SIP Penalty: స్టాక్ మార్కెట్‌పై ప్రజల ఆసక్తి ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దానికి తగ్గట్లుగా మ్యూచువల్ ఫండ్స్‌లో (Mutual Funds) పెట్టుబడులు నెలనెలా పెరుగుతూనే ఉన్నాయి. వరదలా వచ్చి పడుతున్న డబ్బు కారణంగా, ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
మ్యూచువల్ ఫండ్స్‌లో రెండు విధాలుగా పెట్టుబడి పెట్టొచ్చు. ఏకమొత్తంగా జమ చేయడం ఒక పద్ధతి. ఈ విధానంలో, పెట్టుబడిదార్లు తమకు అనుకూలమైన/ నచ్చిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఒకేసారి డబ్బును పెట్టుబడిగా పెడతారు, నిర్ణీత కాల వ్యవధి వరకు అందులోనే కొనసాగిస్తారు. అయితే, ఈ పద్ధతి అందరికీ అనుకూలం కాదు. ముఖ్యంగా, రిటైల్ ఇన్వెస్టర్లు ఒకేసారి ఎక్కువ డబ్బు తీసుకురాలేరు. అందుకే, చిన్న పెట్టుబడిదార్ల కోసం SIP విధానాన్ని తీసుకొచ్చారు.
SIP అంటే ఏంటి?
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న రెండో మరొక మార్గం 'సిప్'. SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ((Systematic Investment Plan). ఈ విధానంలో, ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో పెట్టుబడి పెట్టొచ్చు. దీనివల్ల చిన్న మొత్తాల్లో జమ చేయడానికి వీలవుతుంది. అంతేకాదు, ఒక్కో ఇన్‌స్టాల్‌మెంట్ మధ్య విరామాన్ని కూడా సౌలభ్యాన్ని బట్టి ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, ప్రతి నెలా లేదా ప్రతి మూడు నెలలకోసారి SIP ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు.
మ్యూచువల్ ఫండ్‌లోకి వచ్చే పెట్టుబడుల్లో SIP అత్యంత ప్రజాదరణ పొందింది. సౌలభ్యం కారణంగా.. రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు పెద్ద పెట్టుబడిదార్లు కూడా SIP రూట్ ఎంచుకుంటారు. సాధారణంగా, SIP వాయిదాల చెల్లింపు కోసం ఆటో డెబిట్‌ను ఆప్షన్‌ను ఇన్వెస్టర్లు సెట్ చేస్తారు. దీనివల్ల, గడువు తేదీలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతి నెలా నిర్ణీత తేదీన బ్యాంక్ ఖాతా నుంచి నిర్ణీత మొత్తం మ్యూచువల్ పథకంలోకి ఆటోమేటిక్‌గా జమ అవుతుంది.
SIP కోసం ఆటోడెబిట్ పెట్టుకుంటే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఇన్‌స్టాల్‌మెంట్ కట్టాల్సిన సమయానికి మీ బ్యాంక్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే ఆటో డెబిట్ బౌన్స్ అవుతుంది. చెల్లించాల్సిన ఇన్‌స్టాల్‌మెంట్ బౌన్స్ అయితే రూ.100 నుంచి రూ.750 వరకు జరిమానా కట్టాల్సి రావచ్చు.
పెనాల్టీని తప్పించుకునే మార్గాలు
పెనాల్టీ బారిన పడకుండా ఉండడానికి ఆటో డెబిట్‌కు బదులుగా మాన్యువల్‌గా వాయిదా మొత్తం చెల్లించే పద్ధతిలోకి మారొచ్చు. సాధారణంగా, మాన్యువల్ విధానంలో SIP వాయిదా బౌన్స్ అయినా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు జరిమానా విధించవు. ఇన్‌స్టాల్‌మెంట్ కట్టడానికి 3 నెలల వరకు సమయం (గ్రేస్ పిరియడ్) లభిస్తుంది. SIPని పాజ్ చేయడం మరొక మార్గం. ఈ విషయంలో వివిధ మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో వివిధ నిబంధనలు ఉన్నాయి. జనరల్‌గా, SIPని 6 నెలల పాటు పాజ్ చేయడానికి మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అనుమతిస్తాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: మీ సంపద పెంచే సెవెన్ వండర్స్- ఎక్కువ మందికి అచ్చొచ్చాయట!