Reliance Power Shares: మీ దగ్గరున్న వస్తువును మార్కెట్‌ రేటు కంటే తక్కువకు అమ్ముతారా..? రిలయన్స్‌ పవర్‌ (Reliance Power) ఇదే పని చేసింది. దాదాపు 21 రూపాయల దగ్గరున్న షేరును 15 రూపాయలకు కేటాయించడానికి ఒప్పందం చేసుకుంది. ఈ ఎఫెక్ట్‌తో ఇవాళ్టి (శుక్రవారం) ట్రేడ్‌లో రిలయన్స్‌ పవర్‌ స్టాక్‌ 10 శాతం లేదా రూ.2.10 నష్టపోయింది, రూ.19.20 వద్ద లోయర్‌ సర్క్యూట్‌లో లాక్‌ అయింది.


మేజర్‌ ఇండెక్స్‌లు ఇవాళ మధ్యాహ్నం నుంచి కోలుకున్నా, ఈ స్టాక్‌ లోయర్‌ సర్క్యూట్‌ నుంచి బయట పడలేకపోయింది.


పెట్టుబడుల కంపెనీ వార్డే పార్ట్‌నర్స్‌కు (Varde Partners) అనుబంధంగా ఉన్న వీఎఫ్‌ఎస్‌ఐ హోల్డింగ్స్‌కు ‍‌(VFSI Holdings) ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా షేర్లను కేటాయించి, రూ.933 కోట్లు సమీకరించనున్నట్లు రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీ గురువారం తెలిపింది. ఈ కేటాయింపు తర్వాత, ఈ కంపెనీలో 15 శాతం వాటాను VFSI కైవసం చేసుకుంటుంది.


27 శాతం డిస్కౌంట్‌
రిలయన్స్ పవర్ షేర్ల ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ఒక్కో షేరుకు రూ.15.55 వద్ద జరుగుతుంది. ఇది కంపెనీ గురువారం ముగింపు ధర రూ.21.3 కంటే 27 శాతం తక్కువ. కంపెనీయే ఇంత తక్కువ వాల్యుయేషన్‌లో స్టాక్‌ను చూస్తున్నప్పుడు ఇన్వెస్టర్లు మాత్రం ఎందుకు ఊరుకుంటారు..?. ఒక్కసారిగా అమ్మకాలకు తెగబడి, రేటును నిట్టనిలువునా దించేస్తున్నారు.


వార్డే పార్ట్‌నర్స్ నుండి రూ.1,200 కోట్ల వరకు సమీకరించనున్నట్లు రిలయన్స్‌ పవర్‌ కొన్ని రోజుల క్రితం రిలయన్స్‌ పవర్‌ నుంచి ప్రకటన వచ్చింది. దానిలో భాగంగానే ఇప్పుడు రూ.933 కోట్లు సమీకరించనున్నారు.


రిలయన్స్‌ గ్రూప్‌లో రిలయన్స్‌ పవర్‌ ఒకటి. దీనికి, 5,945 మెగావాట్ల ఆపరేటింగ్ పోర్ట్‌ఫోలియో ఉంది. బొగ్గు, గ్యాస్, హైడ్రో, పునరుత్పాదక ఇంధనం ప్రాజెక్టులు దీని పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. ప్రైవేట్ రంగ పవర్ ప్రాజెక్ట్‌ల అతి పెద్ద పోర్ట్‌ఫోలియోల్లో ఈ కంపెనీ కూడా ఒకటి.


గత 5 రోజుల్లోనే ఈ స్టాక్‌ 12 శాతం పైగా పడిన ఈ షేరు ధర; గత నెల రోజుల్లో దాదాపు 36 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో 44 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) 35 శాతం పెరిగింది. 


తస్మాత్‌ జాగ్రత్త
కొన్ని రోజులుగా అనూహ్యంగా రాణిస్తున్న ఈ షేరు, గతంలో ఇన్వెస్టర్లను కట్టుబట్టలతో నడిబజార్లో నిలబెట్టింది. దాదాపు రూ.280 రేంజ్ నుంచి ఒక్క రూపాయికి పడిపోయింది. 


ఇప్పటికీ ఇది దివాలా ప్రక్రియలో కొట్టుమిట్టాడుతోంది. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (IiAS) నివేదిక ప్రకారం, మార్చి 31, 2022 నాటికి ఈ కంపెనీ రూ.3,561 కోట్ల రుణాలను కట్టకుండా ఎగ్గొట్టింది. ఇది అసలు లెక్క. వడ్డీ మరో రూ.1,783 కోట్ల వరకు ఉంటుంది. రిలయన్స్ పవర్‌కు అప్పులిచ్చిన కంపెనీల్లో యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉన్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.