుతున్నాయి. లక్షల కోట్ల సంపద గంటల వ్యవధిలో ఆవిరవుతోంది. మొదట కరోనా, ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పెట్టుబడిదారులను భయపెడుతోంది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రోజూ క్రాష్ అవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే సెన్సెక్స్ 1016 పాయింట్లు పతనమవ్వడంతో ఇన్వెస్టర్లు (Investors) ఏకంగా రూ.4 లక్షల కోట్ల సంపదను పోగొట్టుకున్నారు. ఈ క్రాష్‌కు ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.
యూఎస్‌లో ద్రవ్యోల్బణం
అగ్రరాజ్యం అమెరికాను ద్రవ్యోల్బణం లెక్కలు కలవరపెడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను వణికిస్తున్నాయి. 40 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం చేరడంతో ఫెడరల్ రిజర్వు ద్రవ్య పరపతి విధానాలను కఠినతరం చేస్తోంది. కరోనాతో సరఫరా అంతరాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల డిమాండ్ పెరగడంతో వస్తువులు, సేవల ధరలు కొండెక్కాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
పడిపోతున్న రూపాయి
రూపాయి విలువ నానాటికీ పడిపోతోంది. శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి తాజా కనిష్ఠమైన రూ.77.82కు చేరుకుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీ విలువ పతనం అవుతోంది. ఇది ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేస్తోంది. యూఎస్ ట్రెజరీ బాండ్ యీల్డులు పెరిగే అవకాశం ఉండటంతో డాలర్‌కు మరింత బలం రానుంది.
పెరిగిన క్రూడాయిల్
కొండెక్కుతున్న ముడి చమురు ధరలు భారత్ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రభావం మిగతా వస్తువులపైనా పడింది. కూరగాయాలు, రవాణా, ఇతర సేవల ధరలు ఎగిశాయి. దాంతో ద్రవ్యోల్బణం పెరిగింది. రాబోయే రోజుల్లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 140 డాలర్లకు చేరుతుందన్న వార్తలు భయపెడుతున్నాయి.
ఫారిన్ మనీ వెనక్కీ
ఇన్నాళ్లూ భారత మార్కెట్లలో ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. స్టాక్ మార్కెట్లలో డబ్బును పంప్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు దిగజారుతుండటంతో వారు డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. ఇప్పటికే రూ.1.62 లక్షల కోట్ల డబ్బును ఉపసంహరించారు. మున్ముందు ఇదే ట్రెండ్ కొనసాగనుంది.
టెక్నిల్ పరంగా
టెక్నికల్ పరంగానూ సూచీలు పతనం అవుతున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 16300- 16,260 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీకి ఇది కీలక స్థాయిగా మారింది. ఇక్కడ సూచీకి సపోర్ట్ దొరికే ఛాన్స్ ఉంది. ఒకవేళ సపోర్టును బ్రేక్ చేస్తే మరింత పడిపోవచ్చు.