Vodafone Idea Shares: వొడాఫోన్ ఐడియా ( Vodafone Idea - VIL) షేర్లు ఇవాళ్టి (శుక్రవారం) ట్రేడింగ్‌లో 2 శాతం పైగా పెరిగి, రూ.10.02 వద్ద ఇంట్రాడే గరిష్టనికి చేరుకున్నాయి.
కంపెనీ షేరు ధర రూ.10 లేదా అంతకంటే పైన స్థిరపడిన తర్వాత, ఈ టెలికాం సంస్థలో వాటాను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మీడియాలో వచ్చిన కథనాలతో ఈ కౌంటర్‌లో బజ్ పెరిగింది.
మీడియా కథనాల ప్రకారం, VIL బోర్డు, ఒక్కో షేరును రూ.10 చొప్పున ప్రభుత్వానికి వాటాను ఆఫర్ చేసింది. వొడాఫోన్ ఐడియాలో వాటా కొనుగోలు ప్రతిపాదనకు, ఈ ఏడాది జులైలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
అయితే, ఇక్కడో చిన్న చిక్కు వచ్చిపడింది. సాధారణ విలువ (పార్ వాల్యూ) వద్ద కొనుగోలు జరగాలన్న సెబీ నిబంధన ఈ డీల్‌కు అడ్డు తగిలింది. ప్రస్తుతం, రూ.10 కంటే తక్కువలో వొడాఫోన్ ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో, షేరు ధర రూ.10 దాటి స్థిరపడిన తర్వాతే, ఆ కంపెనీలో వాటా కొనాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. అప్పుడు సెబీ నిబంధనతో ఇబ్బంది ఉండదు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తుంది.
టెలికాం సంస్కరణల ప్యాకేజీలో భాగంగా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను ఈక్విటీల రూపంలో ఇచ్చే మార్గాన్ని వొడాఫోన్ ఐడిగా గతంలో ఎంచుకుంది. రుణాన్ని ఈక్విటీలుగా మారిస్తే, కేంద్ర ప్రభుత్వానికి ఈ కంపెనీలో దాదాపు 33 శాతం వాటా వస్తుంది. ఈ టెల్కో ప్రమోటర్లయిన వొడాఫోన్ Plc (యూకే), మన దేశానికి చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు (ABG) కలిపి ఈ కంపెనీలో 50 శాతం ఉంటుంది. మిగిలిన షేర్లను పబ్లిక్ దగ్గర ఉంటాయి.
ఏప్రిల్ 19 నుంచి డౌనే!
VIL షేర్లు ఏప్రిల్ 19 నుంచి రూ.10 కంటే తక్కువ ధరలో ట్రేడ్ అవుతున్నాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో పాజిటివ్‌గా ఓపెన్ అయిన వొడాఫోన్ షేర్లు, మధ్యాహ్నం 12.10 గంటల సమయానికి ఆరంభ లాభాన్ని కోల్పోయింది. ఇంట్రాడే గరిష్టం రూ.10.02 నుంచి తగ్గుతూ, ఆ సమయానికి రూ.9.69 వద్దకు చేరింది. ఇది నిన్నటి క్లోజింగ్ మార్క్.
ఈ స్టాక్ గత నెల రోజుల్లో 12 శాతానికి పైగా పెరగ్గా, గత ఆరు నెలల్లో దాదాపు 6 శాతం వరకు నష్టపోయింది.
Q4FY22లో వచ్చిన నష్టం రూ. 6,563.1 కోట్లను, ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో ఇంకా పెంచుకుందీ సంస్థ. Q1FY23లో రూ. 7,296.7 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.