PAN-Aadhaar link: భారత స్టాక్ మార్కెట్లలోకి కొత్తతరం పెట్టుబడిదారులు అడుగుపెట్టిన తర్వాత రిటైల్ ఇన్వెస్టర్ల హవా పెరిగింది. దీనికి తోడు రిస్క్ తీసుకోవటం ఇష్టం లేనివారు తమ డబ్బును అధికంగా మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లిస్తున్నారు. మార్కెట్ల అస్థిరతల వల్ల ప్రభావం ఉన్నప్పటికీ అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు వాటిని నిర్వహిస్తారు కాబట్టి చాలా మంది పెట్టుబడిదారులు తమ డబ్బును వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్‌లో పార్క్ చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించిన కీలక ప్రకటన సెబీ చేయటం కొంత ఉపశమనం కలిగిస్తోంది.


KYC నాన్-కాంప్లైంట్ సమస్య 
ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు సెబీ నిర్ణయంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. వాస్తవానికి అక్టోబర్ 2023లో సెబీ ప్రకటించిన కేవైసీ రూల్స్ ప్రకారం కొందరు ఇన్వెస్టర్లు పాన్-ఆధార్‌ను లింక్ చేయనందున KYC నాన్-కాంప్లైంట్ సమస్యతో పోరాడుతున్నారు. మార్చి 31, 2024 నాటికి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు ఆధార్-పాన్ లింక్ చేయటం తప్పనిసరని గతంలో వెల్లడించిన సెబీ తాజాగా తన చర్యను ఉపసంహరించుకుంది. ప్రస్తుతానికి పెట్టుబడిదారులు అదనపు పత్రాలను సమర్పించకుండా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.


అడ్రస్ ప్రూఫ్‌గా బ్యాంక్ పాస్‌బుక్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్ 
మ్యూచువల్ ఫండ్ లావాదేవీల కోసం 'KYC రిజిస్టర్డ్' స్థితిని పొందేందుకు పెట్టుబడిదారులు పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయవలసిన అవసరాన్ని ప్రస్తుతానికి తొలగిస్తున్నట్లు మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ మే 14న విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. అయితే 'KYC వ్యాలిడేటెడ్' స్థితి కోసం పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయవలసి ఉంటుందని గమనించాలి. సెబీ అక్టోబర్ 2023 సర్క్యులర్ ప్రకారం ఎవరైనా ఇన్వెస్టర్ తమ ఆధార్-పాన్ లింక్ చేయటంలో విఫలమైతే అది కేవైసీ ప్రక్రియను నిలిపివేస్తుందని దీంతో పెట్టుబడి కార్యకలాపాలు నిలిచిపోతాయని పేర్కొంది. ఆ సమయంలో అడ్రస్ ప్రూఫ్‌గా బ్యాంక్ పాస్‌బుక్ లేదా ఖాతా స్టేట్‌మెంట్ ఉపయోగించి కూడా KYC చేయవచ్చని వెల్లడించింది.


అకౌంట్ స్థితి 'ఆన్-హోల్డ్' కలిగిన మ్యూచువల్ ఫండ్ చందాదారులు యూనిట్లను విక్రయించడానికి లేదా కొనుగోలు చేయడానికి అనుమతించరు. ఇదే సమయంలో ఎన్‌ఆర్‌ఐ పెట్టుబడిదారులు ఆధార్‌ను పొందాల్సిన అవసరం లేనందున సెబీ ఆదేశాల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యారు. మే 14న సెబీ సవరించిన సర్క్యులర్‌లో పెట్టుబడిదారులు తమ కేవైసీని పూర్తి చేయడానికి పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను ఉపయోగించవచ్చని పేర్కొంది.


పాన్, పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడి వివరాలను ఉపయోగించి మ్యూచువల్ ఫండ్ యూనిట్-హోల్డర్ల KYCని ధృవీకరించాలని రెగ్యులేటర్ సెబీ కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీలను అభ్యర్థించింది. వాస్తవానికి పాన్-ఆధార్ వివరాల ఆధారంగా ఆదాయపు పన్ను వంటి అధికారిక డేటాబేస్‌లతో పెట్టుబడిదారుల వివరాలను క్రాస్-చెక్ చేయడం లక్ష్యంగా ఉంది.