LIC Share Price: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. ఇవాళ్టి (గురువారం) ఇంట్రా డే ట్రేడింగ్‌లో, దాదాపు 1 శాతం క్షీణించిన ఈ ప్రభుత్వ రంగ కంపెనీ షేరు రూ.648 వద్ద కొత్త కనిష్ట స్థాయిని తాకింది. ఈ ఏడాది జూన్ 20న తాకిన మునుపటి కనిష్టమైన రూ.650 కంటే ఇవాళ మరింత దిగువకు పడిపోయింది.
జీవితకాల కనిష్టం
LIC షేరు ఇష్యూ ధర రూ.949. ప్రస్తుతం ఈ ధర కంటే 32 శాతం దిగువన స్టాక్ ట్రేడవుతోంది. ఈ ఏడాది మే 17న మార్కెట్‌లోకి ఇది అడుగు పెట్టింది. అప్పట్నుంచి ఇదే కనిష్ట స్థాయి.
లిస్టింగ్ నాటి నుంచి LIC షేరు పనితీరు అస్సలు బాగోలేదు. ఎక్కువ మార్జిన్‌తో మార్కెట్‌లో అండర్‌పెర్ఫార్మ్ చేసింది. గత నెల రోజుల్లో, BSE సెన్సెక్స్‌లోని 0.41 శాతం పెరుగుదలతో పోలిస్తే, ఈ స్టాక్ 4 శాతం పడిపోయింది. గత మూడు నెలల కాలంలో, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లోని 14 శాతం ర్యాలీకి వ్యతిరేకంగా 3 శాతం క్షీణించింది.
గత ఆరు నెలల కాలంలో ఈ కౌంటర్ 26 శాతం నష్టపోగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) చూసినా దాదాపు ఇంతే శాతం క్షీణత కనిపిస్తుంది.
సంవత్సరానికి ప్రాతిపదికన, LIC ఆగస్టు 2022కి రిటైల్ వార్షిక ప్రీమియం సమానమైన (APE)లో 5.2 శాతం నెమ్మదిగా వృద్ధిని నమోదు చేసింది, ఇది ప్రైవేట్ రంగానికి 8.9 శాతంగా ఉంది; మూడు సంవత్సరాల CAGR ఆధారంగా. ఎల్‌ఐసి వృద్ధి 0.66 శాతం, ప్రైవేట్ రంగం కంటే 12.6 శాతం తక్కువగా ఉంది.
వ్యక్తిగతంగా చూస్తే, గత నెలలో LIC పనితీరు బాగున్నట్లు (రిటైల్ APE: 5 శాతం YoY; 3Y CAGR 0.7 శాతం) కనిపిస్తుంది. కానీ, ప్రత్యర్థులైన ప్రైవేట్ రంగ సంస్థలతో పోలిస్తే మాత్రం వృద్ధిలో వెనుకబాటు స్పష్టంగా కనిపిస్తుంది. గత 3 ఏళ్లలో, రిటైల్ మార్కెట్ షేరును ఇది నష్టపోయింది.
హోల్డ్ రేటింగ్
FY23లో, మొత్తం రిటైల్ APE వృద్ధి 12-13 శాతంగా (YoY) బ్రోకరేజ్ ఎంకే ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. ప్రైవేట్ రంగం 15-19 శాతం మధ్య వృద్ధి చెందవచ్చని లెక్కగట్టింది. LIC మాత్రం సింగిల్ డిజిట్ వృద్ధికే పరిమితం అవుతుందని ఊహిస్తోంది. ఈ నేపథ్యంలో LIC స్టాక్‌కు 'హోల్డ్' రేటింగ్ ఇచ్చింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.