మే తొలివారంలో స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవ్వడంతో టాప్-10 కంపెనీల మార్కెట్ విలువ చాలా వరకు తగ్గింది. అన్నీ కలిపి ఏకంగా రూ.2,85,251 కోట్లు నష్టపోయాయి. అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఈ సెగ తాకింది.
దేశంలో రూ.19 లక్షల కోట్ల మార్కెట్ విలువను అందుకున్న తొలి కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు సృష్టించింది. ఇదే ఊపులో షేరు ధర పైపైకి ఎగబాకింది. ఆర్బీఐ రెపో రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోగానే మార్కెట్లు పతనమయ్యాయి. దాంతో రూ.1,14,767 కోట్లు నష్టపోయిన ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.17,73,196 కోట్లకు చేరుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ విలువ రూ.42,847 కోట్లు తగ్గి రూ.12,56,152 కోట్లకు పరిమితమైంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.36,984 కోట్లమేర మార్కెట్ విలువ కోల్పోయింది. రూ.7,31,068 కోట్లకు చేరుకుంది. హిందుస్థాన్ యునీలివర్ రూ.20,558 కోట్లు నష్టపోయింది. దాంతో HUL మార్కెట్ విలువ రూ.5,05,068కి తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంకు రూ.16,625 కోట్లు నష్టపోవడంతో మార్కెట్ విలువ రూ.5,00,136 కోట్లకు తగ్గిపోయింది. భారతీ ఎయిర్‌టెల్ రూ.16,091 కోట్లు తగ్గి రూ.3,90,153 కోట్ల వద్ద ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ విలువ రూ.13,924 కోట్లు తగ్గి రూ.3,90,045 కోట్లకు చేరుకుంది. భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) తన మార్కెట్ విలువలో రూ.10,843 కోట్లు నష్టపోయింది. ప్రస్తుతం రూ.4,32,263 కోట్ల వద్ద ఉంది. ఇన్ఫోసిస్ రూ.10,285 కోట్లు నష్టపోయి రూ.6,49,302 కోట్ల వద్ద స్థిరపడింది. అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.2,322 కోట్లు నష్టపోవడంతో మార్కెట్ విలువ రూ.4,49,255 కోట్లుగా ఉంది.
మార్కెట్ విలువ ప్రకారం చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యునీలివర్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ గ్రీన్ ఎనర్జీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
4 శాతం పతనం
మార్కెట్లు మే తొలి వారంలో కేవలం నాలుగు రోజులే పనిచేశాయి. అందులో మూడు రోజులు భారీగా నష్టపోయాయి. ఒక రోజు లాభపడ్డా ఆరంభ లాభాలు ఆఖర్లో ఆవిరయ్యాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ మే 2న 56,429 వద్ద ఓపెనైంది. 57,166 వద్ద గరిష్ఠ స్థాయిని అందుకుంది. ఆర్బీఐ గవర్నర్ రెపో రేటు పెంచుతామని చెప్పడంతో 54,590 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి మే6న 54,835 వద్ద ముగిసింది. అంటే దాదాపుగా 4 శాతం పతనమైంది. అంతకు ముందు వారం ముగింపుతో పోలిస్తే దాదాపుగా 3000 పాయింట్లు తగ్గింది. దీంతో ఇన్వెస్టర్లు రూ.12 లక్షల కోట్ల వరకు నష్టపోయారు.
2 వారాల్లో 8 శాతం నష్టం
ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈ వారంలో 16,937 వద్ద మొదలైంది. 17,129 వద్ద వారాంతపు గరిష్ఠ స్థాయిని అందుకుంది. ఆ తర్వాత 16,342 వద్ద వారాంతపు కనిష్ఠ స్థాయికి పతనమై 16,411 వద్ద ముగిసింది. మే తొలి వారంలో 4 శాతం పతనమైంది. చివరి నాలుగు వారాల్లో కలిసి 8 శాతం వరకు నష్టపోయింది.