Stock Market Close 17 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) వరుసగా ఆరో రోజు నష్టాల్లో ముగిశాయి. అమెరికా మాంద్యం వైపు పయనిస్తుండటం, ఫెడ్‌ వడ్డీరేట్లు పెంచడం, గ్లోబల్‌ ఎకానమీ మందకొడిగా ఉండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం భారీ నష్టాల పాలైన సూచీలు ఆఖర్లో తేరుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 67 పాయింట్ల నష్టంతో 15,293, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 135 పాయింట్ల నష్టంతో 51,360 వద్ద ముగిశాయి. ఆయిల్‌, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు 2 శాతం వరకు పతనమయ్యాయి. 


BSE Sensex


క్రితం సెషన్లో 51,495 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 51,181 వద్ద నష్టాల్లో మొదలైంది. 50,921 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 51,652 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఒకానొక సమయంలో 500 పాయింట్ల మేర పతనమైన సూచీ చివరికి 135 పాయింట్ల నష్టంతో 51,360 వద్ద ముగిసింది.


NSE Nifty


గురువారం 15,360 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 15,272 వద్ద ఓపెనైంది. 15,183 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,400 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 100 పాయింట్ల మేర నష్టపోయిన సూచీ చివరికి 67 పాయింట్ల నష్టంతో 15,293 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ముగిసింది. ఉదయం 32,393 వద్ద మొదలైంది. 32,290 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 32,889 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 125 పాయింట్ల లాభంతో 32,743 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 15 కంపెనీలు లాభాల్లో 35 నష్టాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కోల్‌ ఇండియా, జేఎస్‌ డబ్ల్యూ స్టీల్‌, రిలయన్స్‌ షేర్లు లాభపడ్డాయి. టైటాన్‌, విప్రో, శ్రీసెమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బీపీసీఎల్‌ నష్టపోయాయి. బ్యాంక్‌, మెటల్‌ సూచీలు స్వల్పంగా పెరిగాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయి్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 1-2 శాతం వరకు పతనం అయ్యాయి.