Liberty Shoes Shares: ఇవాళ్టి (బుధవారం) ఇంట్రా డే ట్రేడింగ్‌లో లిబర్టీ షూస్ (Liberty Shoes) షేర్లు హై జంప్‌ చేశాయి. నేషనల్ స్టాక్స్ ఎక్స్ఛేంజ్‌లో (NSE) 17 శాతం పైగా హై జంప్‌ చేశాయి, రూ.226.90కి చేరాయి. ఇది ఇంట్రా డే గరిష్టమే కాదు, నాలుగు సంవత్సరాల గరిష్ట స్థాయి కూడా. 2018 ఆగస్టు తర్వాత మళ్లీ అత్యధిక స్థాయిని ఈ షేరు టచ్‌ చేసింది.


బల్క్‌ డీల్‌
మధ్యాహ్నం 12:38 గంటల సమయానికి, నిఫ్టీ 50లో 0.70 శాతం క్షీణతతో పోలిస్తే ఈ స్టాక్ 15 శాతం పెరిగి రూ.222.15 వద్ద ట్రేడయింది. ఆ సమయానికి ఈ కౌంటర్‌లో దాదాపు 2.75 మిలియన్ల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి, ట్రేడింగ్ వాల్యూమ్స్  మూడు రెట్లు పెరిగాయి. ఇది, లిబర్టీ షూస్ మొత్తం ఈక్విటీలో 16 శాతానికి సమానం. అంటే, 16 శాతం షేర్లు ఇవాళ మార్కెట్‌లో చక్కర్లు కొట్టాయి. 


ఈ స్థాయిలో వాల్యూమ్స్‌ పెరిగాయంటే బల్క్‌ డీల్‌ (ఒకేసారి భారీ మొత్తం క్రయవిక్రయం) జరిగినట్లే. అయితే, అమ్మిందెవరో, వాటిని కొన్నదెవరో తెలీలేదు. సాయంత్రం మార్కెట్‌ తర్వాత క్రయవిక్రయదారుల పేర్లు బయటికొస్తాయి.


ఈ ఏడాది జూన్ 30 నాటికి, వ్యక్తిగత వాటాదారులకు లిబర్టీ షూస్‌లో 5.29 మిలియన్ షేర్లు లేదా 31.02 శాతం వాటా ఉన్నట్లు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ డేటాను బట్టి అర్ధం అవుతోంది. ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయిన జియోఫిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు (Geofin Investments Private Limited) ఈ కంపెనీలో 4.47 మిలియన్ షేర్లు లేదా 26.25 శాతం హోల్డింగ్ ఉందని డేటా చూపిస్తోంది.


గత మూడు నెలల్లో, నిఫ్టీ50లో 1 శాతం క్షీణతతో పోలిస్తే, ఇదే కాలంలో ఈ స్టాక్ 36 శాతం వృద్ధిని సాధించి మార్కెట్‌ను అధిగమించింది. గత ఆరు నెలల్లో, కనిష్ట స్థాయి నుంచి 70 శాతం పైగా జూమ్ అయింది. ఇదే కాలంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో 13 శాతం పెరుగుదల ఉంది.


పాజిటివ్స్‌
తయారీ రంగం మీద కేంద్ర ప్రభుత్వం ఫోకస్‌ పెంచడంతో, పాదరక్షల పరిశ్రమ భవిష్యత్తు వృద్ధి ఆశాజనకంగా ఉంది. ముఖ్యంగా, ఇప్పటికే ఎస్టాబ్లిష్‌ అయిన, ఆర్గనైజ్‌డ్‌ బ్రాండ్లకు కలిసొచ్చే సూచనలున్నాయి. ప్రజల ఆధునిక జీవన శైలి, కొనుగోలు అలవాట్లలో మార్పులు వంటివి కూడా పాదరక్షల పరిశ్రమను అంతెత్తునునిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.


జనాభావారీగా చూస్తే, యువత నుంచి స్పందన ఎక్కువగా ఉంది. క్యాజువల్, అథ్లెజర్, స్నీకర్స్, మహిళల పాదరక్షలకు యువజనం డిమాండ్‌ పెంచుతున్నారు.


నెగెటివ్స్‌
అయితే, అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, స్థూల మార్జిన్లను టచ్‌ చేస్తున్న GST, విదేశీ బ్రాండ్‌ల నుంచి పోటీ వంటి ప్రధాన ప్రతికూలతలు కూడా ఉన్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.