Bharti Airtel Q4 Earnings: టెలికాం అగ్రగామి భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel) తాజా త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.2007 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలోని రూ.759.2 కోట్లతో పోలిస్తే 164.46 శాతం వృద్ధి కనబరిచింది. ఆర్థిక విశ్లేషకులు అంచనా వేసిన రూ.1587 కోట్లతో పోలిస్తే ఇదెంతో ఎక్కువ వృద్ధి కావడం గమనార్హం. ఇక ఎబిటా (EBITDA) రూ.15,998 కోట్లుగా ఉందని కంపెనీ తెలిపింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఎబిటా మార్జిన్ 50.8 శాతం, వార్షిక ప్రాతిపదికన చూస్తే 192 బీపీఎస్ నమోదు చేసిందని వెల్లడించింది.
ఒక మొబైల్ యూజర్‌పై వస్తున్న సగటు రాబడి (ARPU) 2022 నాలుగో త్రైమాసికంలో రూ.178 కోట్లు పెరిగిందని ఎయిర్‌టెల్ తెలిపింది. గతేడాది ఇది రూ.145 కోట్లుగా ఉంది. గతేడాది మూడో క్వార్టర్లో రూ.163 కోట్లు కావడం గమనార్హం. ప్రధాన పోటీదారైన రిలయన్స్ జియో ఏఆర్‌పీయూ మార్చి క్వార్టర్లో రూ.167గా ఉంది. భారీ లాభాలు రావడంతో ఇన్వెస్టర్లకు కంపెనీ డివిడెండ్ ప్రకటించింది. ఫుల్లీ పెయిడప్ ఈక్విటీ షేర్ హోల్డర్లకు (ఫేస్ వాల్యూ రూ.5) రూ.3, పార్ట్లీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ హోల్డర్లకు రూ.1.25 డివిడెండ్‌గా ఇస్తామని ఎయిర్‌టెల్ ప్రకటించింది.
వార్షిక ప్రాతిపదికన మొబైల్ డేటా వినియోగం 28.7 శాతం పెరిగిందని ఎయిర్‌టెల్ తెలిపింది. నెలకు ఒక కస్టమర్ వినియోగిస్తున్న డేటా 18.8 జీబీకి పెరిగిందని వెల్లడించింది. 'హోమ్స్ బిజినెస్‌లో వృద్ధి కొనసాగుతోంది. నాలుగో త్రైమాసికంలో 323,000 కస్టమర్లు కొత్తగా చేరారు. కంపెనీ ఏఆర్‌పీయూ రూ.178గా ఉంది. పటిష్ఠమైన బ్యాలెన్స్ షీట్, క్యాష్‌ఫ్లో ఉండటం వల్ల స్పెక్ట్రమ్ బకాయిలు త్వరగా తీర్చేస్తాం' అని ఎయిర్‌టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ గోపాల్ విఠల్ అన్నారు.
మెరుగైన ఫలితాలు వస్తాయన్న అంచనాతో ఎయిర్‌టెల్ షేర్లు ఈ రోజు రాణించాయి. ఉదయం 695 వద్ద ఓపెనైన షేరు ధర రూ.710 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. రూ.690 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. చివరికి రూ.12.40 లాభంతో రూ.750.60 వద్ద ముగిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.