Stock Market Weekly Review: ప్రస్తుతం భారత స్టాక్‌ మార్కెట్లు అత్యంత ఒడుదొడులకు లోనవుతున్నాయి. ఎకాఎకిన పతనం అవుతున్నాయి. ఒక్కోసారి హఠాత్తుగా లాభాల్లోకి వస్తున్నారు. మరికొన్ని సార్లు ఆరంభ లాభాలు సాయంత్రానికి ఆవిరైపోతున్నాయి. 2022, మే ఒకటో వారం ఇన్వెస్టర్లను భయభ్రాంతులకు గురి చేసింది. షేర్లు కొనుగోలు చేద్దామా లేదా అన్న గందరగోళానికి గురి చేశాయి. ఈ వారంలో మార్కెట్లు పనిచేసింది కేవలం 4 రోజులే అయినా మదుపర్లు ఏకంగా రూ.12 లక్షల కోట్ల సంపదను నష్టపోయారు.


కారణాలు ఏంటి?


ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు నష్టపోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది పెరుగుతున్న ద్రవ్యోల్బణం. కొన్నేళ్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిత్యావసర సరుకులు సహా అన్నింటి ధరలను చూసి భయపడుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం అనేక నష్టాలకు దారి తీసింది. మొదట ముడి చమురు ధరలు కొండెక్కాయి. ఒక బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 100 నుంచి 130 డాలర్ల మధ్య  కదలాడుతోంది. ఫలితంగా పెట్రోలు, డీజిల్‌ రేట్లు విపరీతంగా పెరిగాయి. దాంతో ముడి వనరుల ధరలూ ప్రభావితం అయ్యాయి.


పొద్దు తిరుగుడు ముడి నూనె సరఫరా కొరతతో వంట నూనె ధరలు ఆకాశాన్ని అంటాయి. మార్కెట్లో ఐదు లీటర్ల డబ్బాలు కనిపించడమే లేదు. మున్ముందు మరింత పెరుగుతాయని కస్టమర్లు ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారు. కంపెనీల త్రైమాసిక ఫలితాలూ ఆశాజనకంగా లేవు. మార్జిన్లు తగ్గిపోతున్నాయి. ఇవన్నీ ఎకానమీపై ప్రభావం చూపించాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లు పెంచడం, బాండ్‌ ఈల్డులు పెరుగుతాయన్న అంచనాలు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లను నష్టపోయేలా చేసింది.


4 శాతం పతనం


మార్కెట్లు మే తొలి వారంలో కేవలం నాలుగు రోజులే పనిచేశాయి. అందులో మూడు రోజులు భారీగా నష్టపోయాయి. ఒక రోజు లాభపడ్డా ఆరంభ లాభాలు ఆఖర్లో ఆవిరయ్యాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మే 2న 56,429 వద్ద ఓపెనైంది. 57,166 వద్ద గరిష్ఠ స్థాయిని అందుకుంది. ఆర్బీఐ గవర్నర్‌ రెపో రేటు పెంచుతామని చెప్పడంతో 54,590 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి మే6న 54,835 వద్ద ముగిసింది. అంటే దాదాపుగా 4 శాతం పతనమైంది. అంతకు ముందు వారం ముగింపుతో పోలిస్తే దాదాపుగా 3000 పాయింట్లు తగ్గింది. దీంతో ఇన్వెస్టర్లు రూ.12 లక్షల కోట్ల వరకు నష్టపోయారు.


2 వారాల్లో 8 శాతం నష్టం


ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈ వారంలో 16,937 వద్ద మొదలైంది. 17,129 వద్ద వారాంతపు గరిష్ఠ స్థాయిని అందుకుంది. ఆ తర్వాత 16,342 వద్ద వారాంతపు కనిష్ఠ స్థాయికి పతనమై 16,411 వద్ద ముగిసింది. మే తొలి వారంలో 4 శాతం పతనమైంది. చివరి నాలుగు వారాల్లో కలిసి 8 శాతం వరకు నష్టపోయింది.