Tanla Platforms share buyback: హైదరాబాద్‌కు చెందిన క్లౌడ్ కమ్యూనికేషన్స్ కంపెనీ తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ ‍(Tanla Platforms) షేరు ధర ఇవాళ (శుక్రవారం) కూడా 5 శాతం లేదా రూ.41.70  పెరిగి, రూ.875.90 దగ్గర అప్పర్‌ సర్క్యూట్‌లో లాక్‌ అయింది. ఈ షేర్లు గురువారం ట్రేడింగ్‌లోనూ ₹39.80 లేదా 5% చొప్పున పెరిగి ₹836.35 వద్ద అప్పర్‌ ఎసర్క్యూట్‌లో ఆగిపోయాయి. 


ఈ కంపెనీ బోర్డు, ₹170 కోట్లకు బైబ్యాక్ ప్రతిపాదనకు గురువారం ఆమోదం తెలిపింది. దీంతో వరుసగా రెండో రోజూ అప్పర్‌ సర్క్యూట్‌లో చిక్కుకుంది. 


ఒక్కొక్కటి రూ.1 ముఖ విలువను కలిగిన ఈక్విటీ షేర్లను ₹1,200 ఫ్లోర్‌ ప్రైస్‌తో తిరిగి కొంటామని (బైబ్యాక్‌) కంపెనీ వెల్లడించింది. బుధవారం ఈ షేర్లు ₹796.55 వద్ద ముగిశాయి. గురువారం బైబ్యాక్‌ నిర్ణయం వచ్చింది. బుధవారం రేటుతో పోలిస్తే, దాదాపు 45 శాతం ప్రీమియంతో షేర్లను కొంటామని కంపెనీ ప్రకటించింది. దీంతో తన్లా షేర్లలో భారీగా కొనుగోళ్ల సెంటిమెంట్ నెలకొంది. 


గురువారం నాటి ప్రస్తుత అప్పర్ సర్క్యూట్ ధరతో పోలిస్తే, బైబ్యాక్ ఫ్లోర్ ధర BSEలో 43.48%, NSEలో 43.49% ప్రీమియంతో సమానం. అంటే, ఇంత ఎక్కువ ధరకు ఈ షేర్లను కంపెనీ కొనబోతోంది.


66% ప్రీమియం


ఈ నెల 1 నాటి ముగింపుతో పోలిస్తే, NSEలో 66.39 %, BSEలో 66.27 % ప్రీమియంను బైబ్యాక్‌ ధర సూచిస్తోంది.


బైబ్యాక్‌ కోసం ₹170 కోట్లను కేటాయించారు. ఈ డబ్బుతో, ఒక్కో ఈక్విటీ షేరుకు ₹1,200 ఆఫర్ ధరతో, 14,16,666 ఈక్విటీ షేర్లను కొంటారు. ఇవి, మొత్తం కంపెనీ వాటాలో 1.04 శాతానికి సమానం. 


టెండర్ రూట్‌


"టెండర్ ఆఫర్" రూట్‌ ద్వారా, దామాషా ప్రాతిపదికన షేర్లను కంపెనీ కొంటుంది. రికార్డ్‌ డేట్‌ను త్వరలో ప్రకటిస్తుంది.


ఈ నెల 2 నాటికి, తాన్లాలో, ప్రమోటర్ & ప్రమోటర్ గ్రూప్‌నకు 5,93,70,282 ఈక్విటీ షేర్లు లేదా 43.73% వాటా ఉంది. ప్రమోటర్లు కాకుండా, విదేశీ పెట్టుబడిదారులకు (ప్రవాస భారతీయులు, ఎఫ్‌ఐఐలు, విదేశీ మ్యూచువల్ ఫండ్‌లు సహా) 1,98,79,728 ఈక్విటీ షేర్లు లేదా 14.64% వాటా ఉంది. బ్యాంకులు, ప్రమోట్ చేసే ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్లు 1,01,585 ఈక్విటీ షేర్లు లేదా 0.074% వాటాను కలిగి ఉన్నాయి. ఇతర పెట్టుబడిదారులు (పబ్లిక్, పబ్లిక్ బాడీస్ కార్పొరేట్ మొదలైనవి) 5,63,93,928 ఈక్విటీ షేర్లను లేదా 41.54% వాటను ఈ కంపెనీలో కలిగి ఉన్నారు.


బైబ్యాక్ తర్వాత, ప్రస్తుత ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో ప్రమోటర్ & ప్రమోటర్ గ్రూప్ వాటా 44.20% కు పెరుగుతుంది. మిగిలిన వాళ్లందరి వీటా 55.80% కు తగ్గుతుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.