Mutual Fund SIP: గత నాలుగు నెలలుగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లేదా సిప్ (SIP) ఫండ్స్ రైజింగ్‌లో ఉన్నాయి. SIP మార్గంలో పెట్టుబడి పెట్టేవాళ్లు నెలకు ₹12,000 కోట్లకు తగ్గకుండా డబ్బులు పంప్ చేస్తున్నారు. గత మే నెల నుంచి ఈ రేంజ్ తగ్గకుండా మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఆగస్టు నెలలో, SIP మార్గం ద్వారా వచ్చిన ఇన్ ఫ్లోస్ ఆల్ టైమ్ హై రూ.12,693 కోట్లను తాకినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI-ఆంఫి) తాజా డేటా ప్రకారం తెలుస్తోంది.
మే నుంచి ₹12,000 కోట్ల మార్క్
మే నెల నుంచి చూస్తే, SIP ద్వారా వచ్చే డబ్బు ₹12,000 కోట్ల మార్క్‌కు పైనే ఉన్నాయి. జులైలో రూ.12,140 కోట్లు, జూన్‌లో రూ.12,276 కోట్లు, మే నెలలో రూ.12,286 కోట్లుగా ఇన్ ఫ్లోస్ నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలో ఇది రూ.11,863 కోట్లుగా ఉంది, ₹12,000 మార్క్‌కు దగ్గరగా వచ్చింది.
దీంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో (ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) మొత్తం ఇన్ ఫ్లో రూ.61,258 కోట్లకు చేరుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.1.24 లక్షల కోట్లకు SIP డబ్బులు వచ్చాయి. ఈ మొత్తంలో దాదాపు సగం ఇప్పుడు 5 నెలల్లోనే వచ్చింది.
రిస్క్ వద్దని..
స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ రిస్క్ తీసుకోలేనివాళ్లు, ముఖ్యంగా ఉద్యోగులు (salaried people) SIP మార్గం వైపు మొగ్గు చూపుతున్నారు. వాళ్లు దీనిని పెట్టుబడిగా కాక, పొదుపుగా భావిస్తున్నారు.
SIPల నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) ఈ ఏడాది మార్చి చివరిలోని రూ.5.76 లక్షల కోట్ల నుంచి ఆగస్టు చివరి నాటికి రూ.6.4 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఐదేళ్లలో, SIP AUM సంవత్సరానికి 30 శాతం పెరిగింది. మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ మొత్తం ఆస్తుల్లో పెరుగుదలతో పోలిస్తే, SIP AUM రెట్టింపు పెరిగింది.
ప్రస్తుతం, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర దాదాపు 5.72 కోట్ల SIP ఖాతాలు ఉన్నాయి.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లేదా SIP అనేది, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉద్దేశించిన మార్గాల్లో ఒకటి. ఈ పద్ధతిలో, ఒక వ్యక్తి, తాను ఎంచుకున్న పథకంలో నిర్ణీత కాల వ్యవధిలో నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టవచ్చు. అంటే, ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టడానికి బదులుగా విడతల వారీగా (ఉదాహరణకు నెలకు కొంత మొత్తం) జమ చేస్తూ వెళ్లవచ్చు. SIP వాయిదా మొత్తం నెలకు కనీసం రూ.500 ఉంటుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు), 43 కంపెనీలున్న మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ, ఇన్ ఫ్లోస్ కోసం ప్రధానంగా కోసం SIPలపైనే ఆధారపడింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటివరకు రూ.64,935 కోట్లను (SIPలతో కలిపి) ఆకర్షించాయి. 2021-22లో మ్యూచువల్ ఫండ్స్ కూడగట్టింది రూ.1.64 లక్షల కోట్లు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.