Mindtree Q2 Results: గురువారం Q2 ఫలితాలను ప్రకటించిన IT కంపెనీ మైండ్‌ట్రీ, మార్కెట్ అంచనాలను బీట్ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (Q2FY23), లాభంలో 27.5% జంప్‌ను ఈ కంపెనీ నివేదించింది. ఆర్డర్ విన్స్ ఆరోగ్యకరంగా ఉన్నాయి.
లాభం రూ.508.7 కోట్లు
సెప్టెంబరు త్రైమాసికంలో, మైండ్‌ట్రీ ఆదాయం రూ.3,400.4 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ప్రకటించిన రూ.2,586.2 కోట్లతో పోలిస్తే, ప్రస్తుత ఆదాయ వృద్ధి 31.4 శాతం. ఆదాయం 27.5 శాతం పెరగొచ్చని మార్కెట్ ఎనలిస్ట్‌లు అంచనా వేయగా.. అంతకు మించి సాధించింది.
రూ.508.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఈ కంపెనీ మిగుల్చుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.399 కోట్లతో పోలిస్తే ఇది 27.5 శాతం జంప్. Q2లో ఈ కంపెనీ సగటను రూ.482 కోట్ల నికర లాభాన్ని నివేదించగలదని విశ్లేషకుల అంచనాలు వేశారు. ఈ అంచనాలను కూడా మైండ్‌ట్రీ బీట్ చేసింది.
గత త్రైమాసికంతో (ఏప్రిల్-జూన్) పోలిస్తే, ఆదాయం 8.9 శాతం, నికర లాభం 7.8 శాతం పెరిగాయి. ఆపరేటింగ్ మార్జిన్స్ 70 బేసిస్ పాయింట్లు తగ్గి 18.5 శాతానికి చేరాయి.
ఆర్డర్ బుక్
సెప్టెంబర్ త్రైమాసికంలో 518 మిలియన్ డాలర్ల ఆర్డర్ బుక్‌తో, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో (H1FY23) డీల్స్ 1 బిలియన్ డాలర్లను దాటాయి. ఇలా జరగడం కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేబషిస్ ఛటర్జీ తెలిపారు.
కమ్యూనికేషన్స్, మీడియా, టెక్నాలజీ వ్యాపారంలో బలమైన వృద్ధి కారణంగా కార్యకలాపాల ఆదాయం (ఆపరేటింగ్ రెవెన్యూ) 31.5% YoY వృద్ధితో రూ.3,400 కోట్లకు చేరుకుంది.
తగ్గిన అట్రిషన్ రేట్
కంపెనీ నుంచి ఉద్యోగ వలసలు (అట్రిషన్ రేట్) తగ్గాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అట్రిషన్ రేట్ 24.5 శాతంగా ఉండగా, జులై-సెప్టెంబర్‌లో అది 24.1 శాతానికి దిగి వచ్చింది. అయితే, గత సంవత్సరం ఇదే కాలంలోని 17.7 శాతం కంటే ఎక్కువగా ఉంది.
835 నియామకాలు
సమీక్షిస్తున్న త్రైమాసికంలో 835 మందిని ఈ కంపెనీ కొత్తగా నియమించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 38,290కి చేరింది.
ఎల్&టీ ఇన్ఫోటెక్‌తో (Larsen & Toubro Infotech Limited - LTI) ) విలీనానికి అవసరమైన అన్ని అనుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరిలోగా అందుతాయని మైండ్‌ట్రీ అంచనా వేస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.