Stock Market Weekly Review: ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు ఈ వారం మదుపర్లను కాస్త ఆనందపెట్టాయి. సోమవారం నష్టాలతో మొదలై వరుసగా మూడు రోజులు అదే ఒరవడి కొనసాగించాయి. ఆఖరి రెండు రోజులు లాభాల్లో ముగిసి వీకెండ్‌ను హ్యాపీగా ముగించాయి. బహుశా డౌన్‌ట్రెండ్‌ రివర్సల్‌ అవుతుందేమోనని చాలామంది అంచనా వేస్తున్నారు. ఇండియా విక్స్‌ ఇండెక్స్‌ సైతం కాస్త చల్లబడుతున్నట్టు కనిపిస్తుండటం శుభసూచకం! మరి 2022, మే 27తో ముగిసిన వీకెండ్‌ రివ్యూ చూసేద్దామా!


బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 3.96% అప్‌


ఏప్రిల్‌ 17 నుంచి మార్కెట్లు వరుసగా ఐదు వారాలు భారీ నష్టాలనే మిగిల్చాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) వరుసగా 1.86, 2.19, 0, 3.90, 3.72 శాతం నష్టపోయింది. మే 15తో మొదలైన వారంలో ఆఖరి రోజు హ్యాపీ చేసింది. తాజాగా ఈ వారం సెన్సెక్స్‌ 3.96 శాతం లాభపడి ఆనందంలో ముంచెత్తింది. మే 22న 52,946 వద్ద ఆరంభమైన సూచీ 54,946 వారాంతపు గరిష్ఠాన్ని అందుకుంది. 52,632 వద్ద కనిష్ఠాన్ని చేరుకుంది. చివరికి శుక్రవారం 54,884 వద్ద ముగిసింది. 1936 పాయింట్లు లాభపడింది. దీంతో ఇన్వెస్టర్లు దాదాపుగా రూ.10 లక్షల కోట్లమేర సంపద పోగేశారు.


ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కొంతే!


సెన్సెక్స్‌తో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty)లో కాస్త భిన్నమైన ధోరణి కనిపించింది. వరుసగా రెండు వారాలు లాభపడింది. ఏప్రిల్‌ 10 నుంచి వరుసగా 1.74, 1.74, 0.40, 4.04, 3.83 శాతం పతనమైన నిఫ్టీ మే 15, మే 22తో మొదలైన వారాల్లో వరుసగా 3.07, 0.53 శాతం ఎగిసింది. ఈ వారం నిఫ్టీ 16,291 వద్ద మొదలైంది. 15,907 వద్ద వారంతపు కనిష్ఠం 15,907 అందుకుంది. 16,291 వద్ద గరిష్ఠాన్ని చేరుకుంది. మొత్తంగా ఈ వారం 56 పాయింట్లే పెరిగింది. అందుకే సెన్సెక్స్‌తో పోలిస్తే తక్కువగా అనిపిస్తోంది. ప్రస్తుతానికి నిఫ్టీ 15,800 స్థాయిలో సపోర్ట్‌ తీసుకుంది. కొన్ని నెలలుగా సూచీ ఇదే స్థాయిలో సపోర్ట్‌ తీసుకుంటోంది.


ఇవీ కారణాలు!


స్టాక్‌ మార్కెట్లు ఈ వారం లాభపడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం భయాలతో తొలి మూడు రోజులు నష్టపోయినా వాటి నుంచి తేరుకుంటున్నట్టు కనిపిస్తోంది. మున్ముందు ఎకానమీ గ్రోత్‌రేట్‌ పెరుగుతుందని సమాచారం వెలువడుతోంది. చైనాలో కొవిడ్‌ తగ్గుతుండటంతో లాక్‌డౌన్లు ఎత్తేస్తున్నారు. ఫలితంగా సరఫరా అవాంతరాలు తొలగిపోతాయి. ఇక రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే గెలిచామని పుతిన్‌ ప్రకటించారు. పామాయిల్‌ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం ఎత్తేసింది. రష్యా, ఉక్రెయిన్‌ నుంచీ పొద్దుతిరుగుడు నూనె ఎగుమతులు పెరగనున్నాయి. బంగారం విలువ తగ్గింది. డాలర్‌ను కాదని అమెరికన్‌ ప్రజలు ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు మొగ్గు చూపుతుండటం సానుకూల సెంటిమెంటును పెంచింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.