D-Street Investor Wealth: ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు నేడు పరుగులు పెడుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1060, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 290 పాయింట్ల మేర ఎగిశాయి. ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్కరోజే రూ.4.5 లక్షల కోట్ల మేర ఆర్జించారు. బీఎస్‌ఈ నమోదిత కంపెనీల విలువ రూ.273.82 లక్షల కోట్లుగా ఉంది. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలకు చేరుకోవడం, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ఇంతలా ర్యాలీ చేయడానికి కారణాలు ఏంటంటే?


యూఎస్‌ సూచీల ర్యాలీ


అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. డేటా ఆందోళన కలిగిస్తున్నా యూఎస్‌ మార్కెట్లు గురువారం లాభపడటం ఆశ్చర్యం కలిగించింది. డో జోన్స్‌ 2.8 శాతం, నాస్‌డాక్‌ 2.2 శాతం వరకు ఎగిశాయి. ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌కు పాల్పడటం వంటి సాంకేతిక అంశాలే ఇందుకు కారణం. ఇన్‌ఫ్లేషన్‌ ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకున్నందున మున్ముందు తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. యూఎస్‌ ఎక్ఛేంజీల దన్నుతో టోక్యో బెంచ్‌ మార్క్‌ సూచీ నిక్కీ, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 3 శాతానికి పైగా ఎగిశాయి. భారత్‌ మార్కెట్ల ర్యాలీకి ఇదో కారణం.


తగ్గిన క్రూడ్‌


గత వారంతో పోలిస్తే బ్రెంట్‌, డబ్ల్యూటీఐ క్రూడాయిల్‌ ధరలు కాస్త చల్లబడ్డాయి. ఆర్థిక మాంద్యం భయాలతో రెండువారాల క్రితం పెరిగిన ముడి చమురు ధర 3 శాతం మేర తగ్గింది. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 95 డాలర్ల దిగువనే ఉంది.


చల్లబడ్డ డాలర్‌ ఇండెక్స్


క్రితం సెషన్‌తో పోలిస్తే డాలర్‌ ఇండెక్స్‌ 0.5 శాతం మేర తగ్గింది. యూఎస్‌ వినియోగ ధరల సమాచారాన్ని ఇన్వెస్టర్లు అర్థం చేసుకోవడమే ఇందుకు కారణం. భారత రూపాయి సైతం 3 పైసలు లాభపడి 82.21 వద్ద ఉంది.


టెక్నికల్‌ మార్పు


గురువారం వీక్లీ ఎక్స్‌పైరీ వల్ల నిఫ్టీ 17,000 వద్ద బేస్‌ ఏర్పాటు చేసుకుంటుందని అంచనా వేశారు. మార్కెట్లలో బలహీనత ఉండటమే ఇందుకు కారణం. గత మూడు రోజులుగా నిఫ్టీ 16,950-16,960 మధ్యే చలిస్తూ ట్రిపుల్‌ బాటమ్‌ ఫామ్‌ చేసింది. ఇప్పుడు నిఫ్టీకి 17,262, 17,429 వద్ద రెసిస్టెన్స్‌ ఉండొచ్చు. ఆ మేరకు సూచీలు ఎగిసే అవకాశం ఉంది.


మెరుగైన Q2 ఫలితాలు


ద్రవ్యోల్బణం భయాలు ఉన్నప్పటికీ భారత కంపెనీలు అంచనాలను మించే రాణిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ వంటి కంపెనీలు మెరుగైన గణాంకాలు నమోదు చేశాయి. దాంతో ఐటీ కంపెనీల షేర్లు ఎగిశాయి. విప్రో, మైండ్‌ట్రీ సైతం మంచి ఫలితాలే విడుదల చేశాయి. ఇవన్నీ మార్కెట్ల పెరుగుదలకు దోహదం చేశాయి.