Stock Market News: అంబుజా సిమెంట్‌ (Ambuja Cement), ఏసీసీ ‍‌(ACC) కొనుగోలు ద్వారా సిమెంట్‌ రంగంలోకి అదానీ గ్రూప్‌ ప్రవేశం తర్వాత, ఈ రంగం మీద పెట్టుబడిదారులు ఆశాజనకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్య, చిన్న తరహా సిమెంట్‌ కంపెనీల షేర్లు సోమవారం పుంజుకున్నాయి, ఇవాళ కూడా అదే బాటలో ఉన్నాయి. అదానీ చేసిన ఈ జంట కొనుగోళ్ల వల్ల, ఈ సెక్టార్‌లో మరిన్ని మంచి డీల్స్‌ ఉండొచ్చని మార్కెట్‌లో ఆశలు రేకెత్తాయని ఎనలిస్ట్‌లు చెబుతున్నారు.


సోమవారం ట్రేడ్‌లో.. నువోకో విస్టాస్ (Nuvoco Vistas) షేర్లు 11 శాతం పెరిగి రూ.446.3కి చేరుకోగా, చెన్నైకి చెందిన ఇండియా సిమెంట్స్ ‍‌(India Cements) 9 శాతం లాభపడి రూ.289.9కి చేరుకుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్ల పెద్దగా పరిచయం లేని కేసోరామ్ ఇండస్ట్రీస్ (Kesoram Industries), మంగళం సిమెంట్ ‍‌(Mangalam Cement), సంఘి ఇండస్ట్రీస్ (Sanghi Industries), గుజరాత్ సిద్ధి సిమెంట్ (Gujarat Sidhee Cement) షేర్లు కూడా 5 శాతం పైగా పెరిగాయి. అంబుజా సిమెంట్ షేర్లు 9.3 శాతం లాభపడి రూ.564.9కి చేరాయి. మంగళవారం ట్రేడ్‌లోనూ ఇవన్నీ లాభాల్లో ఉన్నాయి.


శివ సిమెంట్‌ 70% జంప్‌
ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) చూస్తే, శివ సిమెంట్‌ (Shiva Cement) 70 శాతం పైగానే జంప్‌ చేసింది. అదానీ చేతికొచ్చిన అంబుజా సిమెంట్స్‌ 50 శాతం పెరిగింది. ఇండియా సిమెంట్స్‌ కూడా 50 శాతం పైనే జూమ్‌ అయింది. సంఘి ఇండస్ట్రీస్‌ 20 శాతం, స్టార్‌ సిమెంట్‌ ‍‌(Star Cement) 13 శాతం పెరిగాయి. నువోకో విస్టాస్, కేసోరామ్ ఇండస్ట్రీస్, సాగర్‌ సిమెంట్స్‌ ‍‌(Sagar Cements), ఓరియంట్‌ సిమెంట్‌ (Orient Cement) మైనస్‌లో కనిపిస్తున్నా, వాస్తవానికి అవి నష్టాలను పూడ్చుకునే బాటలో ఉన్నాయి.


వాల్యుయేషన్ల రీ రేటింగ్‌
పెద్ద కంపెనీలను కొనడం వల్ల స్థానిక, చిన్న ప్లేయర్లకు కూడా టైమ్‌ కలిసొచ్చిందని, వాల్యుయేషన్లలో రీ రేటింగ్‌ వచ్చిందని బ్రోకరేజ్‌ మోతీలాల్‌ ఓస్వాల్‌ చెబుతోంది. కొన్ని చిన్నపాటి కంపెనీలు వ్యాపారాలు చేయలేక కష్టాల్లో ఉన్నాయి. మంచి రేటు వస్తే అమ్మేసి సిమెంట్ వ్యాపారం నుంచి వెళ్లిపోదామని అలాంటి సంస్థలు ఎదురు చూస్తున్నాయి. లేదా, రెండు, మూడు కంపెనీలు కలిసిపోయి (మెర్జర్‌) ఒకటిగా వ్యాపారం చేద్దామన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.


ఇంటర్నేషనల్‌ సిమెంట్‌ జెయింట్‌ హోల్సిమ్‌ గ్రూప్‌ నుంచి అంబుజా సిమెంట్, ACCని $6.5 బిలియన్లకు అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. రాబోయే ఐదు సంవత్సరాల్లో 140 mtpa (మిలియన్‌ టన్స్‌ పర్‌ యానమ్‌) సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొత్త మేనేజ్‌మెంట్ ప్రకటించింది.


కరోనా తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌ కేటాయింపులు చేసింది. ప్రస్తుతం రుతుపవనాలు తిరోగమిస్తున్నాయి కాబట్టి నిర్మాణ పనులు ఊపందుకుంటాయి. ఇవన్నీ సిమెంట్‌ రంగానికి సానుకూల అంశాలు.


మెరుగైన ఔట్‌లుక్‌
ప్రస్తుత త్రైమాసికం (జులై-సెప్టెంబర్‌) నుంచి సిమెంట్‌ రంగం ఆదాయాలు పుంజుకుంటాయని ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు. రాబోయే నెలల్లో ఔట్‌లుక్ మెరుగుపడుతుందని చెబుతున్నారు.


తగ్గిన ఇంధన ధరల ప్రయోజనాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ త్రైమాసికంలో (అక్టోబర్‌-డిసెంబర్‌) సిమెంట్‌ రంగం అందుకుంటుందని; 2023 జనవరి-జూన్ త్రైమాసికంలో మెరుగైన సిమెంట్ డిమాండ్, ధరలు రెండింటినీ చూడవచ్చని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ ఎనలిస్ట్‌ కృపాల్ మణియార్ విశ్లేషించారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.